అపసవ్య విధానాలతో ఆర్టీసీకి నష్టాలు!

ABN , First Publish Date - 2022-06-24T07:05:02+05:30 IST

ఆర్టీసీ రోజుకు రెండు మూడుకోట్ల రూపాయల మేరకు నష్టాలు చవిచూస్తున్నదన్న విశ్లేషణల నేపథ్యంలో ఇది రాస్తున్నాను. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాల వల్ల...

అపసవ్య విధానాలతో ఆర్టీసీకి నష్టాలు!

ఆర్టీసీ రోజుకు రెండు మూడుకోట్ల రూపాయల మేరకు నష్టాలు చవిచూస్తున్నదన్న విశ్లేషణల నేపథ్యంలో ఇది రాస్తున్నాను. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాల వల్ల దానికి ఈ పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరం ఆర్టీసీ ఆదాయానికి గుండె వంటిది. తెలంగాణ జనాభాలో ముప్పై శాతానికి పైగా హైదరాబాద్‌లో ఉన్నందున ఆర్టీసీకి ఆదాయంలో సింహభాగం ఇక్కడి నుంచే వస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు (అక్టోబర్ 2019) సిటీలో వున్న బస్సులు 3770. షెడ్యూల్డ్ కిలోమీటర్లు సెప్టెంబర్ 2019లో 273.52 లక్షలు, అక్టోబర్ 2021లో 263.36 లక్షలు. సెప్టెంబర్ 2019లో ఆపరేటెడ్ కి.మీ 272.97 లక్షలు, అక్టోబర్ 2021లో 229.66 లక్షలు. సెప్టెంబర్ 2019లో బస్సుల సంఖ్య 3770, అక్టోబర్ 2021లో 3122. కారణాలు ఏమైనా సమ్మె అనంతరం చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అర్థం. ఐదువందలకు పైగా బస్సుల ను తగ్గించారు. బస్సులతో పాటు అదేస్థాయిలో కిలోమీటర్లు కూడా తగ్గాలి కానీ, ఆరున్నర గంటల డ్యూటీని అనధికారికంగా ఎనిమిది గంటలు చేశారు. నాలుగు ట్రిప్పులుండే సర్వీసును రూట్ నిడివి పెంచి, రెండు ట్రిప్పులు చేశారు. ఆ విధంగా కార్మికులకు ఇచ్చే అలైటింగ్ సమయాన్ని కూడా కిలోమీటర్లుగా మార్చేశారు. రూట్ నిడివికి టికెట్ రెవెన్యూకు దగ్గర సంబంధం ఉంటుంది. రూట్ నిడివి పెరిగితే ఆదాయం తగ్గుతుంది. ఒకవైపు ఆదాయం తగ్గి మరోవైపు డీజిల్ వినియోగం పెరిగింది. తద్వారా ఇంధనం బిల్లు, దానిమీద పన్ను చెల్లింపులు పెరిగాయి. వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయం ఎవరికి పోతుందో మనకు తెలుసు. ఈ రోజు సబర్బన్, స్పెషల్ ఆఫ్, స్ప్లిట్ సర్సీసుల పేరిట సగటున ఒక్కో షిఫ్టుకు రోజుకు 170 కిలోమీటర్లు బలవంతంగా ఆపరేట్ చేయిస్తున్నారు.


