25న టిడ్కో ఇళ్లకు లాటరీ

ABN , First Publish Date - 2020-12-02T06:05:03+05:30 IST

నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈనెల 25న లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించేందుకు గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సన్నాహాలు చేస్తోంది.

25న టిడ్కో ఇళ్లకు లాటరీ

వార్డుల వారీగా అర్హుల జాబితా తయారీలో సిబ్బంది

300 చదరపు అడుగుల ఇళ్లకు స్పాట్‌ రిజిస్ర్టేషన్‌


విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈనెల 25న లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించేందుకు గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సన్నాహాలు చేస్తోంది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 28,843 మందిని అర్హులుగా గుర్తించి డీడీలు స్వీకరించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన 24,192 ఇళ్లు మాత్ర మే అందుబాటులో వుండడం, అర్హులు అంతకంటే ఎక్కువమంది వుండడంతో...లాటరీ తీయాలని అధికారులు నిర్ణయించారు.  ఈనెల 25న జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో లాటరీ తీయాలని భావిస్తున్నారు. అందుకోసం అర్హులుగా తేలిన 28,843 మందిని వార్డుల వారీగా విభజించి సచివాలయ సిబ్బంది జాబితాలను తయారుచేస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన, ఇతర అధికారులు ఈనెల 10న అమరావతి వెళ్లి అర్హుల జాబితాను రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి, అధికారులకు అందజేయాలని నిర్ణయించారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలనే భావనలో ఉన్నారు. నిర్మాణం పూర్తయిన వాటిలో 300 చదరపు అడుగుల ఇళ్లు 5,227 కాగా మిగిలినవి 365, 430 చదరపు అడుగుల వైశాల్యం కలిగినవి. అయితే 300 చదరపు అడుగుల ఇళ్లను లాటరీ తీసిన రోజే లబ్ధిదారులకు అలాట్‌మెంట్‌ లెటర్లు అందజేయడంతోపాటు అక్కడే స్టాంప్‌ పేపర్‌పై రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. మిగిలిన ఇళ్లకు మాత్రం అలాట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి, బ్యాంకర్లతో లిం కేజీ, రుణం మంజూరు ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ర్టేషన్‌ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. లాటరీలో ఇళ్లు దక్కని వారికి డీడీలు వెనక్కి అంద జేసి, ఇంటి స్థలాలను అందజేయాలని భావిస్తున్నారు.

Updated Date - 2020-12-02T06:05:03+05:30 IST