కమలదళం ఉరకలు!

ABN , First Publish Date - 2022-07-02T08:39:03+05:30 IST

తెలంగాణలో కమలదళం ఉరకలు వేస్తోంది. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన బీజేపీ జెండాలు ఇప్పుడు పల్లెల్లోనూ రెపరెపలాడుతున్నాయి.

కమలదళం ఉరకలు!

  • టీఆర్‌ఎస్‌ చర్యలతో పుంజుకున్న బీజేపీ
  • గ్రామాల్లోనూ కాషాయ జెండాల రెపరెపలు
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత మరింత బలోపేతం
  • ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతోనే బలపడిన పార్టీ
  • ఇప్పుడు ద్వితీయశ్రేణి పట్టణాలు, పల్లెలకూ విస్తరణ
  • అధికార టీఆర్‌ఎస్‌తో నువ్వా? నేనా? అనే స్థాయికి


హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కమలదళం ఉరకలు వేస్తోంది. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన బీజేపీ జెండాలు ఇప్పుడు పల్లెల్లోనూ రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రంలో ఉనికిని చాటుకునే స్థాయి నుంచి అధికార టీఆర్‌ఎ్‌సకు నువ్వా? నేనా? అన్న స్థాయిలో పోటీ ఇచ్చేలా దూసుకెళుతోంది. ఈసారి అధికార పీఠం తమదేనని చెబుతున్న కమలనాథులు పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడంలో కొంత సఫలీకృతులయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఇలా విస్తరించడం వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో.. 1990లలో ‘ఒక ఓటు-రెండు రాష్ట్రాలు’ అంటూ నినాదాన్ని అందుకోవడం ఒకటి కాగా, ఇటీవల అధికార టీఆర్‌ఎస్‌.. బీజేపీయే లక్ష్యంగా చేస్తు న్న పోరాటం రెండో కారణమని అంటున్నారు. నిజానికి 1990లలో నక్సల్స్‌ ప్రభా వం ఎక్కువగా ఉండేది. ఉమ్మడి ఏపీలోని ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నక్సల్స్‌ దళాల కార్యకలాపాలు జోరుగా సాగేవి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్లు.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో బీజేపీ నేతలపై దాడులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు దొరకడం కష్టంగా ఉండేది. దొరికినా.. నక్సల్స్‌ బెదిరింపులతో రాజీనామా చేయాల్సి వచ్చేది. అయితే కాలక్రమేణా నక్సల్స్‌ ప్రభావం తగ్గుతూ వచ్చింది. అదే సందర్భంలో తెలంగాణ మలి దశ ఉద్యమం రాజుకుంది. తెలంగాణ ఉద్యమ కాలంలోనే బీజేపీ కూడా తన ఆలోచనలకు పదును పెట్టింది. 1997లో కాకినాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ‘ఒక ఓటు-రెండు రాష్ట్రాలు’ అంటూ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి మద్దతిస్తామని ప్రకటించింది. 


తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకొని..

2001లో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు కావడం, తెలంగాణ ఉద్యమం మరింత పుంజుకోవడంతో.. ఉద్యమంలో బీజేపీ కూడా తన వంతు పాత్రను పోషించింది. అయితే 1999లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడింది. అనంతరం 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయి, యూపీఏ-1 అధికారంలోకి రావడంతో మళ్లీ తెలంగాణ నినాదాన్ని అందుకుంది. ఆ ఎన్నికలకు ముందు 2004 జనవరిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోనే జరిగాయి. ఆ సందర్భంలోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణను ఏర్పాటు చేస్తామని అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ బహిరంగంగా ప్రకటించారు. అప్పటికే బీజేపీ 2000లో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీ్‌సగఢ్‌, బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ రాష్ట్రాలను విభజించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటినుంచే తెలంగాణ ఉద్యమంలో పార్టీ భాగస్వామ్యాన్ని బీజేపీ మరింత పెంచింది. కార్యకర్తల నుంచి రాష్ట్ర నేతల దాకా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పార్టీ ద్వితీయ శ్రేణి పట్టణాల్లోకి, పల్లెల్లోకి మరింత విస్తరించింది. 


తెలంగాణ ఏర్పాటు తర్వాత వేగంగా..

2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌  విజృంభణకు అన్ని పార్టీల్లాగే బీజేపీ కూడా కుదేలైంది. ఆ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా.. 2009 ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లు దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీజేపీ వేగంగా పుంజుకుంటూ వస్తోంది. పార్టీ క్యాడర్‌ మరింత పెరిగింది. దాంతో 2014 శాసనసభ ఎన్నికల్లో ఐదు సీట్లలో విజయం సాధించింది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ క్రమంలో 2018 ఎన్నికల్లో ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చినప్పటికీ.. అధికార టీఆర్‌ఎస్‌ చర్యలు బీజేపీకి జీవం పోశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మొదట్లో సఖ్యతగా ఉన్న సీఎం కేసీఆర్‌.. ఆ తరువాత వైరం పెంచుకుంటూ రావడం కూడా ఆ పార్టీ విస్తరణకు దోహదపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం బీజేపీకి బాగా కలిసివచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన అవకాశాలను బీజేపీ వినియోగించుకుంటూ బలాన్ని పెంచుకుంటోంది. ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థులం తామే అన్నంత స్థాయిలో పుంజుకుంటోంది. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి పట్టణాలే కాకుండా గ్రామాల్లోనూ పార్టీకి ఎంతో కొంత క్యాడర్‌ పెరిగింది. 


పడుతూ.. లేస్తూ.. విజయాలు సాధిస్తూ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలో గత కొంతకాలం దాకా బీజేపీ ప్రస్థానం పడుతూ, లేస్తూనే సాగింది. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పట్ల విపరీతమైన సానుభూతి ఉంది. దీంతో వెంటనే నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో హస్తం పార్టీ దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకుగాను ఏకంగా 414 స్థానాల్లో విజయదుందుభి మోగించించి. బీజేపీకి కేవలం రెండు ఎంపీ స్థానాలే దక్కగా.. అందులో ఒకటి వరంగల్‌ జిల్లా హన్మకొండ నియోజకవర్గం కావడం గమనార్హం. అక్కడి నుంచి చందుపట్ల జంగారెడ్డి సాధించిన విజయంతో పడ్డ పునాదులతో పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. 1998 సాధారణ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అనంతరం 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి 24 స్థానాల్లో పోటీచేసి 12 స్థానాలను కైవసం చేసుకుంది. ఆపై తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన తొలి ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఐదు స్థానాలను సాధించింది. 


అప్పుడే జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం 2018 అసెంబీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసి ఒక్కచోట మాత్రమే గెలిచినా..ఆ వెంటనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో సొంత బలంతో సాధించిన ఈ విజయాలు పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలోనూ గెలవడంతో శాసనసభలో బీజేపీ సభ్యుల సంఖ్య మూడుకు చేరింది. రెండేళ్ల క్రితం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ 48 స్థానాల్లో గెలుపొంది రాజధాని నగరంలో తన ప్రాబల్యాన్ని చాటింది. ఇటు రాజధాని నగరంతో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని పట్టణ ప్రాంతాల్లోనూ ఓటు బ్యాంకును పెంచుకుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో విజయానికి ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది. 

Updated Date - 2022-07-02T08:39:03+05:30 IST