ఎల్‌ఆర్‌ఎస్‌పై.. నిరాసక్తి

ABN , First Publish Date - 2021-11-25T05:39:17+05:30 IST

అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణదారులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది.

ఎల్‌ఆర్‌ఎస్‌పై.. నిరాసక్తి

గడువు పొడిగిస్తున్నా స్పందన అంతంతే 

వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు 

దరఖాస్తుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం


గుంటూరు(కార్పొరేషన్‌), నవంబరు 24: అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణదారులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది. మొదట్లో గుంటూరు నగర పాలక సంస్థతో పాటు పలు మున్సిపాలిటీల్లో భవన యజమానుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. అయితే అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకోవడంతో ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన అంతగా ఉండటంలేదు. ప్రభుత్వం వరుసగా గడువులు పొడిగిస్తున్నా.. గుంటూరుతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు అంతగా రావడంలేదు.  2022 మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు తుది గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయినా దరఖాస్తులు పెద్దగా వస్తాయని అధికారులే ఆశించడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


పెండింగ్‌లో 554 దరఖాస్తులు

అరకొరగా వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను కూడా అధికారులు సక్రమంగా పరిష్కరించడంలేదు. గుంటూరు కార్పొరేషన్‌, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, రేపల్లె, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి మున్సిపాలిటీలలో సుమారు 554 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌లపై శ్రద్ధ చూపడంలేదని అందువల్లే దరఖాస్తుదారులు ముందుకురావడంలేదని సమాచారం. 


పుట్టగొడుల్లా అక్రమ లేఅవుట్లు

గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో అక్రమ లేఅవుట్‌లు పుట్టగొడుల్లా వెలుస్తున్నాయి. గుంటూరు నగరం నల్లపాడు సమీపంలోని సర్వే నెం 393లో అనధికారకంగా లేఅవుట్లు వేశారు. అనుమతి లేకుండా ప్లాట్లుఅమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులకుభారీగా ముడుపులు అందాయని సమాచారం. పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనుమతులు పొందకుండానే ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారాల్లో భారీగా ముడుపులు అందుతున్నాయని అందువల్లే ఎల్‌ఆర్‌ఎస్‌ను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.


Updated Date - 2021-11-25T05:39:17+05:30 IST