కమలం కొత్త రూటు!

ABN , First Publish Date - 2022-07-05T08:27:23+05:30 IST

రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ.. అందుకు కొత్త పంథాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై పార్టీ కార్యక్రమాలను అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం సూచించింది.

కమలం కొత్త రూటు!

  • ఇకపై అసెంబ్లీ సెగ్మెంటు కేంద్రంగా కార్యక్రమాలు
  • క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లేలా కార్యాచరణ
  • నియోజకవర్గ జాతీయ, రాష్ట్ర ఇన్‌చార్జుల మార్పు
  • ఎన్నికల్లో పోటీచేసే స్థానికేతర ఇన్‌చార్జి తొలగింపు 
  • వారి స్థానంలో పార్టీ సీనియర్‌ నేతలకు బాధ్యతలు
  • బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం
  • నియోజకవర్గాల్లో నామ్‌కే వాస్తేగా ఉన్న మోర్చాలు
  • సెగ్మెంట్లలో కేంద్ర పరిశీలకుల పర్యటనల్లో వెల్లడి
  • నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ.. అందుకు కొత్త పంథాలో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై పార్టీ కార్యక్రమాలను అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం సూచించింది. ‘‘జిల్లా యూనిట్‌గా కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్‌గా తీసుకుని కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలు వస్తున్నాయి. విజయ సంకల్ప సభకు భారీ జన సమీకరణే ఇందుకు ఉదాహరణ. ఇక ముందు పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఇలాగే కొనసాగించండి’’ అని బీజేపీ అగ్రనాయకత్వం సూచించింది. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం చేయడం, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకులను పెద్ద ఎత్తున చేర్పించడం తదితర కార్యక్రమాలను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర నాయకత్వాని దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిపై బైక్‌ర్యాలీలు నిర్వహించాలని చెప్పినట్లు పేర్కొన్నాయి. 


నియోజకవర్గ ఇన్‌చార్జిల మార్పు..

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో బీజేపీ నియమించిన ఇన్‌చార్జిలను మార్చనున్నారు. ప్రస్తుతం ప్రతి సెగ్మెంటుకు ఇన్‌చార్జిగా స్థానికేతర నేత కొనసాగుతుండగా.. వీరిలో వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న వారిని ఈ బాధ్యతల నుంచి తప్పించనున్నారు. వీరి బదులు ఇతర సీనియర్‌ నేతలను ఇన్‌చార్జులుగా నియమించనున్నారు. సెగ్మెంటు ఇన్‌చార్జిలుగా ఉన్న జాతీయ నేతలను కూడా మార్చనున్నారు. ఎన్నికల వ్యూహకర్తలుగా గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల నేతలను ఇక్కడ సెగ్మెంటు ఇన్‌చార్జులుగా నియమించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ఎక్కువశాతం సెగ్మెంట్లలో పార్టీ మోర్చాలు స్వతంత్రంగా, క్రియాశీలకంగా పనిచేయలేకపోతున్నారని, సంస్థాగతంగా కమిటీలు వేయలేకపోతున్నారని, బూత్‌ అధ్యక్షులు పలువురు నామ్‌కే వాస్తే అన్నట్లుగా పనిచేస్తున్నారని ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన కేంద్రమంత్రులు.. జాతీయ నాయకత్వానికి రెండురోజుల కిందటే నివేదికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైతే బూత్‌ అధ్యక్షుడిని కొనసాగిస్తూనే స్థానికంగా ఉండే సీనియర్‌ నేతను ఇన్‌చార్జిగా నియమించే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. 


సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో భేటీ..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెండురోజుల పాటు కొనసాగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. కాగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. 


ఇక చేరికలపై బీజేపీ నజర్‌ 

విజయ సంకల్ప సభను, జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన బీజేపీ నేతలు ఇక ఇతర పార్టీ నుంచి చేరికలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాలు గ్రాండ్‌ సక్సెస్‌ అయిన నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్యనేతల చేరికలు జోరందుకుంటాయని భావిస్తున్నారు. పార్టీ అగ్రనాయకత్వం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో తామే అధికారంలోకి రాబోతున్నామన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించామని, ఇక చేరికల పర్వంతో కొత్త సమీకరణాలకు తెరతీయబోతున్నామని అంటున్నారు. పార్టీ అగ్రనేతల పర్యటన సమయంలోనే నలుగురు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడం మింగుడుపడని ఘటనగా మిగిలినా.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ దిగ్విజయం కావడం పార్టీలోకి వచ్చేవారికి భరోసా ఇస్తుందని విశ్వసిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆదివారమే కాషాయ కండువా వేసుకున్నందున.. మరికొందరు కూడా పార్టీలోకి వస్తారని అంచనా వేస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. 


‘‘ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు మాతో టచ్‌లో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతతో మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బలమైన నేతల కోసం ఉమ్మడి ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి సారించాం’’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. రెండు పార్టీల సీనియర్‌ నాయకులు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని, వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆషాడమాసం అయినందున.. ఆగస్టు, సెప్టెంబరు నుంచి చేరికలు పెరగడం ఖాయమన్నారు. మరోవైపు క్షేత్రస్థాయి నుంచి చేరికలను ముమ్మరం చేయాలని పార్టీ అధినాయకత్వం కూడా సూచించింది. బూత్‌ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చేరికలను వేగవంతం చేయాలని అమిత్‌షా.. రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం.


ఈటల కన్వీనర్‌గా చేరికల కమిటీ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ సోమవారం రాత్రి వివిధ కమిటీలను నియమించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌ ఉన్నారు. ఇక జితేందర్‌రెడ్డి కన్వీనర్‌గా, గరికపాటి మోహన్‌రావు, చాడ సురే్‌షరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, శాంతికుమార్‌, యోగానంద్‌తో కలిసి ఫైనాన్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలు, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై అధ్యయన కమిటీ కన్వీనర్‌గా ధర్మపురి అర్వింద్‌, సభ్యులుగా వివేక్‌, రఘునందర్‌రావు, స్వామిగౌడ్‌, ప్రకాశ్‌రెడ్డి, బాబీ అజ్మీరాను నియమించారు.

Updated Date - 2022-07-05T08:27:23+05:30 IST