మత్తులో జోగుతున్న యువత..గల్లీల్లో మహిళలు, పిల్లలు తిరగలేని పరిస్థితి..ఓ యువకుడు మరో యువకుడితో కలిసి..

Published: Thu, 07 Oct 2021 01:52:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మత్తులో జోగుతున్న యువత..గల్లీల్లో మహిళలు, పిల్లలు తిరగలేని పరిస్థితి..ఓ యువకుడు మరో యువకుడితో కలిసి..

నిర్మల్‌ కేంద్రంగా సాగుతున్న దందా 

సూర్యాపేట ఘటనతో మత్తు దందా గుట్టు రట్టు 

మత్తులో జోగుతున్న యువత 

పట్టణ ప్రాంతాల్లో రహస్య అమ్మకాలు 

బానిసలుగా మారుతున్న యువత

జోరుగా గంజాయి ఘాటు..


నిర్మల్‌: జిల్లా కేంద్రంగా గంజాయి రాకెట్‌ ‘హద్దులు’ మీరుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయికి యువత పెద్దసంఖ్యలో బానిసలుగా మారిపోతున్న కారణంగా అంతటా దీనికి డిమాండ్‌ పెరిగిపోతోంది. ముఖ్యంగా నిర్మల్‌ను అడ్డాగా చేసుకొని గంజాయి సిండికేట్‌ జోరుగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సూర్యాపేటలో పట్టుబడిన గంజాయి వ్యవహారం సిండికేట్‌ దందాగుట్టును రట్టు చేసింది. నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని కిషన్‌రావుపేట్‌కు చెందిన ఓ యువకుడు మరో యువకుడితో కలిసి పెద్దమొత్తంలో గంజాయిని తరలిస్తు సూర్యా పేట వద్ద పోలీసులకు పట్టుబడిన సంఘటన మొత్తం గంజాయి దందా వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో అంతట పంటగా గంజాయిని పెద్దఎత్తున సాగుచేస్తున్నారన్న ఫిర్యాదులు చాలా యేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. అడపా దడపా సం బంధిత అధికారులు నామమాత్రపు దాడులు జరిపి గుడుంబా తయారీని అడ్డుకుంటున్నారే తప్పా ఈ గంజాయి అక్రమసాగుపై పెద్దగా దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఏడాదిన్నర క్రితం సారంగాపూర్‌ మండలంలోని ఓ మారుమూల తండాలో అంతరపంటగా సాగవుతున్న గంజాయి పంటను పోలీసులు వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఎకరాల్లో ప్రతియేటా పెద్దమొత్తంలో గంజాయిని సాగుచేస్తుండడం సంప్రదాయంగా మారిందంటున్నారు. ఇక్కడ సాగవుతున్న గంజాయినే కాకుండా మహారాష్ట్ర నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న గంజాయిని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారంటున్నారు. అలాగే కొంతకాలం క్రితం ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్‌లో సైతం పెద్దమొత్తంలో గంజాయిని పట్టుకున్నారు.


రెండు మూడు సంవత్సరాల నుంచి జిల్లాలో కూడా గంజాయి వినియోగం పెద్దఎత్తున పెరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలుగ్రామాల్లోనే కాకుండా నిర్మల్‌, భైంసా ,ఖానాపూర్‌ పట్టణాల్లో యువత ఎక్కువగా గంజాయికి బానిసలుగా మారిపోయారంటున్నారు. ముఖ్యంగా నిర్మల్‌ పట్టణంలోని పలు స్లమ్‌ ప్రాంతాల్లోని యువకులు గంజాయి లేకుంటే బతకలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారంతా గంజాయి మత్తులోనే జోగుతూ తమ ఆరోగ్యాలను క్షీణింపజేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాకేంద్రంలోని పలు శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయంటున్నారు. పోలీసులు గాని ఎక్సైజ్‌ అధికారులు గాని గంజాయి విక్రయాల పైనా అలాగే దానికి బానిసలవుతున్న యువకులపైనా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తుండడంతో గంజాయి అమ్మకందారులు దానికి బానిసలవుతున్న వారు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నా యి. గంజాయి విషయంలో ఎక్సైజ్‌శాఖ ఇప్పటి వరకు ఆశించిన చర్యలు తీసుకోలేదన్న వాదనలున్నాయి. ఎక్సైజ్‌శాఖకు సంబంధించిన నిఘా వ్యవస్థ వైఫల్యంతో అంతటా గంజాయి మత్తు గుప్పుమంటోందంటున్నా రు.


