కొనుగోళ్లలో చిత్తశుద్ధే ప్ర‘ధాన్యం’!

ABN , First Publish Date - 2020-11-18T16:43:05+05:30 IST

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నవంబరు 16వ తేదీ నుంచే..

కొనుగోళ్లలో చిత్తశుద్ధే ప్ర‘ధాన్యం’!

పీఏసీఎస్‌ల ద్వారా 249, జిల్లా సహకార వాణిజ్య సంస్థల ద్వారా 53, మార్కెటింగ్‌శాఖ ద్వారా 36.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

గతేడాది నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం

ఈ-క్రాప్‌లో నమోదైతేనే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ

ధాన్యం సరఫరాలో జియో ట్యాగింగ్‌తో ఇబ్బందులేనా

ఇంకా ప్రారంభంకాని ఆన్‌లైన్‌ ప్రక్రియ

మిల్లర్లకు బకాయిలు రూ.200 కోట్లు పెండింగు


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నవంబరు 16వ తేదీ నుంచే అధికారికంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఇందుకోసం ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ధాన్యం తరలింపునకు జియోట్యాగింగ్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నా అది క్షేత్రస్థాయిలో ఎంతమేరకు ఫలిస్తుందనేది అనుమానమే. ఈ-క్రాప్‌లో పంట వివరాలు, రైతుల పేర్లు నమోదై ఉంటేనే ఽధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కొనుగోళ్లు సక్రమంగా జరుగుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ధాన్యం తరలింపునకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.  లారీలు, ట్రాక్టర్లు, మినీ వ్యానులు, ఎడ్లబండ్లపై ధాన్యం రవాణా చేస్తారు. వీటన్నింటికీ జియోట్యాగింగ్‌ ఏర్పాటు చేయడం  ఖర్చుతో కూడుకున్న పని. ఎడ్లబండ్లకు జియో ట్యాగింగ్‌ ఎలా ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ధాన్యం తరలింపులో  జియోట్యాగింగ్‌ అంశంపై పునరాలోచన చేయాల్సిందేనని మిల్లర్లు అంటున్నారు. 


దిగుబడి లక్ష్యం 16.15 లక్షల టన్నులు

జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2.41 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. ధాన్యం దిగుబడి 16.15 లక్షల టన్నులు వస్తుందని అధికారిక అంచనా.  పౌరసరఫరాల శాఖ ద్వారా 10 నుంచి 12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. బీపీటీ 5204, ఎంటీయూ 1061 వంటి ఇతర సన్నరకాల ధాన్యం బహిరంగ మార్కెట్‌లో రైతులు విక్రయించుకోవచ్చు. ఈ ఏడాది అతివృష్టి కారణంగా వరిపొలాలు ఆరుదల లేక దుబ్బు చేయలేదని రైతులు చెబుతున్నారు. వరి పొట్ట, ఈత, సుంకు, కంకులు పాలుపోసుకునే దశల్లో వర్షాలు కురవడం లాంటి కారణాలతో దిగుబడి ఆశించినమేర రాదనే భయం రైతులను వెంటాడుతోంది. కోత దశకు వచ్చిన వరి...  వర్షాలు, బలమైన గాలుల తాకిడికి నేలకొరిగిందని, దీంతో కంకులు నీటిలో తేలియాడుతున్నాయని, ఈ ప్రభావంతోనూ దిగుబడి తగ్గుతుందని రైతులు అంటున్నారు.  


మిల్లర్లకు బకాయిలు రూ.200 కోట్లపైనే  

రెండేళ్లుగా జిల్లాలో మిల్లర్లకు రూ.200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మచిలీపట్నం రైస్‌ మిల్లర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు సోమూరి కృష్ణాజీరావు తెలిపారు. సీజన్‌ ప్రారంభమయ్యే ప్రతిసారీ ప్రభుత్వానికి మిల్లర్లు నగదును హామీగా చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బకాయిలు విడుదల చేస్తే మిల్లర్లకు కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. ధాన్యం రవాణాలో జియోట్యాంగింగ్‌తో ఇబ్బందులున్నాయని, ఈ అంశాన్ని పౌర సరఫరాలశాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు.


క్వింటా మినుము విత్తనాలు రూ.8,500 

రబీ సీజన్‌లో జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో మినుము సాగవుతోంది. వరి కోతలు ప్రారంభంకావడంతో మినుము విత్తనానికి డిమాండ్‌  ఏర్పడింది. మినుము ధర మంగళవారం క్వింటా రూ.7,600 ఉంది.  బండపాలిష్‌, నందిని, ఎల్‌బీజీ 752 రకాల మినుము విత్తనం క్వింటా రూ.8,500కు విక్రయిస్తున్నారు. కొత్తగా వచ్చిన 104 రకం మినుము విత్తనం క్వింటా రూ.9000 ఉంది. ఏపీసీడ్స్‌ నుంచి 752, పీవీ-31 రకం మినుము వంగడాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.   

Updated Date - 2020-11-18T16:43:05+05:30 IST