
రిచా చద్దా... ఓ చట్రంలో ఇమడని తార. క్యారెక్టర్ నచ్చితే చాలు చేసేస్తుంది. సినిమాలో తనది అతిథి పాత్రా, పూర్తి నిడివి ఉన్నదా అని చూడదు. మంచి పాత్రా, చెడ్డ పాత్రా అన్నది అసలే లెక్కచేయదు. ఈ విషయం ఆమె అభిమానులకీ తెలుసు. అందుకే శృంగార తార బయోపిక్ ‘షకీలా’గా వచ్చిన కొద్ది రోజులకే ‘మేడమ్ చీఫ్‌మినిస్టర్’గా వస్తోన్న రిచా చద్దాను ఆహ్వానించేందుకు అంతా సన్నద్ధం అవుతున్నారు.
నేటి తారలు అందంగా కనిపించాలి. చక్కటి కాస్ట్యూమ్స్‌తో అలరించాలి, నృత్యంతో మైమరపించాలి, మంచి మాటలే పలుకుతూ ఉండాలి.... లాంటి నియమాలన్నీ అటకెక్కాయి. తెరపై చేసేది కల్పిత పాత్రలే అయినా వాస్తవానికి దగ్గరగా ఉన్నవే ఎంచుకుంటూ అభిమానుల్ని మూటకట్టుకున్న నటి రిచాచద్దా. ఆమె నటించిన ‘మేడమ్ చీఫ్‌మినిస్టర్’ ట్రెయిలర్ విడుదలైన రోజే అయిదు మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఇది భారీ తారాగణంతో, బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కాదు. మాయావతి అనే ఓ దళిత యువతి రాజకీయాల్లోకి రావడమే కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడమే ఇతివృత్తం. ఆలోచనాత్మక చిత్రాలు నిర్మించే సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు.
పాత్రల కోసం...
ఈ చిత్రంలో రిచా హెయిర్ స్టయిల్ తోపాటు ఆమె మ్యానరిజమ్స్ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రూపంతో సరిపోల్చేలా ఉండడం ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం బాబ్ కట్ తప్పనిసరని దర్శకుడు చెప్పారట. రిచా కురులను కత్తిరించుకోవడానికి సన్నద్ధం అయింది కానీ నటుడు అలీ ఫజల్‌తో పెళ్లి నిశ్చయం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మొన్న డిసెంబరులో విడుదలైన ‘షకీలా’ చిత్రం కోసం మలయాళం నేర్చుకుంది రిచా. అంతేనా అది షకీలా జీవిత కథ కావడంతో ఆమెను స్వయంగా కలుసుకుంది. చేస్తోన్న పాత్రల కోసం తనని తాను పూర్తిగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తుంది.
మూస ధోరణికి స్వస్తి..
జీవితం విభిన్నమైంది. ఈ క్షణం ఉన్నట్టుగా మరో క్షణం ఉండదు. రిచాకు నటన కూడా అంతే. ఒక పాత్ర క్లిక్ అయితే అదే తరహాలో వరుసగా అరడజను సినిమాలు చేసేసి క్యాష్ చేసుకోవాలి అన్న ధోరణికి ఆమె విరుద్ధం. మూసను ఇష్టపడదు. ఇప్పటి వరకూ ఆమె చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 2008లో ‘ఓయె లక్కీ! లక్కీ ఓయె’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నా చితకా పాత్రలతో సరిపెట్టుకుంది. అయితే 2012లో వచ్చిన కల్ట్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ రిచా సినీ జీవితంలో టర్నింగ్ పాయింట్. అందులో ‘నగ్మా ఖతూ’ పాత్రలో అద్భుతంగా నటించింది.
పడుచు భార్యగా మొదలై అత్తగా, ఆఖరికి ముదుసలి అవ్వగా ఇలా యాభై ఏళ్లకు సాగే పాత్ర అది. ఇరవై అయిదేళ్లకే అంత వైవిధ్యంగా నటించడం రిచా చద్దాకే చెల్లింది. ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డునూ తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు తను తీసుకున్న పారితోషికం రెండున్నర లక్షల రూపాయలేనట. ‘డబ్బులు లెక్కలోకి రావు కానీ నాకు జీవితం ఇచ్చిన పాత్రగానే నగ్మా ఖతూను గుర్తుపెట్టుకుంటా’నంటుంది రిచా. ఆ తరవాత 11 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘మసాన్’, ‘ఫుక్రే’, ‘ఫుక్రే రిటర్న్స్’ అన్నీ రిచాను నటిగా ముందుకు తీసుకువెళ్లిన చిత్రాలే.
నటిస్తూనే ఉండాలి..
