నిర్లక్ష్యపు.. చెదలు!

ABN , First Publish Date - 2021-11-19T06:13:08+05:30 IST

గ్రంథాలయ వారోత్సవాల పేరుతో ఏటా వారంపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నిర్లక్ష్యపు..   చెదలు!

 అక్కరకు రాని గ్రంథాలయాలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

చాలాచోట్ల ఇప్పటికీ అద్దె భవనాల్లోనే..

కేవలం వార్తా పత్రికలతో సరి

పోటీ పరీక్షల పుస్తకాలు అంతంతమాత్రమే

అభివృద్ధి చేయాలని కోరుతున్న పాఠకులు 

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం..


జిల్లాలో గ్రంథాలయాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. సగానికి పైగా అద్దె భవనాల్లో నడుస్తుండగా.. సొంత భవనాలు మరమ్మతులకు గురయ్యాయి. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలాచోట్ల న్యూస్‌పేపర్లకే పరిమితం కాగా, మరికొన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలకు బూజు పడుతున్నాయి. గ్రంఽథాలయ సంస్థకు జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి రావాల్సిన సెస్‌ రూ.27కోట్ల పెండింగ్‌ ఉంది. దీంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. కేవలం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తప్పా.. ఆ తర్వాత వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. 


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, నవంబరు 18: గ్రంథాలయ వారోత్సవాల పేరుతో ఏటా వారంపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత వాటి అభివృద్ధి ఊసే మరిచిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా గ్రంథాలయాల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నవాటికే దిక్కు లేదు.. కొత్తగా వైసీపీ ప్రభుత్వం డిజిటల్‌ గ్రంథాలు ఏర్పాటు చేస్తామనడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగ సాధనలో ఎందరో నిరుద్యోగులకు దిక్సూచిలా ఉన్న గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంఽథాలయం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులూడి ఎప్పుడు పాఠకుల మీద పడుతుందా అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఇక్కడకు ఉద్యోగార్ధులు ఎక్కువగా వస్తుంటారు. వారు కనీసం మధ్యాహ్న భోజనం చేయటానికి కూడా సరైన స్థలం లేదు. వానైనా, ఎండైనా చెట్ల కింద కూర్చొని తినాల్సిందే. ఇక పరిసర ప్రాంతం పిచ్చిమొక్కలతో చిట్టడవిని తలపిస్తోంది. రీడింగ్‌ రూం సీలింగ్‌ ఊడుతోంది. పెద్దమొత్తంలో బకాయిలు ఉండటంతో వార్తపత్రికలు కూడా వేయటం లేదు. కొందరు దాతలు ముందుకు వచ్చి పుస్తకాలను వితరణ చేశారు. 

  

రూ.27కోట్ల వరకు సెస్‌ పెడింగ్‌...

జిల్లావ్యాప్తంగా 97శాఖ గ్రంథాలయాలు, 41 గ్రామీణ గ్రంథాలయాలు, 161 పుస్తక పంపిణీ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. గ్రంఽథాలయ సంస్థకు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి రావాల్సిన సెస్‌ రూ.27కోట్ల పెండింగ్‌ ఉంది. అలానే గ్రంథాలయ సంస్థల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయం దాదాపు మూడెకరాల్లో ఉండగా ప్రస్తుతం ఎకరం 15సెంట్లు మాత్రమే మిగిలిందని సమాచారం. అలానే జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో 72శాతం సిబ్బంది కొరత ఉంది.  

వినుకొండ పట్టణంలో లక్షకు పైగా జనాభా ఉన్నప్పటికీ గ్రంథాలయం గురించి పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అద్దెభవనంలోనే కొనసాగిస్తున్నారు. నూజెండ్ల గ్రంథాలయాధికారే వినుకొండలో కూడా బాధ్యతలు నిర్వహించాల్సి ఉండటంతో పని వత్తిడి కారణంగా సక్రమంగా తలుపులు తీయడం లేదు. ఈపూరు గ్రంథాలయం మినహా మిగిలిన గ్రంథాలయాలన్నీ అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. అన్నీ గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉంది.

వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 12 శాఖా గ్రంథాలయాలు, 6 గ్రామీణ గ్రంథాలయాలు, ఒక పుస్తక పంపిణీ కేంద్రం ఉన్నాయి. వీటిలో వేమూరు, భట్టిపోలు, వలివేరు, అమర్తలూరు గ్రంథాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వేమూరు గ్రంథాలయానికి సొంత భవనం లేదు. పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. చావలి, మైలవరం గ్రామాల్లో శాఖ గ్రంథాలయాలు మూడేళ్ల నుంచి మూతపడ్డాయి. కన్నెగంటివారిపాలెం, కోళ్లపాలెం గ్రామాల్లోని గ్రామీణ గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. శిథిలావస్థకు చేరిన భవనాలలో పుస్తకాలు తడిసి పూర్తిగా దెబ్బతిన్నాయి. పాఠకులు వచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. 

తెనాలి పట్టణంలో జిల్లా శాఖా గ్రంథాలయం ఒక్కటి మాత్రమే పాఠకులకు ఉపయోగపడుతోంది. మున్సిపాలిటీ, ప్రభుత్వ పరిధిలో మొత్తం పేరుకు 9 వరకు గ్రంథాలయాలుంటే వాటిలో 7రీడింగ్‌ రూమ్‌లే. వాటిలో కేవలం నాలుగైదు దినపత్రికలు మాత్రమే ఉంటాయి. మహిళా మండలి భవనంలో నడుపుతున్న గ్రంథాలయం పైకప్పు పెచ్చులూడిపోతోంది. చినరావూరులో పడిపోయిన పెంకుటింటి స్థానంలో రేకుల షెడ్డు ఏర్పాటుచేసి గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో పెదరావూరులో నిర్మించిన డిజిటల్‌ లైబ్రరీ సైతం మూతపడింది.

తాడికొండలోని మహిళల, బాలల కోసం ప్రత్యేకంగా ఓ గ్రంథాలయం ఉంది. ఇదిప్పుడు నిరుపయోగంగా మారింది.  మరో శాఖా గ్రంథాలయం దాతల సహాయంతో 1977లో ఏర్పాటు చేశారు. ఇక్కడ దినపత్రికలు చదవటానికి మాత్రమే గ్రామస్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇన్‌చార్జులే ఈ గ్రంథాలయాల్లో పనిచేస్తున్నారు. 

సత్తెనపల్లి శాఖా గ్రంథాలయానికి ఆరేళ్లుగా పూర్తికాలపు గ్రంథాలయ అధికారి లేరు. బెల్లంకొండ గ్రంథాలయ అధికారి సత్తెనపల్లికి కూడా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాంపిటీషన్‌ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో లభించటం లేదు.  

పొన్నూరు పట్టణంలో 1988లో ఏర్పాటు చేసిన జిల్లా శాఖా గ్రంఽథాలయం పూర్వవైభవం కోల్పోతోంది. ప్రస్తుతం ఈ గ్రంథాలయాన్ని పాత పొన్నూరులోని చాలీచాలని మున్సిపల్‌ రీడింగ్‌ రూమ్‌లోకి మార్చారు. ఈ గదిలో పాఠకులు చదువుకోవటానికి స్థలం లేకపోవటంతో ఆరుబయట చెట్టు కింద చదువుకుంటున్నారు.  

పిడుగురాళ్ల, మాచవరం, మోర్జంపాడు, గురజాల పట్టణాల్లో గ్రంథాలయాలు కొన్నేళ్లుగా అద్దెభవనాల్లోనే కొనసాగుతునాయి. స్థలం లేకపోవటంతో పిడుగురాళ్ల గ్రంథాలయానికి నిధులున్నా మురిగిపోయాయి. గ్రంథాలయాల్లో సాధారణ రోజువారి దినపత్రికలు, వారపత్రికలే అందుబాటులో ఉంటున్నాయి పిడుగురాళ్ల, మాచవరం, మోర్జంపాడు, శాఖా గ్రంథాలయాలు ఇరుకైన గదుల్లో కొనసాగుతుండటం వల్ల పాఠకులకు అసౌకర్యంగా ఉంది. 

