లగ్జరీ కార్ల దందా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-07-21T19:58:47+05:30 IST

విదేశీ రాయబారుల పేరుతో బుకింగ్స్.. లగ్జీరీ కార్ల దిగుమతిలో అడ్డదారులు..

లగ్జరీ కార్ల దందా గుట్టు రట్టు

హైదరాబాద్: విదేశీ రాయబారుల పేరుతో బుకింగ్స్.. లగ్జీరీ కార్ల దిగుమతిలో అడ్డదారులు.. ముంబయి టూ హైదరాబాద్ ఖరీదైన కార్ల దందా.. లగ్జీరీ కార్ల స్కామ్‌పై అనుమానం వచ్చిన అధికారులు ముంబయిలో తీగలాగితే హైదరాబాద్‌లో లింకులు బయటపడ్డాయి. ఈ ముఠా 50కిపైగా లగ్జరీ కార్లను ప్రముఖులకు, రాజకీయ నేతలకు అమ్మినట్లు సమాచారం. ఆపరేషన్ మాంటే కార్లో ఇలా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.


రాయబారుల పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్ల స్కామ్‌పై ముంబయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆపరేషన్ మాంటే కార్లో హైదరాబాద్‌లోని ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు బయటపడ్డాయి. ముంబయి అధికార్ల సమాచారంతో హైదరాబాద్‌లోని డీఆర్ఐ అధికారులు ఈనెల 19న మలక్‌పేట ప్రాంతంలో ఖరీదైన నిస్సాన్ పెట్రోల్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ముంబయి ముఠా నుంచి పలువురు కార్లు కొనుగోలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


గత కొంత కాలంగా ముంబయి పోర్టుకు 50 వరకు కార్లు దిగుమతి అయ్యాయని వాటిలో చాలా కార్లు హైదరాబాద్‌లో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల ధర కనీసం రూ. కోటిపైనే ఉంటుంది. వాటిని ఎక్కువగా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ స్టార్లు కొనుగోలు చేస్తుంటారు.


విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లకు భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచి  కార్లను దిగుమతి చేసుకునే రాయబారులకు పన్ను మినహాయిoపు ఉంటుంది. అయితే రాయబారులను ఆసరాగా చేసుకుని ముంబై మాఫియా విచ్చలవిడిగా విదేశాల నుంచి కార్లు దిగుమతి చేస్తోంది. ఈ కార్లను ముంబయి నుంచి మణిపూర్‌లో ఓ మారుమూల షోరూంలో రిజిస్ట్రేషన్ చేయించి.. రాయబారుల పేరుతో చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టేందుకు ముఠా ప్లాన్ చేసింది. గత ఏడాది ఇరవైకి పైగా కార్లను దిగుమతి చేసింది. ముంబయి ముఠా నుంచి వస్తున్న కార్లు ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రముఖులే కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో డీఆర్ఐ అధికారులు రంగంలోకి దిగారు. 

Updated Date - 2021-07-21T19:58:47+05:30 IST