‘హీరోయిన్’ అనే ట్రాప్‌లో పడకుండా క్యారెక్టర్ నటిగానే తను సాగుతోంది. ‘హీరోయిన్’గా ఓ పరిమితికి లోబడి నా కెరీర్‌ను ఎండ్ చేసుకోవాలని అనుకోవడం లేదంటుం’ది నిఖార్సుగా. చివరిదాకా నటిస్తూ ఉండాలనే ధ్యేయం తనది. అంతే కాదు నటిగా నిరూపించుకునే పాత్రలన్నీ చేయాలన్న ఆశా లేకపోలేదు. అందుకే 2017లోనే వెబ్సిరీస్ల్లోకీ వచ్చేసింది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే వెబ్‌సిరీస్‌లా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ భవిష్యత్తంతా అందులో ఉందని ముందుగానే గుర్తించిన అతి కొద్దిమందిలో తను ఒకరు. క్రికెట్ లీగ్ చుట్టూ నడిచే ‘ఇన్సైడ్ ఎడ్జ్’ వెబ్‌సిరీస్‌లో అద్భుత నటనను ప్రదర్శించింది. అంతర్జాతీయ ప్రాజెక్టుల్లోనూ నటిస్తోంది. ‘షకీలా’ చిత్రంతో దక్షిణాదికి పరిచయం అయింది.
వైవిధ్యమైన తన తల్లిదండ్రుల నేపథ్యాలు భిన్నంగా ఆలోచింపజేసేవిగా తయారు చేశాయని అంటుంది రిచా నర్మగర్భంగా. తండ్రి పంజాబీ, వ్యాపారవేత్త. తల్లి బీహారి, ప్రొఫెసర్. అమృత్‌సర్‌లో పుట్టిన రిచా పెరిగిందంతా దిల్లీలోనే. మోడలింగ్‌పై ఇష్టంతో ముంబయికి వచ్చేసింది. అప్పుడే థియేటర్‌పై మక్కువ ఏర్పడింది. ఇండియా, పాకిస్థాన్లలో ఎన్నో నాటకాల్లో నటించింది. ఆ తరవాత సినిమాల్లోకి వచ్చింది. సినిమాలే ఆమె ప్రయారిటీ అనుకుంటే పొరపాటే. బ్రేక్ దొరికితే తన వ్యాపకాలు మారిపోతాయి. పుస్తకాలు చదువుతుంది. పెయింటింగ్స్ వేస్తుంది. పాత సూట్‌కేసులతో టేబుళ్లను తయారుచేస్తుంది. ఒడిస్సీ ప్రాక్టీస్ చేస్తుంది. సంగీతమూ వచ్చు. ఆ మధ్య ఓ ప్రత్యేక ట్రైబల్ నృత్యాన్ని నేర్చుకోవడానికి కజకిస్తాన్‌కు వెళ్లింది.
ఈ భూమ్మీద నువ్వు చేయనివి ఏమైనా ఉన్నాయా? అని స్నేహితులు ఆట పట్టిస్తుంటారట. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడే నేటి తరం మహిళ రిచా. ‘ఇడియట్స్ అంటే నాకు అలర్జీ’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఇలా ఓపెన్‌గా ఉండడం వల్ల ‘బోల్డ్’ అనే పేరొచ్చింది. తను ఇలాంటి ట్యాగ్‌లను అస్సలు పట్టించుకోదు. ‘సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు ఫీల్ అయ్యే రోజులు ఎప్పుడో పోయాయి, అవన్నీ పెయిడ్ ట్రోల్స్ అని ఎవరికైనా అర్థం అవుతుంద’ని చెప్పేస్తుంది. మూస ధోరణి నుంచి సరికొత్త దశకు చేరుతోన్న ఇండియన్ సినిమాకు రిచా చద్దా ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ తార. ఆమె మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆశిద్దాం.
ప్రేమకథ
కోవిడ్ లేకపోతే గత ఏప్రిల్‌లో రిచా చద్దా, అలీ ఫజల్ వివాహం జరిగి ఉండేది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ‘ఫుక్రే’ షూటింగ్లో తొలిసారిగా కలుసుకున్నారు. ఇద్దరివీ థియేటర్ నేపథ్యాలే. అభిరుచులూ కలిశాయి. ‘మీర్జాపూర్’తో అలీ అందరి దృష్టినీ ఆకర్షించాడు. జాతీయ, అంతర్జాతీయ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 2017లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ తన చిత్రం ‘విక్టోరియా అండ్ అబ్దుల్’ ప్రదర్శనలో రిచాకు ప్రపోజ్ చేశాడు అలీ. వెంటనే అంగీకరించింది రిచా. ‘ఇద్దరం ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా మాకంటూ సమయం ఎప్పుడూ కేటాయించుకుంటూనే ఉన్నాం’ అంటాడు అలీ. ఈ ఏడాదైనా ఈ జంట పెళ్లిపీటలెక్కుతుందేమో చూడాలి.