అయితే స్థానికంగా గంజాయికి డిమాండ్‌ ఉన్న కారణంగా ఇక్కడ జోరుగా విక్రయాలు సాగిస్తూనే ఇతర జిల్లాలకు సైతం దీనిని ఎగుమతి చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కొంతమంది జిల్లాకు చెందిన మరికొంతమంది సిండికేట్‌గా ఏర్పడి కార్లలోనూ, ఇతర గూడ్స్‌ వాహనాల్లోనూ గంజాయిని సరిహద్దులు దాటిస్తున్నారన్న విమర్శలున్నాయి. పాం డ్రకోడా, నాగ్‌పూర్‌తో పాటు నాందేడ్‌, ధర్మాబాద్‌ లాంటి ప్రాంతాల నుంచి గంజాయిని జిల్లాలోకి చేరవేస్తున్నారంటున్నారు. స్థానికంగా సాగవుతున్న గంజాయితో పాటు అక్రమంగా దిగుమతి అవుతున్న గంజాయిని ఈ సిండికేట్‌ ముఠా అక్రమపద్దతుల్లో ఇతర ప్రాంతాలకు ఎగు మతి చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.  


నిర్మల్‌ కేంద్రంగా సిండికేట్‌

కాగా గంజాయి అక్రమదందాకు నిర్మల్‌ అడ్డాగా మారిందంటున్నారు. సరిహద్దుల్లోని మహరాష్ట్ర నుంచి అక్రమమార్గాల గుండా జిల్లాకు పెద్దమొత్తంలో దిగుమతి అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు జిల్లాలోని అనేక మారుమూల గ్రామాల్లో గంజాయిని అంతరపంటగా రహస్యంగా సాగుచేస్తున్నారు. ఇలా సాగైన గంజాయిని అక్కడే అరబెట్టి సంచుల్లో ప్యాక్‌ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి దందాను సాగిస్తున్న గంజాయి సిండికేట్‌ ఇక్కడ సాగైన గంజా యిని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. నిర్మల్‌లోని కొన్ని శివారు ప్రాంతాల్లో ఇలా సేకరించిన గంజాయిని ఓ రహస్య ప్రదేశంలో భద్రపర్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటున్నారు. గంజాయి దందా సాగించే వారంతా ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని ఆ నెట్‌వర్క్‌ ద్వారా తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. 


మత్తులో యువత చిత్తు 

గత కొంతకాలం నుంచి యువత గంజాయికి పూర్తి గా బానిసలవుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. మొదట్లో గంజాయిని సాధువులు, సంతులు అలాగే భజన బృందాల సభ్యులు, యాచకులు వినియోగించేవారు. క్రమంగా గంజాయియూత్‌ను ఎక్కువగా ఆకర్షిస్తోంది. గంజాయికి యువత బానిసలుగా మారిపోతుండడం ఈ దందాను సాగించే వారికి వరమవుతుండగా తల్లిదండ్రులకు శాపమవుతోంది. గంజాయికి బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేసేందుకు తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్ల ముందే పిల్లలు గంజాయికి మత్తులో జోగుతున్న దృశ్యాలను చూసి కొంతమంది తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారంటున్నారు. శివారు ప్రాంతాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకొని చాలా మంది యువకులు గంజాయిని వినియోగిస్తుండడం గమనార్హం.  


నిఘా వైఫల్యంతోనే..

అక్రమ గంజాయి సాగు అలాగే వ్యాపారంపైనా సంబందిత శాఖ సరియైున నిఘా సారించకపోతుండడం ఈ దందా నిర్వహకులకు కలిసోస్తోతందంటున్నారు. ఎక్సైజ్‌, పోలీసు శాఖలు ఉమ్మడిగా గంజాయి సేవిస్తున్న యువకులను విచారిస్తే అసలు గుట్టు రట్టవుతోందంటున్నారు. ఈ రెండు శాఖలు ఉమ్మడిగా సరియైున నిఘా సారిస్తే గంజాయి దందా సూత్రధారుల గుట్టు కూడా పూర్తిగా రట్టుకానుంది. సూర్యాపేట్‌లో పట్టుబడిన మామడ మండలం కిషన్‌రావుపేట్‌ యువకుడిని అక్కడి పోలీసులు విచారించి అసలు సూత్రదారుల వివరాలను జిల్లా అదికారులకు చేరవేసిననట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని చాలా గల్లీల్లో ఇంటికో బెల్ట్‌ షాపు ఏర్పాటవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ బెల్ట్‌ షాపుల కారణంగా గల్లీల్లో మహిళలు, పిల్లలు తరగలేని పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. ఇకనైనా సంబందిత యంత్రాంగం గంజాయి విషయంలో సీరియస్‌ చర్యలు మొదలుపెట్టకపోతే యువత భవిష్యత్‌కు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదంటున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.