బోన్‌ సూప్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-22T17:53:57+05:30 IST

పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారం ఎముకల సూప్‌. ఈ సూప్‌తో నూరు శాతం ప్రయోజనాలు దక్కాలంటే రోజంతా ఎటువంటి ఘనాహారం తీసుకోకుండా, తరచుగా ఈ సూప్‌ తాగుతూ బోన్‌ సూప్‌ ఫాస్టింగ్‌ చేయాలి.

బోన్‌ సూప్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

ఆంధ్రజ్యోతి(22-02-2022)

పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారం ఎముకల సూప్‌. ఈ సూప్‌తో నూరు శాతం ప్రయోజనాలు దక్కాలంటే రోజంతా ఎటువంటి ఘనాహారం తీసుకోకుండా, తరచుగా ఈ సూప్‌ తాగుతూ  బోన్‌ సూప్‌ ఫాస్టింగ్‌ చేయాలి. 


ఎముకలు, మజ్జ, టెండాన్లు, చర్మం, లిగమెంట్లు... వీటిని ఎక్కువ సమయం పాటు ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు వెలువడి, సూప్‌లో కలుస్తాయి. గ్లైసీన్‌, ఆర్జినీన్‌, ప్రోలీన్‌ మొదలైన అమీనో యాసిడ్లతో పాటు, విటమిన్లు, ఖనిజ లవణాలు, గ్లూకోజమైన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఎముకల సూప్‌తో పొందవచ్చు. శరీరం మొత్తంలో ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణానికి తోడ్పడే కొల్లాజెన్‌ అనే ప్రొటీన్‌ ఎముకల సూప్‌లో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేనివాళ్లు, నెలలో ఒక రోజు ఎముకల సూప్‌ ఫాస్టింగ్‌ అనుసరిస్తే మంచిది.


ఆరోగ్య ప్రయోజనాలు

జీర్ణశక్తి: దీన్లో కొల్లాజెన్‌ ఉంటుంది. జీర్ణకోశం, పేగుల లోపలి పొర నిర్మాణానికి తోడ్పడుతుంది. కాబట్టి అజీర్తి, విరోచనాలు, మలబద్ధకం మొదలైన సమస్యలు తగ్గుతాయి.  


చర్మం: చర్మంలోని కణజాలాల నిర్మాణానికి కొల్లాజెన్‌ అవసరం. బోన్‌ సూప్‌లోని కొల్లాజెన్‌తో చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. సాగే గుణం పెరిగి, యువ్వనంగా కనిపిస్తుంది.   


పోషకాలు: నిండైన ఆరోగ్యానికి అవసరమైన అత్యవసర పోషకాలు ఎముకల సూప్‌లో లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్‌, ఎలకొ్ట్రలైట్స్‌ బోన్‌ సూప్‌తో దక్కుతాయి.  


కండరాలు: కండర పటుత్వంలో కీలక పాత్రను పోషించే అమీనో యాసిడ్‌ గ్లైసీన్‌. కణాల్లోకి శక్తిని ప్రవహింపచేసి, కండరాలకు శక్తినిచ్చే ఈ పోషకం తగ్గితే కండరాలు క్షీణించి, కండర నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అమీనో యాసిడ్‌ పుష్కలంగా దొరికే బోన్‌ సూప్‌ తీసుకోవడం ద్వారా కండరాలను బలపరుచుకోవచ్చు.  


కాలేయం: యాంటీ ఆక్సిడెంట్‌ గ్లూటాథియోన్‌ శరీరంలోని విషాలను సమర్థంగా హరించే డిటాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ బోన్‌ సూప్‌లో దొరుకుతుంది.  


ఇమ్యూనిటీ: ఈ సూప్‌తో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ మరింత బలపడుతుంది.  


నిద్ర: ఎములక సూప్‌లోని అమీనో యాసిడ్లు ఇన్హిబిటరీ న్యూరోట్రాన్స్‌మీటర్లలా పని చేస్తాయి. ఇవి నిద్రకు, స్పష్టమైన ఆలోచించగలిగే, నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యానికీ, జ్ఞాపకశక్తికీ తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి.

Updated Date - 2022-02-22T17:53:57+05:30 IST