గ్రామీణ ఉపాధిని హరించే ‘యంత్ర సేవ’

ABN , First Publish Date - 2022-06-17T06:13:56+05:30 IST

వ్యవసాయ యాంత్రీకరణ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం– రైతు భరోసా కేంద్రాల వద్దే తక్కువ అద్దెకు సాగు యంత్రాలు...

గ్రామీణ ఉపాధిని హరించే ‘యంత్ర సేవ’

వ్యవసాయ యాంత్రీకరణ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం– రైతు భరోసా కేంద్రాల వద్దే తక్కువ అద్దెకు సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి, విత్తనం దగ్గర నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను అందించటానికి, వీటి ద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించి రైతులకు రాబడి పెంచటానికి, 2,016 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి 15 లక్షల విలువ గల 10,750 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,780 ఆర్బీకేలకు, 391 క్లస్టర్ స్థాయి కేంద్రాలకు 700 కోట్ల విలువైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేస్తున్నారు. యంత్ర సేవా పథకం సబ్సిడీ కోసం రూ.806కోట్లు ప్రకటించారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారాన్ని గమనిస్తే రైతాంగం కష్టాలు తీరుతాయనే భావన కలుగుతుంది. కానీ ఇది రైతాంగానికి అత్యంత ప్రమాదకరం. వేలాది రైతు సంఘాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, అందులో ప్రతినిధులు ఎవరు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. చిన్న, సన్న కారు, రైతులు ఈ సంఘాల్లో పేరుకు కూడా సభ్యులు కాదు.


భారతదేశ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి తమపై ఆధారపడేలా చేసుకోవటానికి సామ్రాజ్యవాద అమెరికా మన పాలకులపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా దేశంలో సరళీకరణ విధానాలు అమలయ్యాయి, ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై మన దేశం సంతకం చేసింది. వీటి ఫలితంగా మన వ్యవసాయ రంగం తిరోగమించటం ప్రారంభమైంది. ఎరువులు, విత్తనాల, పురుగు మందుల ధరలు పెరిగి సేద్యపు ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. లాభసాటి ధరలు లభించక పంటలు అమ్ముకోవటమే గగనమైంది. సేద్యం నష్టదాయకంగా మారి రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రైతాంగ బలవన్మరణాలు మొదలయ్యాయి.


సామ్రాజ్యవాదుల ప్రయోజనాలే ముఖ్యం అనుకొంటున్న దేశీయ పాలకులు రైతాంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకపోగా సంక్షోభాన్ని మరింతపెంచే విధానాలను అమలు జరుపుతున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన, పంటల బీమా పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు పథకాల పేరుతో మోదీ ప్రభుత్వం; వైఎస్ఆర్ రైతు భరోసా, పంటల కొనుగోలు నిధి, ఇప్పుడు యంత్ర సేవా పథకం పేర్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి.


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు యంత్ర సేవా పథకం ద్వారా రైతాంగానికి పంట ఖర్చులు తగ్గించి ఆదాయం పెరిగేలా చేస్తాను అంటున్నది. కానీ నిజానికి ఈ యంత్రాలన్నింటినీ విదేశీ కంపెనీల నుంచి కొనటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాటికి లబ్ధి చేకూరుస్తున్నది. ప్రభుత్వం అందించే యంత్రాలన్నీ రైతు గ్రూపుల పేరుతో ధనిక రైతులకే దక్కుతాయి. పేద, మధ్య తరగతి రైతులకు ఖర్చులు ఏ మాత్రం తగ్గవు. వీరికి యంత్రాలు కొనే ఆర్థిక స్తోమత ఉండదు. ఈ పథకం విదేశీ కంపెనీల, ధనిక, భూస్వామ్య వర్గాల ప్రయోజం కోసం ఏర్పాటు చేసిందే. అందుకు వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నది. ఈ ధనం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతాంగానికి, గ్రామీణ పేదలకు ప్రయోజనకరంగా ఉండేది.


సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచ వాణిజ్య ఒప్పందం ఫలితంగా గ్రామీణ పేదలకు ఉపాధి తరిగిపోతూ వచ్చింది. 1980 సంవత్సరం వరకు 120 రోజులు దొరికిన ఉపాధి నేడు 60 రోజులకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ పేదలకు 20 రోజులకు మించి ఉపాధి దొరకటం లేదు. అవసరానికి మించి వ్యవసాయంలో యంత్రాల వినియోగమే అందుకు కారణం. యంత్ర సేవా పథకం వలన నామమాత్రంగా ఉన్న ఉపాధి కూడా పేదలకు దొరకదు. ఉపాధి దొరకని గ్రామీణ పేదలు అందుకోసం పట్టణాలకు వలస వెళ్లి దుర్భర జీవితాలు గడుపుతున్న వారి జాబితాలో చేరుతారు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి, వ్యవసాయం పెట్టుబడిదారీ వ్యవసాయంగా మారినప్పుడు మాత్రమే యంత్రాల వినియోగం అవసరం. ఆ స్థితి లేని నేటి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇది రైతాంగానికి, గ్రామీణ పేదలకు ముమ్మాటికీ నష్టదాయకం.

బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం

Updated Date - 2022-06-17T06:13:56+05:30 IST