ముందైతే కట్టేద్దాం..!

ABN , First Publish Date - 2020-09-22T05:30:00+05:30 IST

క్రమబద్ధీకరణ చేసిన స్థలాలకే రిజిస్ట్రే షన్‌లు చేయాలని ప్రభుత్వం నూతన ఎల్‌ఆర్‌ఎస్‌ విధా నం తీసుకురావడం తో అనధికార

ముందైతే కట్టేద్దాం..!

ఆ తరువాత ఏంచేయాలో చూద్దాం

ఎల్‌ఆర్‌ఎస్‌పై చాలా మందిది ఇదే ధోరణి

పాలమూరు జిల్లాలో ఇప్పటికీ 4500 వరకు దరఖాస్తులు

పాలమూరు పురపాలికలో 30 వేల వరకు వస్తాయని అంచనా

గతంలో రూ.10 వేలు చెల్లించిన దరఖాస్తులు మూడు వేలకు పైనే

ప్రజలకు అవగాహన కల్పించడంలో చొరవ చూపని యంత్రాంగం


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 22: క్రమబద్ధీకరణ చేసిన స్థలాలకే రిజిస్ట్రే షన్‌లు చేయాలని ప్రభుత్వం నూతన ఎల్‌ఆర్‌ఎస్‌ విధా నం తీసుకురావడం తో అనధికార స్థలా లు కలిగి ఉన్న వారంతా ఇప్పుడు క్రమపద్ధీకరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టా రు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనధికార స్థలాలు, వెంచర్లు ఉండటంతో వారంతా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకొని తమ స్థలాల ను క్రమబద్ధీకరించుకోవాలని భావిస్తున్నా, దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేక పోవడం, అధికార యంత్రాంగం కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేయక పోవడంతో ప్రజల్లో రకరకాల సందే హాలు ఉన్నాయి. తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి ఎల్‌ఆర్‌ఎస్‌పై చర్చిస్తున్నా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండటంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.


అయితే ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసుకునేం దుకు ఆక్టోబర్‌ 15 వరకు గడువు ఇచ్చింది. ఇందుకోసం ఆ న్‌లైన్‌లో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేయాలని చెప్పడంతో ముందైతే రూ.1000 కట్టేద్దాం..ఆ తరువాత సంగతి తరువాత చూసుకుందామని దరఖాస్తులు చేసుకునేందుకు పోటీ పడు తున్నారు. పాలమూరు పురపాలికలో 2011-12లో చుట్టూ ఉన్న పది గ్రామా లు విలీనమయ్యాయి. ఆ తరువాత పెద్దఎ త్తున స్థలాలు వెంచర్లుగా ప్లాట్లు విక్రయించారు. వీటన్నింటిని గ్రామ పంచాయతీ అనుమతులతోనే ఇచ్చారు. ఇందులో వేల సంఖ్య లో ఇళ్ల నిర్మాణాలు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించారు.


ప్లానింగ్‌ ప్రకారం అనుమతులు తీసుకున్నవారు చాలా తక్కువ మంది ఉండటంతో మిగ తావన్నీ అనధికార స్థలాలే కానున్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ ఎల్‌ఆర్‌ ఎస్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఎవరికైనా విక్రయిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ లేనం దున కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యే అవకా శం ఉండటంతో వాటికి తప్పని సరిగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు మాత్రం గ్రామ పం చాయతీ అనుమతి అధికారికంగా నిబంధనల ప్రకారం ఉంటే చెల్లుబాటు అవుతాయని చెబుతున్నా విలీన గ్రామాల్లో కేవలం సర్పంచ్‌లు సంతకాలు చేసి ఇచ్చిన అనుమతులే 80 శాతం వరకు ఉన్నాయి. చాలా మంది ఎల్‌ ఆర్‌ఎస్‌ లేకుండా ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా ఎల్‌ ఆర్‌ఎస్‌ చేసుకోవాల్సి ఉంది. అయితే 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించిన సమయంలో పాలమూరులో 11 వేల దరఖాస్తులు రాగా అందులో ఎనిమిది వేలు పరిష్కారం కాగా మరో మూడు వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.


పాలమూరు జిల్లాలో నాలుగు వేల దరఖాస్తులు 

పాలమూరు జిల్లాలోని మూడు పురపాలికల పరిధిలో ఇప్ప టి వరకు 4500 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పాల మూరు పురపాలికలోనే మూడు వేల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. జడ్చర్లలో 1100, భూత్పూర్‌లో 400  వరకు వచ్చాయి. అయితే సమయం ఉండటం, ఇంకా చాలామందిలో సందేహాలు ఉండటంతో చివరివారం ,పదిరోజుల్లోనే పెద్దఎత్తున దర ఖాస్తులు వచ్చే సూచనలు కనిపిస్తున్నారు. ఒక్క పాలమూరు పురపాలిక పరిధిలోనే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.


అవగాహన కల్పించడంలో విఫలం..

ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో చాలా మందికి సందేహాలు ఉన్నా యి. ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా ఏళ్లతరబడి స్థలాలు కొని పెట్టు కున్నవారు.. గ్రామ పంచాయతీ అనుమతులతో ఇళ్లు నిర్మాణా లు చేపట్టిన వారు ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎప్‌ కట్టుకోవాలా.. వద్దా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్‌ సర్వేయర్లు, అధికారులు, తెలిసినవారి దగ్గర చర్చలు జరుపుతున్నారు. ఎక్కడ చూసినా ఎల్‌ఆర్‌ఎస్‌ గురించే చర్చ సాగుతోంది. అయి తే జిల్లా అంతటా అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు అవగాహన కల్పించడంలో చొరవ తీసుకోని కారణంగా చాలా మందిలో రకరకాల అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విలీన గ్రామ స్రజలను రకరకాల సందేహాలు తొలుస్తున్నాయి. 

Updated Date - 2020-09-22T05:30:00+05:30 IST