లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు.. నివారణ

ABN , First Publish Date - 2022-05-31T17:34:03+05:30 IST

లంగ్‌ క్యాన్సర్‌ పురుషుల్లో ఎక్కువే అయినా స్మోకింగ్‌, పొగాకు వాడకం, సెకండ్‌ హ్యాండ్‌ లేదా ప్యాసివ్‌ (పొగ తాగే వారి పక్కన ఉండడం) స్మోకింగ్‌ వల్ల గత కొన్నేళ్లుగా

లంగ్‌ క్యాన్సర్‌ లక్షణాలు.. నివారణ

ఆంధ్రజ్యోతి(31-05-2022)

నేడు వరల్డ్‌ టొబాకో డే

లంగ్‌ క్యాన్సర్‌ పురుషుల్లో ఎక్కువే అయినా స్మోకింగ్‌, పొగాకు వాడకం, సెకండ్‌ హ్యాండ్‌ లేదా ప్యాసివ్‌ (పొగ తాగే వారి పక్కన ఉండడం) స్మోకింగ్‌ వల్ల గత కొన్నేళ్లుగా ఈ క్యాన్సర్‌ మహిళల్లో కూడా కనిపిస్తోంది. సిగరెట్లలో 60కి పైగా క్యాన్సర్లకు దారి తీసే నాలుగు వేలకు పైగా రసాయనాలు ఉంటాయి. లంగ్‌ క్యాన్సర్‌కు ఇతర అవయవాలకు వ్యాపించే గుణం ఎక్కువగా ఉంటుంది. లంగ్‌ క్యాన్సర్‌కు పొగతాగడం ఒక కారణమైతే, రేడాన్‌ గ్యాస్‌, ఆస్‌బెస్టాస్‌, వాతావరణ కాలుష్యం వంటివి ఇతర కారణాలు. తీవ్రతను బట్టి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.


సాధారణ లక్షణాలు ఇలా..

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం

బాగా దగ్గు, దాంతో పాటు రక్తం పడడం

ఆకలి, బరువు తగ్గడం, అలసట

ఛాతీలో, పొట్టలో నొప్పి

మింగడం కష్టంగా మారడం


లంగ్‌ క్యాన్సర్లలో రకాలు

1. స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎస్‌.సి.ఎల్‌.సి)

2. నాన్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌ (ఎన్‌.ఎ్‌స.ఎల్‌.సి)

3. క్యాన్సర్‌ వచ్చిన భాగం నుంచి ఇతర అవయవాలకు వ్యాప్తి చెందేవి


వ్యాధి నిర్థారణ పరీక్షలు

లక్షణాలు ఉన్నవారికి ముందుగా ఛాతీ ఎక్స్‌రేతో పాటు, బయాప్సీ, సిటి స్కాన్‌, పెట్‌ సిటి స్కాన్‌ పరీక్షలు చేయవలసి ఉంటుంది. కళ్లెను పరీక్షించడంతో పాటు, ఊపిరితిత్తుల పనితీరును తెలిపే స్పైరోమెటీర, లంగ్స్‌ను ఎండోస్కోపీతో పరీక్షించే బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షల వంటివి చేసి, క్యాన్సర్‌ లంగ్స్‌లోని ఏ ప్రాంతానికి సోకిందీ, దాని స్టేజీ, గ్రేడ్‌లను  నిర్థారించి, చికిత్స మొదలుపెడతారు.


చికిత్స ఇలా...

ముందుగా క్యాన్సర్‌ను గుర్తిస్తే, లోబెక్టమీ చేసి లంగ్‌లో క్యాన్సర్‌ వచ్చిన భాగాన్ని తొలగిస్తారు. నాన్‌ స్మాల్‌ సెల్‌ క్యాన్సర్‌కు సర్జరీ చేస్తారు. కానీ స్మాల్‌ సెల్‌ లంగ్‌ క్యాన్సర్‌కు ఎక్కువగా వ్యాప్తి చెందే గుణం ఉంటుంది కాబట్టి రేడియోథెరపీ, కీమో వంటివి ఎంత కాలం తీసుకోవలసి ఉంటుందో నిర్ణయిస్తారు. వయసు పెద్దదై, క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తిస్తే, తీవ్రతను తగ్గించి, వారు బ్రతికి ఉన్నంత కాలం వీలైనంత ఉపశమనం దక్కులా ‘పాలియేటివ్‌ కేర్‌’ అందిస్తారు. 


నివారణ

పొగతాగడం మానేయడంతో పాటు పొగ తాగేవారికి దూరంగా ఉండాలి. అలాగే వాతావరణ కాలుష్యాన్నీ, నీటి కాలుష్యాన్నీ తగ్గించుకుంటే మన లంగ్స్‌ పదిలంగా ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌, క్షయ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి పొరబడి, చికిత్స దారి తప్పే ప్రమాదమూ ఉంటుంది. మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే టిబి, దగ్గు ద్వారా వ్యాపిస్తుంది. క్షయ వ్యాధి ఉన్నవారికి చాలా దగ్గరగా ఉన్నప్ప్పుడు, ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి, రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు వ్యాధి రూపంలో బయల్పడుతుంది. కాబట్టి టిబికి గురైనా, టిబితో బాధపడేవారికి చేరువలో ఉన్నా, టిబి, ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఇక్కడ పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకుని, అది టిబి అయినా, లేక లంగ్‌ క్యాన్సర్‌ అయినా నిర్లక్ష్యం చేయకుండా వెద్యుల సలహా మేరకు నిర్ణీతకాలం పాటు చికిత్స తీసుకోవాలి. చికిత్స మధ్యలో ఆపకుండా, పూర్తి కాలం పాటు కొనసాగించడం మంచిది. క్యాన్సర్‌ అయితే చికిత్స పూర్తయిన తర్వాత కూడా వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉండాలి.


డాక్టర్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

Updated Date - 2022-05-31T17:34:03+05:30 IST