పార్కులో సరదాగా నడుస్తున్న వృద్ధ జంటకు.. అనుకోకుండా వరించిన అదృష్టం.. అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-07T12:42:37+05:30 IST

అమెరికాలోని వృద్ధ దంపతులు నొరీన్ రెడ్‌బర్గ్, ఆమె భర్త మైకేల్ రిటైర్డ్ అయిపోయారు. ఇద్దరికీ టైంపాస్ కోసం పార్కులకు వెళ్లడం అలవాటు. అలా సరదా కోసం ఓ రోజు అర్కాన్సాస్‌లోని క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కుకి వారు వెళ్లారు. అక్కడ వారిద్దరూ నడుస్తూ ఉండగా ఏదో మెరుస్తున్న వస్తువు నొరీన్ కంట పడింది..

పార్కులో సరదాగా నడుస్తున్న వృద్ధ జంటకు.. అనుకోకుండా వరించిన అదృష్టం.. అసలు ఏం జరిగిందంటే..

అమెరికాలోని వృద్ధ దంపతులు నొరీన్ రెడ్‌బర్గ్, ఆమె భర్త మైకేల్ రిటైర్డ్ అయిపోయారు. ఇద్దరికీ టైంపాస్ కోసం పార్కులకు వెళ్లడం అలవాటు. అలా సరదా కోసం ఓ రోజు అర్కాన్సాస్‌లోని క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కుకి వారు వెళ్లారు. అక్కడ వారిద్దరూ నడుస్తూ ఉండగా ఏదో మెరుస్తున్న వస్తువు నొరీన్ కంట పడింది. మొదట ఆమె ఏదో గాజు వస్తువు అనుకొంది. కానీ ఏదో కుతూహలం కొద్దీ దగ్గరకు వెళ్లి చూసింది.


మెరుస్తున్న ఆ వస్తువునను నొరీన్ చేతిలో తీసుకొని చూసింది. పసుపు పచ్చగా మెరుస్తున్న రాయిలా ఉంది. అది ఒక వజ్రం అని ఆమెకు తెలియలేదు, కానీ ఏదో విలువైన రాయిలా ఆమెకు తోచింది. క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కు వజ్రాలకు ప్రసిద్ధం. ఇప్పడా ఆ పార్కు సామాన్య ప్రజల ఉపయోగం కోసం తెరవబడింది. పార్కులోని కొంత భాగంలో ఇప్పటికీ వజ్రాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు, కానీ ఆ ప్రాంతం ప్రజలకు అందుబాటులో లేదు. 


నొరీన్ ఆ రాయిని తీసుకొని పార్కులోని డైమండ్ డిస్కవరీ సెంటర్ వద్దకు వెళ్లింది. అక్కడి సిబ్బంది అది ఒక పసుపు రంగు వజ్రం అని గుర్తించారు. నొరీన్ అదృష్టం ఏంటంటే పార్కు నియమాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతంలో దొరికిన వజ్రాలు ప్రజలకే చెందుతాయి. అలా నొరీన్‌కు దొరికిన వజ్రం ఆమెకే సొంతం. ఆ వజ్రం 4.38 క్యారెట్ల బరువు ఉంది. ఆ వజ్రం జెల్లీబీన్ ఆకారంలో ఉంది. 


ఆ వజ్రం విలువ ఎంతో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, నాణ్యతను బట్టి ఆ వజ్రం విలువ 15 వేల డాలర్ల(11 లక్షల రూపాయలు) నుంచి 85 వేల డాలర్ల(65 లక్షల రూపాయలు) వరకూ ఉండవచ్చని డైమండ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1906 నుంచి క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కులో ఇప్పటివరకు 75వేల వజ్రాలు దొరికాయని సమాచారం.

Updated Date - 2021-10-07T12:42:37+05:30 IST