ఇప్పుడేం చెబుతారో!

ABN , First Publish Date - 2021-04-22T06:26:23+05:30 IST

కాకినాడలో దుమ్ములపేట సమీపంలో..

ఇప్పుడేం చెబుతారో!
మడ అడవి చదును చేసిన స్థలం

కాకినాడలో మడ అడవుల నరికివేత నిజమేనని నిర్ధారించిన ఎన్జీటీ బృందం

112 ఎకరాల్లో 30 శాతం మేర అడవులు నరికివేశారని సుస్పష్టం

ఎన్జీటీ నివేదికతో ఇరకాటంలో పడ్డ జిల్లా అధికారులు

మడ అడవుల నరికివేత, స్థలం చదునుకు రూ.12 కోట్లు ఖర్చుచేసిన గుడా, కార్పొరేషన్‌

అవి మడ భూములని తేలడంతో ఇప్పుడు ఆ డబ్బంతా వృథాగా పోయినట్టే

నరికివేసిన మడచెట్ల వల్ల నష్టం, పునరుద్ధరణకు అయ్యే ఖర్చుపై త్వరలో సర్వే

తద్వారా అధికారుల నుంచి నష్ట పరిహారం ఎంత రాబట్టాలనే దానిపై ఆదేశాలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): కాకినాడలో దుమ్ములపేట సమీపంలో ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసిన భూముల్లో మడచెట్లు అడ్డంగా నరికివేసినట్టు ఎట్టకేలకు నిర్ధారణ అయింది. అవన్నీ పూర్తిగా మడ అడవులని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నియమించిన ప్రత్యేక బృందం నిర్ధారించింది. ఆధారాలు పక్కాగా ఉన్నా అవేవీ మడఅడవులు కావని ఇంతకాలంగా బుకాయిస్తూ వస్తున్న జిల్లా అధికారుల వాదనలో నిజం లేదని తేలిపోయింది. దీంతో ఇందుకు బాధ్యులైన అధికారుల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుసుకున్నట్టయింది. నరికివేసిన మడ అడవుల వల్ల కలిగిన నష్టం, తిరిగి వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంతనేది తేల్చి చెప్పాలని ఎన్జీటీ తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో ఆ నష్టం పరిహారం ఏఏ అధికారులనుంచి రాబట్టాలనేది తేలనుంది. కాగా మడఅడవులని తెలిసి కూడా ఇళ్ల స్థలాల చదునుకు రూ.12 కోట్ల వరకు కాకినాడ కార్పొరేషన్‌, గుడా వెచ్చించాయి. ఇప్పుడు నిజం తేలడంతో ఆ నిధులు మట్టిపాలైనట్టయ్యాయి.


అడుగడుగునా బుకాయింపే...

పేదల ఇళ్లస్థలాలకు చాలినన్ని ప్రభుత్వ భూములు కాకినాడలో లేకపోవడంతో దుమ్ములపేటకు ఆనుకుని కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకు చెందిన 112 ఎకరాలను కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి లాక్కుంది. ఇందులో కాకినాడ నగరంలోని 50 వార్డులకు చెందిన 24,388 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడానికి లేఅవుట్‌ కూడా వేసిం ది. అందుకోసం వంద ఎకరాల్లో ఎన్నో ఏళ్లుగా విస్తరించి ఉన్న మడ అడవులను అడ్డగోలుగా నరికేసింది. మడఅడవుల జోలికి వెళ్లడం పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిసినా అవేం ఖాతరు చేయలేదు. ఎక్కడికక్కడ వందలాది మడమొక్కలను ధ్వంసం చేసి మట్టితో ఆ ప్రాంతాన్ని చదును చేసింది. కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు ఈ పని చక్కబెట్టారు. అయితే మడఅడవుల ధ్వంసంపై విశాఖకు చెందిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో గతేడాది కేసు వేశారు.


