అప్పుడే రైలు దిగాడో వ్యక్తి.. స్టేషన్ బయట కనిపించిన ఓ పిచ్చివాడిని చూసి షాక్.. అతడు ఎవరో గుర్తుపట్టి..

ABN , First Publish Date - 2022-07-19T13:00:39+05:30 IST

అతడు నగరంలో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా జీవించేవాడు. తెలివైన వాడంటూ బాసుల చేత ప్రశంసలూ పొందాడు. దాంతో ఇక అతడికి తిరుగే

అప్పుడే రైలు దిగాడో వ్యక్తి.. స్టేషన్ బయట కనిపించిన ఓ పిచ్చివాడిని చూసి షాక్.. అతడు ఎవరో గుర్తుపట్టి..

- బిచ్చగాడిగా మారిన విద్యాధికుడు

- మూడేళ్ల తరువాత గుర్తించి ఇంటికి తీసుకొచ్చిన కుటుంబీకులు


ప్రేమిస్తే సినిమా గుర్తుందా? అందులోని హీరో భరత్.. తన ప్రియురాలు విడిచి వెళ్లిపోయేసరికి పిచ్చోడిలా మారిపోతాడు. సరిగ్గా ఈ ఫోటోలోని వ్యక్తి కధ కూడా అదే. అయితే భరత్‌లా ఇతనేమి చదువు రాని వాడు కాదు. విద్యాధికుడు. ప్రభుత్వోద్యోగి. అయితేనేమీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరికైనా కామన్ కదా. తన ప్రియురాలు వదిలి వెళ్లేసరికి భరించలేకపోయాడు. పిచ్చోడిలా మారిపోయాడు. ఆంగ్ల పత్రికలు పట్టుకుని బిగ్గరగా చదువుతూ, అరుస్తూ ఉంటే పిచ్చోడనుకుని ఎవరూ పట్టించుకోలేదు. మరి ఈ వ్యక్తి ప్రేమిస్తే సినిమాలో మాదిరిగా తన ప్రియురాలి కంట పడ్డాడో.. లేదో కానీ తన బంధువు కంట మాత్రం పడ్డాడు. వారించి ఇంటికి తీసుకెళదామంటే అసలు అర్ధం చేసుకునే పరిస్థితిలో లేడు. దీంతో ఆ బంధువు పోలీసుల సాయంతో అతని రూపురేఖలు మార్చి తన తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు.. అసలు కథలోకి వెళితే..


చెన్నై, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అతడు నగరంలో మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా జీవించేవాడు. తెలివైన వాడంటూ బాసుల చేత ప్రశంసలూ పొందాడు. దాంతో ఇక అతడికి తిరుగే లేదనుకున్నారంతా..! కానీ విధి కన్ను కుట్టిందో, ఏ దేవత ఆగ్రహించిందో గానీ.. అతడి జీవితం కొద్దికాలంలోనే తల్లకిందులైపోయింది. ప్రేమ పేరుతో అతడికి దగ్గరైన యువతి.. అంతలోనే అతడిని తిరస్కరించింది. దాంతో అతడి హృదయం బద్దలైంది. తను మెచ్చిన నెచ్చెలి దూరమవడంతో అతడి మనసూ ముక్కలైపోయింది. వికలమైన మనసుతో అతడు జ్ఞాపకశక్తినీ కోల్పోయాడు. పిచ్చోడిలా రోడ్లపై తిరుగుతూ, దొరికింది తింటూ మూడేళ్లపాటు మృతిభ్రమించిన భిక్షగాడిలా కన్నియాకుమారిలో జీవించాడు. కానీ ఓ బంధువు అతడిని గుర్తించడంతో ఎట్టకేలకు అతడు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. వివరాలిలా వున్నాయి...


తెన్‌కాశి జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35) రాజపాళయంలో బీకామ్‌ పాసై, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివాడు. ఆ తర్వాత నాలుగేళ్లక్రితం చెన్నైలోని ఓ సంస్థలో మంచి ఉద్యోగంలో చేరాడు. ఇక్కడే ఓ మేన్షన్‌లో బసచేసేవాడు. అదే సమయంలో తన సంస్థలో పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. కానీ మొదట అతడితో సన్నిహితంగా ఉన్న ఆ యువతి.. అనంతరకాలంలో అతడి ప్రేమను తిరస్కరించింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న ముత్తు 2018 నవంబర్‌ 13న మేన్షన్‌ నుంచి మాయమయ్యాడు. కుటుంబీకులు అతడి ఆచూకీ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.


 ఈ నేపథ్యంలో కన్నియకుమారి వెళ్లిన ముత్తు బంధువొకరు ఆదివారం అక్కడి రైల్వేస్టేషన్‌ సమీపంలో సన్యాసిలా ముళ్లుపడిన శిరోజాలతో ఉన్న ముత్తును గుర్తించాడు. అతడిని పలుకరించేందుకు ప్రయత్నించాడు. కానీ ముత్తు అవేవీ గ్రహించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఆ బంధువు పోలీసులను ఆశ్రయించి ముత్తును పట్టుకోగలిగాడు. అనంతరం అతడిని సెలూన్‌కు తీసుకెళ్లి గుండుగీయించి, స్నానం చేయించి, కొత్త దుస్తులు ధరింపజేశారు. అనంతరం స్టేషన్‌లో పెట్టి, అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్న ముత్తు తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు, ముగ్గురు చెల్లెళ్లు అతడిని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న ఎస్‌ఐలు గణేశ్‌కుమార్‌, జయకుమార్‌, పోలీసులు మాట్లాడుతూ.. ముత్తు పిచ్చోడని అనుకున్నామని, ఇంగ్లీషు పేపర్లు పట్టుకుని బిగ్గరగా చదువుతూ తిరుగుతుండేవాడని గుర్తు చేసుకున్నారు. పర్యాటకులు ఇచ్చే ఆహారపదార్థాలు తింటూ కాలం గడిపేవాడన్నారు. 



Updated Date - 2022-07-19T13:00:39+05:30 IST