నరసరావుపేట పట్టణంలో శాఖా గ్రంధాలయం పల్నాడురోడ్డులో అందరికీ  అందుబాటులో ఉంది. అయితే సిబ్బంది కొరత వెంటాడుతోంది. గ్రంఽథాలయ అధికారితో కలిపి నలుగురు సిబ్బంది అవసరం కాగా ఇద్దరితో సర్దుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు గ్రంథాలయంలోని రీడింగ్‌ హాల్‌ కుంగిపోయింది.  భవన మరమ్మత్తుల కోసం ప్రణాళికలు పంపామని అధికారులు చెబుతున్నారు. 

50వేలకు మందికి పైగా జనాభా ఉన్న తాడేపల్లి పట్టణంలో ఉన్న శాఖాగ్రంథాలయం ఇరుకు భవనంలో ఉండడంతో పురప్రజలు, పుస్తకప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. దినపత్రికలు చదివేవారు పట్టుమని పదిమంది కూర్చుంటే ఇంకెవరూ లోపలికి వెళ్లడానికి వీలుండదు. 

చిలకలూరిపేట నియోజకవర్గంలోని గ్రంఽథాలయాల్లో సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్నాయి. యడ్లపాడు మండలం జగ్గాపురం, యడ్లపాడు గ్రామాలలో శాఖాగ్రంఽథాలయాలు, తిమ్మాపురం, జాలాది గ్రామాల్లో గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. నాలుగన్నర దశాబ్దాల క్రితం తొలి గ్రంధాలయం మండలంలోని జగ్గాపురం గ్రామంలో ఏర్పాటైంది.  భవనం పైకప్పు శ్లాబు పెచ్చులు ఊడి ఇనుము బయల్పడుతోంది. వర్షం వస్తే గదిలోకి నీరు చేరి పుస్తకాలు, ఫర్నిచర్‌ తడిచిపోతున్నాయి 2వేలకు పైగా పుస్తకాలు పాడవగా, ప్రస్తుతం గ్రంఽథాలయంలో ఉన్న 10 వేలకు పైగా పుస్తకాలకు భద్రత లేకుండా పోయింది. యడ్లపాడులోని గ్రంఽథాలయంలో పదిమంది పాఠకులు ఒకేసారి కూర్చుని చదువుకునే పరిస్థితి లేదు.  తిమ్మాపురంలో తాత్కాలిక సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామీణ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేదు.  

మాచర్ల నియోజకవర్గంలోని గ్రంథాలయాలు నిరూపయోగంగా మారాయి. చాలా వరకు గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కారంపూడిలోని గ్రంథాలయం వెనుకవైపు గోడ కూలిపోయి ఏళ్లు  గడుస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వెల్దుర్తిలో గ్రంథాలయం పైకప్పు గోడ పెచ్చులూడిపోయింది. రెంటచింతలలోని గ్రంథాలయం సక్రమంగా తీయడం లేదు. గ్రంథాలయాధికారి ఫిరంగిపురానికి బదిలీ అయ్యారు. మాచర్ల పట్టణంలోని గ్రంథాలయంలో కాంపిటిషన్‌ బుక్స్‌ అందుబాటులో లేవు. 

బాపట్ల పట్టణంలో అనాదిగా అద్దెభవనంలోనే శాఖా గ్రంథాలయం కొనసాగిస్తున్నారు. చాలీచాలని గదుల్లో ఉన్న పుస్తకాలు చెదలుపడుతూ పాఠకులు కూర్చొని చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. 1954వ సంవత్సరం నుంచి ఇదే భవనంలో శాఖా గ్రంథాలయం కొనసాగుతున్నది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన గాదె వెంకటరెడ్డి ఆంజనేయ అగ్రహారం పాఠశాల ప్రాంగణంలో సొంతభవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకునేవారే లేకపోయారు. 

Updated Date - 2021-11-19T06:13:08+05:30 IST