పర్యావరణ పరిరక్షణ, అటవీ పరిరక్షణ, వన్యప్రాణుల చట్టాల కిందల పలు ఉల్లంఘలను ఇందులో ప్రస్తావించారు. ఈ కేసు విచారించిన ఎన్జీటీ నిజానిజాలను నిగ్గుతేల్చడానికి గతేడాది ఏప్రిల్‌ 30న చెన్నైకి చెందిన కేంద్ర అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయ సీనియర్‌ అధికారి, రాష్ట్ర కోస్తా తీరప్రాంత అథారిటీ సీనియర్‌ అధికారి, రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, కాకినాడ జిల్లా అటవీ అధికారి తదితరులను సభ్యులతో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని నియమించింది. ఈనేపథ్యంలో డాక్టర్‌ సి పాల్పండి, శాస్త్రవేత్త ఎం మహిమలతో కూడిన ప్రత్యేక బృందం గతేడాది డిసెంబర్‌ 10న కాకినాడ దుమ్ములపేట మడ అడవుల్లో పర్యటించింది. సిద్ధం చేసిన లే-అవుట్‌, ఉప్పుటేరు సహజసిద్ధ పిల్ల కాలువను సందర్శించింది. అదే సమయంలో జేసీ లక్ష్మీశ, డీఎఫ్‌వో తదితరులు ప్రభుత్వం తరపున కమిటీకి వాదనలు వినిపించారు. అక్కడ మడ అడవులు లేవని, ఒకప్పుడు రొయ్యల చెరువులు సాగుచేశారంటూ కొన్ని కాగితాలను చూపించారు.


అవన్నీ రెవెన్యూ భూములేనని నమ్మబలికారు. ఈ ప్రాంతంలో మడఅడవుల చరిత్ర లేదని, ఒకటీ అరా ఉన్నా తుఫాన్లకు ఎప్పుడో పోయాయయంటూ అడ్డగోలు అబద్ధాలు వినిపించారు. కొందరు పర్యావరణవేత్తలు అవి మడభూములేనని తమ వద్ద ఉన్న ఆధారాలు అందిం చారు. ఇళ్లస్థలాల చదునుకు ముందు అక్కడ మడ అడవులున్నాయనే విషయాన్ని సామాజికవేత్త తోట రాంబాబు గూగుల్‌ ఎర్త్‌లో చూపించారు. తమ పర్యటనలో బృందం ఉప్పుటేరు పిల్లకాలువ, చదును చేసినచోట పుట్టుకొచ్చిన మడ మొక్కలను గుర్తించి ఫోటోలు తీసుకుంది. ఇవన్నీ అధ్యయనం చేసిన ప్రత్యేక బృందం గత నెల 20 ఎన్జీజీకి తన నివేదికను అందించింది. చదును చేసిన స్థలంలో మడ అడవులున్నాయని తేల్చిచెప్పింది. చదును చేసిన భూముల్లో 30 శాతం మడచెట్లు నరికివేశారని వివరించింది. జిల్లా అధికారులు ఈ నివేదికతో ఇరకాటంలో పడ్డట్ట యింది. తమ వాదన అబద్ధమని తేలిపోవడంతో ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు.


అయితే ఈ నివేదికపై మంగళవా రం విచారించిన ఎన్జీటీ మడ అడవులను నరికివేయడం వల్ల కలిగిన నష్టం ఎంత? తిరిగి పునరుద్ధరణకు ఎంత ఖర్చవుతుందో అధ్యయనం చేసి మరో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో మరోసారి కమిటీ త్వరలో ఇక్కడకు రానుంది. అయితే పరిహారం కింద ఎన్ని కోట్లు ఖర్చవుతుందనేది తేలిన తర్వాత ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత బాధ్యులైన జిల్లా అధికారుల నుంచి వసూలు చేస్తామని ఎన్జీటీ తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఇప్పుడు పరిహారం చెల్లింపు ఎవరి నెత్తినపడుతుందోనని అధికారుల్లో గుబులు మొదలైంది. చదునుకు కాకినాడ కార్పొరేషన్‌, గుడా, రెవెన్యూశాఖ రూ.12 కోట్లు వరకు ఖర్చుచేశాయి. చెల్లింపులు కూడా జరిగిపోయాయి.

Updated Date - 2021-04-22T06:26:23+05:30 IST