మళ్లీ ‘లవ్‌స్టోరి’ కాంబినేషన్‌: సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాతలు

Sep 24 2021 @ 20:20PM

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం మీడియాతో సంతోషాన్ని పంచుకున్నారు.


ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఇప్పుడున్న టైమ్‌లో థియేటర్లకు ఆడియెన్స్ ఎంతవరకు వస్తారు అని రిలీజ్ ముందు భయపడ్డాం కానీ ఇవాళ థియేటర్స్‌లో ప్రేక్షకులను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. లవ్ స్టోరి చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల అడ్రస్ చేసిన ఇష్యూస్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ అంశాలన్నింటినీ సినిమా చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారు. లవ్ స్టోరి సినిమా థియేటర్‌లలో చూడాల్సిన సినిమా. తప్పకుండా థియేటర్లకు రండి మీరు మూవీని ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులకి, చిత్రానికి పనిచేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అన్నారు.


హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. మా సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. స్టార్స్ ఎందరో ట్వీట్స్ చేసి మరి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ మా సినిమా ప్రమోషన్‌కు సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. లవ్ స్టోరి వినోదం కోసం చూసే సినిమా మాత్రమే కాదు.. ఇందులో మన చుట్టూ సమాజంలో, మన ఇంట్లో జరిగే అవకాశమున్న సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లకు ఇంట్లో, బయటా ఇబ్బందిగా ఉంటే మీరు తప్పకుండా అడగాలి. అలాంటి మార్పు లవ్ స్టోరి చూశాక వస్తే మేము సంతోషిస్తాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్‌ను టచ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములగారిని అభినందించాలి.. అన్నారు.


నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. చిత్ర సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సినిమా బాగుందంటూ ప్రతి థియేటర్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో భారీగా రిలీజైన సినిమా మాదే. ఇంత గ్రాండ్ రిలీజ్ కు మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, సాయి పల్లవి.. ఇలా ఈ టీమ్ తో మాకు మంచి బాండింగ్ ఉంది. అందుకే మా అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది.. అని తెలపగా మరో నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. చిత్ర సక్సెస్ గురించి ఇవాళ ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇదే కాంబినేషన్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములగారు నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా.. అన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.