ఇండస్ట్రీ మద్దతు ఎవరికి?

Jun 21 2021 @ 22:00PM

సినిమాల్లో హీరో - విలన్‌ పోటీ పడితే హీరోనే గెలుస్తాడు. కానీ రియల్‌ లైఫ్‌లో హీరో పాత్రధారుడు, విలన్‌ పాత్రధారుడు కలబడితే ఆ మజానే వేరు. ఇప్పుడు ఇలాంటి రసవత్తర పోరుకి తెరతీయనున్నాయి ‘మా’ ఎన్నికలు. గత మూడు టర్మ్‌లుగా టాలీవుడ్‌లో కాంట్రవర్సీలకు కేరాఫ్‌ ఆడ్రస్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేన్‌ ఎన్నికలు మరోసారి రసవత్తరంగా సాగనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. మరో పక్క ఆయనకు పోటీగా మంచు విష్ణు బరిలో దిగుతున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. దీంతో ఈ ప్యానల్స్‌లో ఎవరు ఉంటారు? సపోర్ట్‌గా ఎవరు నిలుస్తారు అన్నది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. చిరంజీవి సోదరుడు నాగబాబు మద్దతు ప్రకాశ్‌కు ఉంటుందని ఆయన ఇటీవల ప్రకటించారు. అలాగే చిరంజీవి సపోర్ట్‌ కూడా ఉంటుందని ప్రకాశ్‌రాజ్‌ విశ్వసిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు ఓ అవగాహన ఉందని, వాటిని సరిచేయడానికి పక్కా ప్రణాళిక తన దగ్గర ఉందని ప్రకాశ్‌ వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి ‘మా’ నూతన భవన నిర్మాణం కూడా చేస్తానని హామీ ఇచ్చేశారు. నటులను ఓ తాటిపైకి తీసుకొచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. 


ఇదిలా ఉండగా సోమవారం ఉదయం మోహన్‌బాబు, విష్ణు సూపర్‌స్టార్‌ కృష్ణను కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. సాయంత్రానికి విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విష్ణు బలం తన తండ్రి మోహన్‌బాబు. ఇప్పటికే కృష్ణ మద్దతు విష్ణుకు దక్కిందని టాక్‌. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ సపోర్ట్‌ కూడా విష్ణుకి దక్కింది. అయితే ఎవరు ఎవరికి మద్థతునిచ్చినా అంతిమంగా మెగా కాంపౌండ్‌ మద్థతు లభించిన వారికే పదవి దక్కుతుందనేది అందరికీ తెలిసిన విషయం. అయితే మెగాస్టార్‌ సపోర్ట్‌ ఎవరికి అన్నది తెలియాల్సి ఉంది. చిరంజీవి, తన మిత్రుడు మోహన్‌బాబు వైపు ఉంటారా? తమ్ముడిలా భావించే ప్రకాశ్‌రాజ్‌ వైపు ఉంటారా అన్నది చూడాలి. ‘మా’కు క్రమశిక్షణా కమిటీ పెద్దలుగా ఉన్న చిరంజీవి - మోహన్‌ బాబు చెరో వైపు ఉంటారా లేక కలిసి కట్టుగా ఒకరికే మద్థతిస్తారా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారిన విషయం. 


మరో సమస్య ఏంటంటే...                              

విష్ణు లోకల్‌.. ప్రకాశ్‌రాజ్‌ నాన్‌ లోకల్‌. ఈ ఈక్వేషన్‌ ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందనే చూడాలి. ఎందుకంటే ‘మా’ అసోసియేషన్‌ పుట్టినప్పటి నుంచి తెలుగు ఆర్టిస్ట్‌లే అధ్యక్ష పదవిని అలంకరించారు. ఇప్పుడు పరభాష నటుణ్ణి అధ్యక్షుడిగా నిలబడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది చూడాలి. ఇక విష్ణు-ప్రకాశ్‌రాజ్‌ల మధ్య పోలికల విషయానికొస్తే రాజకీయ పరంగా బిజెపికి వ్యతిరేకి అయిన ప్రకాశ్‌రాజ్‌కి టీఆర్‌ఎస్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. విష్ణుకి కూడా టీఆర్‌ఎస్‌తో మంచి అనుబంధమే ఉంది. ప్రకాశ్‌రాజ్‌కి సేవాగుణం ఎక్కువ. ఇప్పటికే ఆయన కర్ణాటకలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. 6 ప్రభుత్వ స్కూళ్లను నడిపిస్తున్న అనుభవం ఉంది. అందుకే సమర్ధవంతంగా ‘మా’ను నడిపించగలనని ధీమా వ్యక్తం చేస్తున్నారాయన. ఇక విష్ణు విషయానికొస్తే ఆయనొక మంచి అడ్మినిస్ట్రేటర్‌. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఆర్టిస్ట్‌లకు ఉండే కష్టాలేంటో తెలుసు. పైగా తండ్రి అనుభవం, అండదండలు ఎలాగో ఉంటాయి. సో.. ఆయన కూడా సమర్ధవంతంగా ‘మా’ను నడిపించగలరని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.