వివాహితతో కొన్నేళ్లుగా సహజీవనం.. కుటుంబానికి దిక్కుగా ఉంటాడనుకున్న మహిళ.. చివరికి ఘోరం జరిగిపోయింది..!

ABN , First Publish Date - 2022-05-01T12:53:02+05:30 IST

వివాహితతో కొన్నేళ్లుగా సహజీవనం.. కుటుంబానికి దిక్కుగా ఉంటాడనుకున్న మహిళ.. చివరికి ఘోరం జరిగిపోయింది..!

వివాహితతో కొన్నేళ్లుగా సహజీవనం.. కుటుంబానికి దిక్కుగా ఉంటాడనుకున్న మహిళ.. చివరికి ఘోరం జరిగిపోయింది..!

  • కుమార్తె వరసైన బాలికపై లైంగికదాడి
  • గర్భందాల్చి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలి : మహిళా సంఘాలు


మచిలీపట్నం టౌన్‌ : కుటుంబానికి దిక్కుగా ఉంటాడని చేరదీస్తే కూతురునే కాటేశాడు ఓ కామాంధుడు.. కూతురు వరసైన బాలికపై లైంగికదాడికి పాల్పడి ఆపై తల్లిని చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలవంచుకునే ఈ సంఘటన వివరాలను బందరు డీఎస్పీ మాసూం బాషా మీడియా సమావేశంలో వివరించారు. కోమటి సురేశ్‌ రెడ్డి(35) మచిలీపట్నం పెయింటర్స్‌ కాలనీలో టాక్సీ డ్రైవరుగా పనిచేసేవాడు. అతడిని భార్య వదిలిపెట్టి వెళ్లిపోవడంతో మరో వివాహిత మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె పని నిమిత్తం బైటకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తె(17)ను లొంగదీసుకున్నాడు.


తరచుగా బాలికపై లైంగికదాడికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. అది తెలిసిన తల్లి పరువు పోతుందని విషయాన్ని గుట్టుగా ఉంచి అబార్షన్‌ చేయించేందుకు ప్రయత్నించింది. అది విఫలం కావడంతో మచిలీపట్నం ప్రభుత్వఆసుపత్రిలో బాలిక శుక్రవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. సురేశ్‌ రెడ్డి పెయింటర్స్‌ కాలనీలో నాయర్‌ బడ్డీ సెంటర్‌లోని అపార్ట్‌మెంట్‌లోవాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సురేశ్‌ రెడ్డిపై చిలకలపూడి ఎస్సై రాజు  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. కేసును దిశ స్టేషనుకు బదిలీ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి శనివారం కోర్టుకు హాజరు పరిచినట్టు దిశ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు.


ఇలాంటి దుర్మార్గుడనుకుంటే ఇంటికి రానిచ్చేదాన్ని కాదు- బాధితురాలి తల్లి ఆవేదన

కోమటి రెడ్డి సురేశ్‌ ఇలాంటి దుర్మార్గుడనుకుంటే ఇంటికి రానిచ్చేదాన్ని కాదు. సమాజంలో సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చింది. నా కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే కూతురినే కాటేశాడు. ప్రభుత్వం నాకుటుంబాన్ని ఆదుకోవాలి. 


నిందితుడిని కఠినంగా శిక్షించాలి - మహిళా సంఘాల డిమాండ్‌

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు కోమటిరెడ్డి సురేశ్‌ రెడ్డిని కఠినంగా శిక్షించాలని టీడీపీ మహిళా పార్లమెంటు అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బాలికకు అండగా నిలిచి న్యాయం చేకూర్చాలన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి వి.జ్యోతి మాట్లాడుతూ వరుస ఘటనలతో మహిళలు అభద్రతా భావానికి గురవుతున్నారని, ప్రభుత్వాలు వీటికి శాశ్వత పరిష్కారం చూపకుండా వదిలేస్తున్నారన్నారు. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు రజని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-01T12:53:02+05:30 IST