జోరుగా వరికోతలు

ABN , First Publish Date - 2021-05-05T06:00:38+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో వరికోతలు ఊపందుకున్నాయి. యాసంగి సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

జోరుగా వరికోతలు

  • కొనుగోలుకు తెరుచుకున్న 11 కేంద్రాలు 
  • మరో రెండు రోజుల్లో 17 కేంద్రాలు ప్రారంభం 
  • ఇప్పటికే 282 టన్నుల ధాన్యం సేకరణ
  • కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు
  • రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేతికందుతున్న ధాన్యం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): జిల్లాలో యాసంగి వరికోతలు ఊపందుకున్నాయి. దీనికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పంట సాగుకు అనుగుణంగా జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 11 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 282 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. మిగత 17 కేంద్రాలు రెండుమూడు రోజుల్లో రైతులకు అందుబాటులోకి రానున్నాయి.  


  • ధాన్యం సేకరణ లక్ష్యం 50వేల మెట్రిక్‌ టన్నులు

గత ఏడాది 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 23,870 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ఈసారి నియంత్రిత సాగు విధానం అమలులోకి రావడంతో పంట విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో వరిసాగు ప్రణాళిక 46,555 ఎకరాలు కాగా 35,550 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఇందుకు సంబంధించి 28 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 282 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. 


  • రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు..

రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చూస్తున్నారు. ధాన్యం సేకరణకు రాగానే వెంటనే రైతు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు వారి ఖాతాలో డబ్బులు జమచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో జమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్‌లను సిద్ధంగా ఉంచే విధంగా చూస్తున్నారు. 


  • అన్నిశాఖల అధికారుల భాగస్వామ్యం

వానాకాలం సీజన్‌ మాదిరిగా పూర్తిస్థాయిలో అన్ని శాఖల అధికారులను ధాన్యం కొనుగోలులో భాగస్వాములను చేస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 


  • కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా..

జిల్లాలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటంతో ధాన్యం సేకరణకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొనుగోలు సమయంలో రైతులు, సిబ్బంది మాస్కులు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. అవసరమైన వారిని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు అనుమతిస్తున్నారు. హమాలీలు, వాహన డ్రైవర్లు కూడా ఈ నిబంధన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 


  • మరో రెండు రోజుల్లో.. 

మిగతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరో రెండు రోజుల్లో తెరుచుకోనున్నాయి. షాద్‌నగర్‌, కొందుర్గు, మేకగూడ, కందుకూరు, పాలమాకుల, బండ రావిర్యాల, బాచారం, గౌరెల్లి, రాచకొండ, మైలారం, కొత్తపేట, డీసీఎంఎస్‌ పరిధిలో షాబాద్‌, కోహెడ, నాగిళ్ల, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆద్వర్యంలో షాద్‌నగర్‌, ఆమనగల్లు, సర్దార్‌నగర్‌, మంచాలలోని కొనుగోలు కేంద్రాలు రెండు మూడు రోజుల్లో తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు.


2020-21 యాసంగిలో సాగు ఇలా

పంట ప్రణాళిక విస్తీర్ణం సాగు విస్తీర్ణం         కొనుగోలు   ధాన్యం కొనుగోలు

(ఎకరాల్లో) (ఎకరాల్లో) కేంద్రాలు     లక్ష్యం(టన్నులు)

వరి 46,555 35,550   28         50,000


  • ఓపెన్‌ అయిన కేంద్రాలివే


ప్రాథమిక రైతు సహకార సంఘాల పరిధిలో ఆమనగల్లు, కడ్తాల, పడకల్‌, వెల్జాల్‌, మంచాల, బోడకొండ, శంకర్‌పల్లి, మల్కారం, డీసీఎంఎస్‌ పరిధిలో ఇబ్రహీంపట్నం, యాచారం, చింతపట్ల కొనుగోలు కేంద్రం రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని కేంద్రాల్లోకి ఇంకా ధాన్యం రాలేదు. మిగతా కేంద్రాల్లో ఇప్పటి వరకు 282 టన్నుల ధాన్యం సేకరించారు.


  • రైతులకుఇబ్బంది కలగనీయం


ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటివరకు 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మిగతావి రెండు రోజుల్లో రైతులకు అందుబాటులోకి తీసుకు రానున్నాం. అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చాం. 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

- శ్యామరాణి, జిల్లా పౌరసరఫరాల డీఎం 

Updated Date - 2021-05-05T06:00:38+05:30 IST