ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక

ABN , First Publish Date - 2020-12-02T06:03:57+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక

ఎల్‌ఆర్‌ఎస్‌లో కదలిక

పట్టణాల్లో సర్వే నంబర్ల వారీగా క్లస్టర్లు

స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు

ఐదు మున్సిపాలిటీల్లో 60,163 దరఖాస్తులు

సర్వే నంబర్ల గుర్తింపు తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన

గ్రామాల దరఖాస్తులపై అందని మార్గదర్శకాలు

పల్లెల్లోనూ 45,916 స్థలాల రెగ్యులరేషన్‌కు దరఖాస్తు


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు1: ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను అమలు చేయడానికి తొలి అడుగు పడింది. అక్టోబరు 31 వరకు స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధిత అధికారులు వచ్చేదెన్నడో అని అంతా ఎదురుచూస్తున్నారు. దాదాపు నెలరోజుల వ్యవధిలోనే మరో ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 

 సిద్దిపేట జిల్లా అంటేనే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికి ఓ కేంద్ర బిందువుగా నిలుస్తున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతోపాటు అనూహ్యమైన స్థాయిలో అభివృద్ధి జరగడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వందలాదిగా వెంచర్లు వెలిశాయి. వేలాది స్థలాలు చేతులు మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తలపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్దీకరణ విషయంలోనూ లక్ష పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అనుమతులు లేకుం డా వెలసిన వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లు భారీగా ఉండడంతో వీటన్నింటినీ రెగ్యూలరైజ్‌ చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. 


మున్సిపాలిటీల్లో క్లస్టర్ల ఏర్పాటు

 జిల్లాలోని సిద్దిపేట, ప్రజ్ఞాపూర్‌-గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలున్నాయి. ఈ ఐదు పట్టణాల్లో 60,163 దరఖాస్తులను ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం సమర్పించారు. వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటే ముందుగా ఆయా స్థలాలు ఉన్న సర్వేనంబర్లను గుర్తించాలని నిర్ణయించారు. అందుకే సర్వేనంబర్ల వారీగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో బృందాన్ని నియమించనున్నారు. ఉదాహరణకు సిద్దిపేట పట్టణంలో 33,447 దరఖాస్తులు రాగా 225 క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ దరఖాస్తులను సర్వే నంబర్ల వారీగా వేరు చేయనున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసిన ప్లాట్లు ఎలాంటి భూమిలో ఉన్నాయని తేల్చనున్నారు. అంటే ప్రభుత్వ భూమి, వక్ఫ్‌భూమి, దేవాదాయ, అసైన్డ్‌ భూమిలో ఉందా అని పరిశీలించనున్నారు.  ఆ సర్వే నంబర్ల పాత రికార్డులను కూడా పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు  సమాచారం. ఏవైనా వివాదాలు తేలితే వాటిని నోట్‌ చేసుకుంటారు. క్రమబద్ధీకరణ సమయంలో వీటికి  సంబంధించిన ఇతర ఆధారాలను సమర్పించాలని సూచించనున్నారు. ప్రస్తుతం సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌లో క్లస్టర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. దుబ్బాక, చేర్యాలలో ఆ దిశగా ఇప్పటివరకైతే చర్యలు చేపట్టలేదు. 


గ్రామాల్లోనూ 45,916 దరఖాస్తులు

 ఎల్‌ఆర్‌ఎస్‌ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణాలతో పాటు గ్రామాల్లోని ప్లాట్లను రెగ్యులర్‌ చేసుకునే అవకాశం కల్పించారు. జిల్లాలోని 323 గ్రామాల నుండి 45,916 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 609 లేఅవుట్‌ దరఖాస్తులున్నాయి. ప్రధానంగా సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాల పరిధిలో ఉన్న గ్రామాల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. మిగితా గ్రామాల్లో అంతంతమాత్రంగానే ఉంటాయి. కొన్ని గ్రామాల్లో 10లోపే దరఖాస్తులు ఉన్నట్లు తెలిసింది.  గ్రామాల్లోని దరఖాస్తుల గురించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ముందుగా పట్టణాల్లోని సర్వే నంబర్లు పూర్తయ్యిన తర్వాత గ్రామాల వారీగా కూడా క్లస్టర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 


వేధిస్తున్న సిబ్బంది కొరత

 ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకటికి రెండు సార్లు పరిశీలన జరిపి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఉన్న సిబ్బంది రోజువారీ పనుల్లోనే బిజీగా ఉంటారు. ఇక సర్వేనంబర్లను పరిశీలించి, ఆ తర్వాత రెగ్యులరైజేషన్‌ కోసం విచారణ జరపడం అనేది  ఉన్న సిబ్బందికి తలనొప్పిగానే పరిణమిస్తుంది. అయితే ఈ క్లస్టర్‌ బృందాలతో ఎవరెవరిని నియమిస్తారోననే విషయం కూడా తేలలేదు. వేలాది ప్లాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటే మరింత మంది సిబ్బందిపై ఆధారపడాల్సిందే. అయితే మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించే వారితోపాటు ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 


Updated Date - 2020-12-02T06:03:57+05:30 IST