భోజనం సరే.. వసతులేవీ?

ABN , First Publish Date - 2022-06-26T05:29:06+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. 3-6 ఏళ్లలోపు ప్రీస్కూల్‌ పిల్లలకు ఇప్పటికే పాలు, గుడ్డుతో పాటు భోజనం ఇస్తున్నారు. జూలై 1 నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా భోజనంతో పాటు 200 మి.లీ. పాలు, గుడ్డు అందించేందుకు ఐసీడీఎస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

భోజనం సరే.. వసతులేవీ?
ఇరుకుగా ఉండే అద్దెభవనంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం.


అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం

జూలై 1 నుంచి గర్భిణులు, బాలింతలకు..

(టెక్కలి రూరల్‌)

 టెక్కలి మండలం తిర్లంగి పంచాయతీలోని ఓ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఏడుగురు గర్భిణులు, ఇద్దరు బాలింతలు ఉన్నారు. ఇది అద్దె భవనంలో కొనసాగతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేవు. తాగునీరు లేదు. చిన్నారులు ఆడుకునేందుకు స్థలం లేదు. చిన్న గదిలో ప్రీస్కూల్‌ విద్యను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం అమలు కష్టతరంగా ఉంటుంది.

 టెక్కలి మేజరు పంచాయతీలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో 30 మందికిపైగా గర్భిణులు, 15 మంది బాలింతలు ఉన్నారు. సొంత భవనం ఉన్నా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం లేవు. ఇలాంటప్పుడు ఈ కేంద్రంలో మధ్యాహ్న భోజనం ఎలా అందిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని అధిక శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేవు. 

అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. 3-6 ఏళ్లలోపు ప్రీస్కూల్‌ పిల్లలకు ఇప్పటికే పాలు, గుడ్డుతో పాటు భోజనం ఇస్తున్నారు. జూలై 1 నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా భోజనంతో పాటు 200 మి.లీ. పాలు, గుడ్డు అందించేందుకు ఐసీడీఎస్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయగా.. కరోనా నేపథ్యంలో ఆగిపోయింది. ప్రత్యామ్నాయంగా టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోమ్‌ రేషన్‌) పద్ధతిలో బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, చిక్కీ, బెల్లం తదితర సామగ్రిని అందించేవారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కేంద్రాల్లో ప్రీస్కూల్‌ విద్యను అమలు చేస్తూ 3-6 ఏళ్ల వయస్సు చిన్నారులకు మఽధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపించేవారు. తాజాగా ఐసీడీఎస్‌ ఉన్నతాధికారుల ఆదేశాలతో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం(హాట్‌ మీల్‌)ను అందిస్తారు. జిల్లాలో 14 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 3,358 కేంద్రాలుండగా, 16,639 మంది గర్భిణులు, 18,303 మంది బాలింతలు, 7 నెలలు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,03,614 మంది ఉన్నారు. 


సౌకర్యాల మాటేంటి?

అంగన్‌వాడీ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలు, స్థల సమస్య, భోజనం చేసేందుకు తగిన ఏర్పాట్లపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చాలావరకు తాగునీరు, మరుగుదొడ్లు, ఇరుకు స్థలంలో అద్దె భవనాల్లో కేంద్రాల నిర్వహణ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం ఎలా అమలు చేస్తారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. నిండు గర్భిణులు, నెలల పసికందులు కలిగిన బాలింతలు కేంద్రాల్లో నేలపై భోజనం చేయడం కష్టంగానే ఉంటుంది. గతంలో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసినప్పుడు కూడా టీహెచ్‌ఆర్‌ పద్దతిలోనే సరుకులను అందజేయాలని గర్భిణులు, బాలింతలు కోరారు. 


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ఉన్నతాధికారుల ఆదేశించారు. జూలై 1 నుంచి అమలు చేసేందుకు సెక్టార్‌ సూపర్‌వైజర్ల ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచనలు చేశాం. కూరగాయలు, పోపులు తదితర వాటికి సంబంధించి బిల్లుల మంజూరుకు ఉన్నతాధికారుల సూచనలతో ముందుకు వెళ్తాం. 

- బి.తులసీలక్ష్మి, ఐసీడీఎస్‌ పీవో, కోటబొమ్మాళి


భోజనానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది:

అంగన్‌వాడీ కేంద్రాల్లో జూలై 1 నుంచి మధ్యాహ్నం అమలు చేస్తారని చెబుతున్నారు. అయితే కేంద్రానికి వెళ్లి భోజనం చేయాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వసతులు లేకపోవడంతో నేలపైనే కూర్చుని భోజనం చేయాలి. టీహెచ్‌ఆర్‌ పద్ధతిలో ఇంటికి రేషన్‌ ఇస్తే బావుంటుంది.

- డి.భవానీ, గర్భిణి, టెక్కలి మండలం






Updated Date - 2022-06-26T05:29:06+05:30 IST