సినిమా రివ్యూ: మాయోన్‌ (Maayon)

Published: Thu, 07 Jul 2022 21:20:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ: మాయోన్‌ (Maayon)

సినిమా రివ్యూ: మాయోన్‌(Maayon)

విడుదల తేది:7–7–2022

నటీనటులు: సిబి రాజ్‌(Sibi raj), తాన్య రవిచంద్రన్‌(Tanya ravichandran), కె.ఎస్‌.రవికుమార్‌, రాధారవి. హరీశ్‌ పేరడి తదితరులు.

కెమెరా: రాంప్రసాద్‌

సంగీతం: ఇళయరాజా

ఎడిటింగ్‌: రామ్‌ పాండియన్‌, కొండలరావు

నిర్మాత: అరుణ్‌ మోళిమాణికమ్‌

దర్శకత్వం: ఎన్‌.కిషోర్‌


వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సత్యరాజ్‌ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన తనయుడు శిబిరాజ్‌ తమిళంలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఎన్‌.కిషోర్‌ దర్శకత్వం వహించిన  మైథాలజికల్‌ థ్రిల్లర్‌ ‘మాయోన్‌’తో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం తెలుగు ప్రమోషన్స్‌లో తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించారు సత్యరాజ్‌. తనను ఆదరించినట్లుగానే శిబిని కూడా ఆదరించాలని కోరారు. మరి గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. (Maayon movie review)


కథ: 

అర్జున్‌ (సిబి రాజ్‌) ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో సైంటిస్ట్‌. పురాతన వస్తువులను కాపాడటం ఎంతో ముఖ్యమని, అది మన పూర్వీకుల సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తుందని.. ఆ దిశగా వాటిని రక్షించాలని సహోద్యోగలకు తరచూ చెబుతుంటాడు. కానీ అతనే పురావస్తు శాఖలో భద్రంగా ఉన్న విలువైన విగ్రహాలను  విదేశీయులకు అమ్మేస్తుంటాడు. అందుకోసం తన పై అధికారి దేవరాజ్‌(హరీశ్‌ పేరడి)తో చేతులు కలుపుతాడు. ఈ తరుణంలో 5 వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన మాయోన్‌ ఆలయం, అందులోని నిధి గురించి వీరికి సమాచారం అందుతుంది. ఇద్దరూ అక్కడికి వెళ్లి నిధి వేటలో పడతారు. అక్కడ వాళ్లకు నిధి రహస్యం ఎలా తెలిసింది? ఆ నిధిని వశం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ గుడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఏంటి? అర్జున్‌ నిజంగా నిధి కోసమే దేవరాజ్‌తో చేతులు కలిపాడా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్‌లను పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్నది మిగతా కథ.  (Maayon movie review)

విశ్లేషణ: 

పురావస్తు శాఖ, ఆలయాల రహస్యం, నిఽధుల వేట వంటి ఉత్కంఠభరిత మైథలాజికల్‌ కథలు ప్రేక్షకుడికి ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఈ తరహా కథలు ఎప్పుడూ రొటీన్‌గానే ఉంటాయి. ఆసక్తిగా తెరకెక్కించడంలోనే సినిమా సక్సెస్‌ ఆధారపడి ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి ప్రతి పాత్రపైనా అనుమానం కలిగేలా కథను ప్రారంభించారు దర్శకుడు. అసలు కథేంటో చెప్పడానికి కాస్త సమయం తీసుకోవడం ప్రేక్షకుడి సహనానికి కాస్త పరీక్షలా అనిపిస్తుంది. ఆలయానికి సంబంధించిన సన్నివేశాలు ఒకవైపు, మరోవైపు సైన్స్‌  రెండింటిని దర్శకుడు బ్యాలెన్స్‌ చేసుకుంటే నడిపించారు. హీరోకి విపరీతమైన ఎలివేషన్‌ ఇవ్వకుండా కథానుగుణంగా హీరో పాత్రను చూపించారు. ప్రథమార్ధంలో కథ చెప్పడం కాస్త స్లోగా ఉన్నా... సెకెండాఫ్‌కి వచ్చేసరికి ఆడియన్స్‌ ఎంగేజ్‌ అయ్యేలా స్పీడ్‌ పెంచారు. క్లైమాక్స్‌ సన్నివేశాలు తెలుగులో ఈ తరహా కథలతో వచ్చిన ‘కార్తికేయ’ వంటి చిత్రాలను గుర్తు చేశాయి. సిబిరాజ్‌.. డెబ్యూ మూవీ అయినా చాలా అనుభవం ఉన్న నటుడిలా తెరపై కనిపించారు. యాక్షన్‌ సన్నివేశాలు అలరించాయి. సంజన పాత్రధారి తాన్యా రవిచంద్రన్‌కు అంత ప్రాధాన్యం కనిపించలేదు. గ్రామ పెద్దగా రాధారవి ఫర్వాలేదనిపించారు. దేవరాజు పాత్రలో హరీష్‌ పేరడీ మెప్పించాడు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ కథకు కీలకమైన పాత్రలో మెప్పించారు. కెమెరా పనితనం బావుంది. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా పిక్చరైజ్‌ చేశారు. ఇళయరాజా సంగీతం ఆకట్టుకుంది. ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రాలకు నేపథ్య సంగీతం పాత్ర చాలా కీలకం. ఇళయరాజా తన మార్క్‌ చూపించారు. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్‌ కాస్త షార్ప్‌గా ఉండుంటే సాగదీతలా అనిపించేది కాదు. హీరో పరిచయ చిత్రాలకు రాసినట్టుగా దర్శకుడు ఈ కథను ప్లాన్‌ చేసుకున్నాడు. కథ రొటీన్‌ అయినా.. తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా సాగడంతో థ్రిల్లర్‌ కథలను ఇష్టపడే వారిని ‘మాయోన్‌’ మెప్పిస్తుంది.  (Maayon movie review)


ట్యాగ్‌లైన్‌: ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International