ప్రేమించారు... దొంగలుగా మారారు

ABN , First Publish Date - 2022-07-07T05:46:24+05:30 IST

కడప జిల్లాకు చెందిన ఆ ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ మరోఇద్దరు అమ్మాయి లను ప్రేమించారు. వారిని తీసుకుని జిల్లాలోని తాడిపత్రికి మకాం మార్చారు.

ప్రేమించారు... దొంగలుగా మారారు
చైనస్నాచింగ్‌ అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ

  కుటుంబం గడవడం కోసం గొలుసు దొంగతనాలు

రెండు వేర్వేరు చైనస్నాచింగ్‌ ముఠాలకు చెందిన ఐదుగురి అరెస్ట్‌

 రూ.28లక్షల విలువైన 48తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం

అనంతపురం క్రైం, జూలై 6: కడప జిల్లాకు చెందిన ఆ ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ మరోఇద్దరు అమ్మాయి లను ప్రేమించారు. వారిని తీసుకుని జిల్లాలోని తాడిపత్రికి మకాం మార్చారు. కుటుంబం గడవటం కష్టమైంది. దీంతో సులభంగా డబ్బు సంపాదించడానికి గొలుసు దొంగతనాల ను మార్గంగా ఎంచుకుని పోలీసుకు దొరికిపోయారు. రెండు వేర్వేరు గొలుసు దొంగల ముఠాలకు చెందిన ఐదుగురు నిందితులను అనంతపురం వనటౌన, సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.28లక్షల విలువైన 48తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొదటి ముఠాలోని కడప జిల్లా జమ్మల మడుగు పట్టణానికి చెందిన పూల నవీనకుమార్‌, పూల నిఖిల్‌, కడప జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన కామేపర్తి శివకుమార్‌లను, రెండో ముఠాలోని కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాల్కి గ్రామానికి చెందిన మోడికర్‌ పరశు అలియాస్‌ పరశురాం, దేవదుర్గ్‌ గ్రామానికి చెందిన మోడికర్‌ వెంకప్పలను అరెస్ట్‌ చేశారు. బుధవారం జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేంద్రుడు, అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషాలతో కలిసి జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు. 


జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి మకాం...

కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పూల నవీనకుమార్‌, పూల నిఖిల్‌ అన్నదమ్ములు. నవీనకుమార్‌ కారుడ్రైవర్‌గా పనిచేస్తుండగా, నిఖిల్‌ తిరుపతిలోని అమర్‌రాజా బ్యాటరీలో ఎలక్ర్టీషియనగా పనిచేసేవాడు. ఈ ఇద్దరూ వేర్వేరుగా ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డారు. వారితో కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలోని తాడిపత్రికి మకాం మార్చారు. కుటుంబం గడవటం కష్టం కావడంతో చైనస్నాచింగ్‌లకు వ్యూహరచన చేశారు. పెయింటర్‌గా ఉన్న తమ స్నేహితుడు కామేపర్తి శివకుమార్‌తో జత కలిసి గొలుసు దొంగతనాలు చేయడం ఆరంభించారు. ఈ ముగ్గురూ అనంతపురం నగరంలోని ఆదర్శనగర్‌, ఎల్‌ఐసీ కాలనీ, న్యూ రెవెన్యూ కాలనీ, కేఎం కాలనీ, అరవిందగర్‌లలో మొత్తం 8 చైనస్నాచింగ్‌లు, పులివెందుల పట్టణంలో -3, గుంతకల్లులో-1, ప్రొద్దుటూరు పట్టణంలో-1 చొప్పున 13  చైనస్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వీరి నుంచి 48 తులాల బంగారు ఆభరణాలు, పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. 


చెడు వ్యసనాలతో....

రెండో ముఠాలో అరెస్టయిన నిందితులు మోడికర్‌ పరశు, మోడికర్‌ వెంకప్ప సమీప బంధువులు కావడంతో చిన్నప్పటి నుంచి స్నేహితులుగా మెలిగారు. ఇద్దరికీ చెడు వ్యసనాలున్నాయి. ఒక చోట నుంచి ఇంకోచోటికి సంచరిస్తూ నిలిపి ఉన్న లారీలలో నిద్రిస్తున్న డ్రైవర్ల వద్ద డబ్బు, సెల్‌ఫోన్లు కొట్టేసేవారు. వాటితో పాటు చైన స్నాచింగ్‌లకూ పాల్పడ్డారు. అనంతపురం వనటౌన పరిధిలో చైనస్నాచింగ్‌ చేయడంతో పాటు, శింగనమల పోలీస్‌ స్టేషన పరిధిలో నిలిపిన లారీ డ్రైవర్‌ నుంచి రూ.5వేలు నగదు దొంగలించారు. వారి నుంచి 41గ్రాముల బంగారు నగలు, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 


ప్రశంసలు...

ఇటీవల జరిగిన చైనస్నాచింగ్‌ల ఛేదింపుపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో సీఐలు రవిశంకర్‌రెడ్డి, వహీద్‌బాషా, ఎస్‌ఐ జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఫరూక్‌, శ్రీనివాసులు, అనిల్‌, శ్రీధర్‌ ఫణి, విక్టర్‌, దాస్‌, పాండవ బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. పక్కా సమాచారంతో ఆ ముఠాలను వేర్వేరుగా అరెస్ట్‌ చేశారు. ఛేదింపులో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-07-07T05:46:24+05:30 IST