జోరు నిరసనల్లో ప్రేమజంట ముద్దులు

ABN , First Publish Date - 2022-07-15T23:41:30+05:30 IST

నిరసనకారులు ఆయన నివాసంలోకి చొచ్చుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతటి సంకటంలో ఒక ప్రేమ జంట ముద్దు పెట్టుకుంటూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ నెటిజెన్లు ‘‘ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం’’ అంటూ రాసుకొస్తున్నారు...

జోరు నిరసనల్లో ప్రేమజంట ముద్దులు

కొలంబో: శ్రీలంక(srilanka)లో కొనసాగుతున్న నిరసనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిరసనలకు భయపడి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఇప్పటికే దేశాన్ని వదిలేసి పారిపోయారు. నిరసనకారులు ఆయన నివాసంలోకి చొచ్చుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతటి సంకటంలో ఒక ప్రేమ జంట ముద్దు పెట్టుకుంటూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ నెటిజెన్లు ‘‘ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం’’ అంటూ రాసుకొస్తున్నారు.


తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో చోట ఐదు రోజులు క్యూలో నిల్చుంటే కానీ పెట్రోల్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనై నిరసనకు దిగారు. కొంత కాలంగా కొనసాగుతున్న నిరసనల కారణంగా శ్రీలంక ప్రభుత్వం పడిపోయింది. ప్రధానమంత్రి, అధ్యక్షుడు తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా, ఈ నిరసనకారుల్లోనే ఒక ప్రేమ ముద్దు పెట్టుకుంటూ కనిపించింది.


శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులు, మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స (Mahindra Rajapaksa), మాజీ మంత్రి బసిల్ రాజపక్స (Basil Rajapaksa) దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన సోదరులిద్దరూ జూలై 28 వరకు దేశం విడిచి వెళ్ళకూడదని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. మహింద, బసిల్‌లపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.


కాగా, శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో నిరసనలు పెల్లుబకడంతో గొటబయ రెండు రోజుల క్రితం దేశం విడిచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-07-15T23:41:30+05:30 IST