చిన్న సినిమాలకు టికెట్ రేట్ తగ్గించాలి: M S Raju

Published: Sat, 25 Jun 2022 14:31:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చిన్న సినిమాలకు టికెట్ రేట్ తగ్గించాలి: M S Raju

చిన్న సినిమాలకు టికెట్ రేట్ తగ్గించాలి అని ప్రముఖ దర్శకనిర్మాత ఎం ఎస్ రాజు (M S Raju) అన్నారు. శత్రువు, దేవీ, దేవీ పుత్రుడు, మనసంతా నువ్వే, ఒక్కడు, నీ స్నేహం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. ఇక దర్శకుడిగాను వాన, తూనీగ తూనీగా, డర్టీ హరి లాంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలను నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

చిన్న సినిమాలకు టికెట్ రేట్ తగ్గించాలి: M S Raju

ఈ క్రమంలోనే ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ (7-days-6-nights). ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ (Sumanth Ashwin), రోహన్ (Rohan) హీరోలుగా… మెహర్ చాహల్ (Meher Chahal), కృతికా శెట్టి (Krithika Shetty) హీరోయిన్లుగా నటించారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా మేకర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ..''థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. థియేటర్ లోపలికి వెళ్లే ముందు ఇద్దరు హీరోయిన్లను ఎవరో అమ్మాయిలు అనుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళను అందరూ చుట్టుముట్టారు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 350 మంది జనంతో చూశాం. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎమోషన్... ఈ రెండూ ఒకేలా వెళుతుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అది చూసి మేం ఆనందించాం. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. మేం ఆ కష్టం పడ్డాం. ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్. 'శంకరాభరణం' నుంచి ఇప్పటి వరకు క్లాసిక్ సినిమాలు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. 

యూత్‌కు విపరీతంగా నచ్చింది. అయితే, ఒక చిన్న వెలితి. ఈ రోజు మన సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. అది ఎవరూ బయటపడరు. ఎందుకంటే... పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిలా, కె బాలచందర్ గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే? ఈ రోజు 'హ్యాపీ డేస్' లాంటి సినిమాలు వస్తే? ఏంటని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ తాలూకా పోకడ మారింది. ఎందుకు మారిందంటే... ఈ రోజు ఫోనులో ప్రతిదీ అందుబాటులో ఉంది. చాలా ఓటీటీ వేదికలు వచ్చాయి. ఈ పోటీలో కరోనా ఒకటి. నేను పెద్ద పెద్ద సినిమాలు తీశాను. లో బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు టికెట్ ధర ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతా హ్యాపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే... పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు రేట్లు తగ్గించండి. నేను ఒక థియేటర్‌కు వెళితే... టికెట్ రేటు 200 పెట్టారు. చిన్న సినిమాకు అంత డబ్బులు పెట్టి నేను ఎందుకు చూస్తాను? మా సినిమాకు టాక్ బావుంది. 

జనాలు వస్తున్నారు. ఏవరేజ్ ఫిల్మ్ అయితే ఓటీటీలో వస్తే చూద్దామని అనుకుంటున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి టికెట్ రేటు ఎంత తగ్గిస్తారు? 30 శాతమా? 40 శాతమా? నేను చిన్న సినిమా తీశానని, లేదంటే నా సినిమా కోసమో అడగటం లేదు. గతంలో దాసరి గారు, ఆ తర్వాత భరద్వాజ్ గారు, నారాయణమూర్తి గారు అడిగారు. ఇవాళ నేను అడుగుతున్నాను. నా సినిమా కోసం అయితే విడుదలకు ముందు చెప్పేవాడిని. చిన్న సినిమా కోసం ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ఇదొక పెద్ద సినిమాల ఇండస్ట్రీగా ఉంటుంది తప్ప చిన్న సినిమాల ఇండస్ట్రీగా ఉండదు. చిన్న చిన్న సినిమాలు తీయాలనుకునే ఔత్సాహిక దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ 'నేను ఓటీటీకి వెళ్లాలా? థియేటర్లకు రాలేనా?' అని ఎందుకు అనుకోవాలి. నాకు అర్థం కావడం లేదు... థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలే విడుదల చేయాలా? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద సినిమాలకు ఎంత రేట్ అయినా పెట్టుకోండి. క్రేజ్ ఉంది కాబట్టి థియేటర్లకు జనాలు వస్తారు. చిన్న సినిమాకు ఏదైనా చేయండి. లేదంటే చిన్న సినిమా రాదు'' అని అన్నారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International