ప్రస్తుతం వున్న సీటీ చార్జీల విధానంలో తొలి నాలుగు స్టేజీలు లేదా ఎనిమిది కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారి నుంచి అధిక టికెట్ రెవెన్యూ రావాలి. ఈ టికెట్ల నుంచి వచ్చే రెవెన్యూ సర్వీస్ రెవెన్యూలో అరవై శాతానికి పైనే ఉంటుంది. ప్రస్తుతం వున్న చార్జీల విధానంలో ప్రయాణించే దూరం పెరిగిన కొద్దీ ప్రయాణికుడు చెల్లించే సగటు కి.మీ చార్జీ తక్కువవుతుంది. ఆర్టీసీకి ప్రతి కి.మీ ఖర్చు సమానంగా ఉన్నప్పుడు ప్రయాణీకుల మధ్య వివక్ష ఎందుకు? ప్రయాణ దూరంతో నిమిత్తం లేకుండా అందరి వద్దా సమానంగా చార్జీ వసూలు చెయ్యాలి. ఈ అధిక చార్జీల కారణంగా, తొలి ఎనిమిది కిలోమీటర్ల మధ్య ప్రయాణించే వారి సంఖ్య తక్కువయ్యింది. దగ్గర దూరానికి ప్రయాణం చేసే వారినీ ఆర్టీసీ చేరదీయాలి. ఇప్పుడు స్లాబ్ పద్ధతిలో చార్జీలు వసూలు చేస్తున్నందున ఎనిమిది కి.మీ ప్రయాణానికి పన్నెండు కి.మీ. చార్జీని ప్రయాణికుడు చెల్లించాల్సివస్తోంది. అలా కాకుండా ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే చార్జీ ఉండాలి.


పల్లె వెలుగు బస్సులో వంద కి.మీలు ప్రయాణించే వారు చెల్లించేది కిలోమీటరుకు 85 పైసలు, 120కి.మీ ప్రయాణిస్తే 83 పైసలు చెల్లిస్తున్నారు. ఐదు కి.మీ ప్రయాణించే వారి వద్ద కిలోమీటరుకు రెండు రూపాయలు, 10 కి.మీ. ప్రయాణించే వారి నుంచి కిలోమీటరుకు ఒక రూపాయి వసూలు చేస్తున్నారు. దీంతో దగ్గర దూరం ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోయింది. అందువల్ల సిటీ బస్సులో ఎనిమిది కిలోమీటర్ల వరకు, పల్లెవెలుగు బస్సులో 15 కిలోమీటర్ల వరకు చార్జీలను భారీగా సవరించాలి. గతంలో సిటీ సర్వీసుల షెడ్యూలు డిపో స్థాయిలో ఒక అధికారి చూసుకునే వారు. ఇప్పుడు లేరు. అన్ని డిపోలు బస్సులను పీక్ సమయంలో నడిపితే, స్లాగ్ సమయంలో ప్రయాణికులను ఎవరు చూస్తారు? ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిపోలు షెడ్యూల్ వేయాలి. కేవలం బస్ పాస్ రెవెన్యూ కోసం నడుపుతున్న లాంగ్ రూట్ సర్వీస్ లను తగ్గించాలి.


ఆర్టీసీ ఆస్తులు విలువైనవి. వాటిని ఎంత అసమర్థంగా వినియోగిస్తున్నారో వివిధ డిపోల వద్ద నిరుపయోగంగా ఉన్న షాపుల్ని చూస్తే అర్థమవుతుంది. ఒక కండక్టర్ తక్కువ ఆదాయం తెస్తే తిప్పలు పెట్టే ఆర్టీసీ యాజమాన్యం ఆస్తుల సద్వినియోగం పట్ల కూడ అదే వైఖరిని చూపించాలి. ప్రజారవాణా అందరికీ అందుబాటులో ఉండాలి. ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా ప్రజలకు దూరం చేస్తున్నారు. ప్రజా రవాణా పటిష్ఠంగా ఉంటే వాతావరణ కాలుష్యం అదుపులో ఉంటుంది. ఆర్టీసీ కనీస టికెట్ పది రూపాయలు ఎందుకు? రెండు ప్రదేశాల మధ్య బస్సు ఖాళీగా నడిచినా, నిండా జనంతో నడిచినా ఇంధనం ఖర్చు అంతే. బస్సులను ఖాళీగా నడపాలా, నిండుగా నడపాలా అన్నది అధికారులు నిర్ణయించుకోవాలి.

ఎస్.బి.బి. చారి

Updated Date - 2022-06-24T07:05:02+05:30 IST