కార్పొరేషన్ల అప్పు దాచేశారు

ABN , First Publish Date - 2022-03-13T08:34:33+05:30 IST

జగన్‌ సర్కారు చేస్తున్న భారీ అప్పులు.. వాటిని తెస్తున్న తీరు రోజురోజుకి వివాదాస్పదమవుతుండడంతో ఏకంగా అప్పులనే దాచేశారు. ముఖ్యంగా కార్పొరేషన్‌..

కార్పొరేషన్ల అప్పు దాచేశారు

  • బయటకురాని స్థూల ఆర్థిక ప్రణాళిక
  • బడ్జెట్‌తోపాటే పెట్టాలనేది నిబంధన
  • అందులో ప్రతి పైసా వివరాలు
  • బయటకొస్తే ‘కార్పొరేషన్ల’ గుట్టురట్టు
  • కావాలనే దాచేసిన జగన్‌ ప్రభుత్వం


అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు  చేస్తున్న భారీ అప్పులు.. వాటిని తెస్తున్న తీరు రోజురోజుకి వివాదాస్పదమవుతుండడంతో ఏకంగా అప్పులనే దాచేశారు. ముఖ్యంగా కార్పొరేషన్‌ అప్పులను బడ్జెట్‌తోపాటు సమర్పించలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌తో పాటే మ్యాక్రో ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (స్థూల ఆర్థిక ప్రణాళిక) అనే డాక్యుమెంట్‌ను పబ్లిక్‌ డొమైన్‌, చట్టసభల్లో అందుబాటులోకి తీసుకురావాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఆ డాక్యుమెంట్‌ ఊసెత్తడం లేదు. ఈ డాక్యుమెంట్‌లో 10 రకాల ఫామ్‌లు ఉంటాయి. ఒక్కో డాక్యుమెంట్‌ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కో రకమైన అప్పులు, ఖర్చుల గురించి చెబుతుంది.  డి-1లో కీలకమైన ఆర్థిక సూచీలుంటాయి. అంటే జీఎ్‌సడీపీలో స్థూల ద్రవ్యలోటు శాతం, స్థూల ద్రవ్య లోటులో రెవెన్యూ లోటు శాతం, జీఎ్‌సడీపీలో రెవెన్యూ లోటు శాతం, జీఎ్‌సడీపీలో మొత్తం అప్పుల శాతం.. ఇలా  15 సూచీల వరకు ఉంటాయి. డి-2లో రాష్ట్ర ప్రభుత్వం చేసే వివిధ రకాల అప్పుల వివరాలుంటాయి. ఆర్‌బీఐ ద్వారా తెచ్చే అప్పులు, కేంద్రం నుంచి తీసుకునే లోన్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులు, ఓడీ, వేజ్‌ అండ్‌ మీన్స్‌ అప్పులు, ఉద్యోగుల డిపాజిట్ల నుంచి వాడుకున్న అప్పులు, ఎన్‌ఎ్‌సఎ్‌సఎ్‌ఫకు జారీ చేసే ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా సమీకరించిన అప్పుల వివరాలు ఇవ్వాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు అంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు అని అర్థం. ప్రభుత్వం ఈడాక్యుమెంట్లు పెట్టకుండా దాచేసి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఉల్లంఘనకు పాల్పడింది.


దీనివల్ల పూర్తిగా రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనేది బయటకు తెలియని పరిస్థితి. అలాగే, డి-3లో సింకింగ్‌ ఫండ్‌ గురించి, డి-4లో ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం గ్యారంటీల వివరాలు రాయాలి. కానీ, ప్రభుత్వం బడ్జెట్‌ పుస్తకం వాల్యూమ్‌ 5/2లో కూడా ఇచ్చిన గ్యారంటీలను భారీగా దాచేసింది. డి-6లో ఇచ్చిన గ్యారంటీల్లో రిస్క్‌ ఉన్నవి, రిస్క్‌ లేనివి ఎన్ని ఉన్నాయో తెలియజేయాలి. డి-7లో గ్యారంటీ రిడెంప్షన్‌ ఫండ్‌ గురించిన వివరాలు తెలియజే యాలి. డి-8లో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం గురించి, డి-10లో రాష్ట్ర ప్రభుత్వంలో, కార్పొరేషన్లలో, పీఎ్‌సయూల్లో ఎయిడెడ్‌ సంస్థల్లో ఎంతమంది ఉద్యోగులున్నారు....వారికి ఎంత ఖర్చవుతోంది.. అనే వివరాలు ఇవ్వాలి. కానీ, ప్రభుత్వం ఇవేవీ ఇవ్వకుండా తప్పించుకుంది. ఈ డాక్యుమెంట్లన్నీ అందుబాటులోకి తెస్తే ప్రభుత్వం గుట్టుగా దాస్తున్న కార్పొరేషన్ల అప్పులు బట్టబయలు అవుతాయన్న ఉద్దేశంతోనే మూడేళ్ల నుంచి ఈ డాక్యుమెంట్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచడం లేదు.


కార్పొరేషన్లకు రూ.2లక్షల కోట్ల అప్పు

ప్రస్తుతం రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లకు కలిపి రూ. రెండు లక్షల కోట్ల అప్పు ఉంది. ఇందులో రూ.50,000 కోట్ల అప్పులు ఆయా కార్పొరేషన్లు వాడుకుని వాటిని కట్టుకుంటున్నాయని అంచనా. మిగిలిన రూ.1,50,000 కోట్ల అప్పునకు సంబంధించిన అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.18,000 కోట్లను ప్రభుత్వం నుంచి చెల్లిస్తుంది. ఈ వివరాలను మ్యాక్రో ఎకనమిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌లోని డి-2 డాక్యుమెంట్‌లో పొందుపరచాలి. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి ప్రభుత్వం వాడుకుంది కాబట్టే వాటిని చెల్లిస్తుంది. ఈ వివరాలన్నీ డి-2 డాక్యుమెంట్‌ ద్వారా బయటకు వస్తే కొత్త అప్పులు పుట్టవన్న అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఆ వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచేసింది.

Updated Date - 2022-03-13T08:34:33+05:30 IST