గాడితప్పిన ‘మధ్యాహ్న భోజనం’

ABN , First Publish Date - 2021-02-26T05:10:15+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గాడితప్పుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. పథకం నిర్వాహకుల ఎంపికలో రాజకీయ రంగు పులమడంతోనే నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయి.

గాడితప్పిన ‘మధ్యాహ్న భోజనం’
మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలను సరిదిద్దాలంటూ కేపీఎం స్కూల్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు (ఫైల్‌ )

కానరాని మెనూ అమలు

కొన్ని పాఠశాలల్లో తప్పుగా హాజరు నమోదు

నేడు జిల్లాకు ఎండీఎం డైరెక్టర్‌ రాక

(పార్వతీపురం)

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గాడితప్పుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. పథకం నిర్వాహకుల ఎంపికలో రాజకీయ రంగు పులమడంతోనే నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఏజెన్సీలు కాసుల కోసం కక్కుర్తి పడి మెనూ సరిగా అమలు  చేయడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో హెచ్‌ఎంలు ఏజెన్సీలతో కుమ్మక్కు అవుతున్నారు. ఇలా అనేక కారణాలతో మధ్యాహ్న భోజన పథకం గాడితప్పింది. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖాధికారులు పథకం అమలు ఎలా ఉందో కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కాగా ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో లోపాలు బయటపడుతున్నాయి. బహిర్గతమైన తరువాత తీసుకున్న చర్యలతోనైనా నిర్వాహకుల్లో మార్పు రాకపోవడం విచారకరం. గుమ్మలక్ష్మీపురం జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ లో లోపాలు గుర్తించి హెచ్‌ఎంను సస్పెండ్‌ చేశారు. ఇక్కడ 29 మంది విద్యార్థులు హాజరు కాగా 126 మంది హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసిన కారణంగా ఈ చర్య తీసుకున్నారు. ఇది జరిగిన తరువాత కూడా కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇటీవల కురుపాం మండల కేంద్రంలోని పాఠశాలలోనూ.. పార్వతీపురం పట్టణంలోని కేపీఎం పాఠశాలలోనూ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. 

ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ శివాని మైతిలి జిల్లాకు శుక్రవారం రానున్నారు. కురుపాం సంఘటనపై విచారణకు సీఎం ఆదేశించడంతో ఆమె జిల్లాకు వస్తున్నారు. పథకం నిర్వహణలో లోపాలను సరిచేయడంతో పాటు ఏజెన్సీలతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రక్షాళన చేస్తేనే ఉపయోగం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. డైరెక్టర్‌ రాక విషయాన్ని డీఈవో నాగమణి వద్ద ప్రస్తావించగా ఎండీఎం డైరెక్టర్‌ శివాని మైతిలి శుక్రవారం జిల్లాకు వస్తున్న మాట వాస్తవమే అన్నారు. కురుపాంలో జరిగిన ఘటనపై వివరాలను స్వీకరించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 


Updated Date - 2021-02-26T05:10:15+05:30 IST