లోవ భక్తుల కష్టాలు తీరేది ఎన్నడో?

ABN , First Publish Date - 2022-05-14T07:06:15+05:30 IST

తూర్పుకనుమల్లో కొలువైన తలుపులమ్మ లోవదేవస్థానంలో భక్తులకు కష్టాలు తప్పడంలేదు. వేలాదిగా తరలివస్తున్న భక్తుల నుంచి ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఆలయ అభివృద్ధిపట్ల దేవదాయశాఖ దృష్టి సారించకపోవడం భక్తుల పాలిట శాపమైంది.

లోవ భక్తుల కష్టాలు తీరేది ఎన్నడో?

  • ఆదాయం ఉన్నా అభివృద్ధి శూన్యం
  • ప్రతిపాదనలు పంపినా అనుమతులు లేని వైనం

తుని రూరల్‌, మే 13: తూర్పుకనుమల్లో కొలువైన తలుపులమ్మ లోవదేవస్థానంలో భక్తులకు కష్టాలు తప్పడంలేదు. వేలాదిగా తరలివస్తున్న భక్తుల నుంచి ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఆలయ అభివృద్ధిపట్ల దేవదాయశాఖ దృష్టి సారించకపోవడం భక్తుల పాలిట శాపమైంది. పాలకులు, అధికారులు మారుతున్నా లోవలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన మారింది. ప్రసిద్ధ క్షేత్రంగా వెలుగొందుతున్న లోవదేవస్థానానికి అమ్మవారి దర్శనార్థం వ్యయ ప్రయాసలకోర్చి భక్తులు తరలివస్తూ ఉంటారు. ప్రకృతి రమణీయంగా దర్శనమిచ్చే ఈ క్షేత్ర దర్శనానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. పర్వదినాల్లో లక్షలాదిమంది అమ్మవారిని దర్శించి తరిస్తుంటారు. ఏటా రూ.6కోట్లు పైబడి భక్తుల నుంచి ఆదాయం సమకూరుతోంది. 300ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో వసతులు కరువవ్వడంతో ఇప్పటికీ ఆరు బయట వంటా, వార్పులు చేసుకుని భక్తులు కుటుంబసభ్యులతో సహపంక్తి భోజనాలు చేస్తూ ఉంటారు. ఆలయ అభివృద్ధి, భక్తుల అవసరాలకు అనుగుణంంగా ఆలయ అభివృద్ధి కమిటీ రూ.1.80కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, రూ.కోటితో మహామండపం పనులకు సంబంధితశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపినా నేటికీ అనుమతులు రాలేదు. ఆదాయం ఉన్న ఆలయంలో అభివృద్ధికి చొరవ చూపకపోవడం దారుణమంటూ పలువురు ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా దేవదాయశాఖా మంత్రి స్పందించి అభివృద్ధి పనులకు అనుమతులిచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Read more