అప్పట్లో కొండల్ని రాసిచ్చారు ... ఇప్పుడు లేని భూమికి బుక్కిచ్చారు

ABN , First Publish Date - 2022-05-17T06:32:18+05:30 IST

రెవెన్యూ శాఖలో ఆ మేడం.. ఓ మాయల మరాఠీ. శింగనమల మండలంలో ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాలను అప్పనంగా ఇతరులకు రాసిచ్చిన ఆమె.. ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు. లేని భూమిని ఉన్నట్లు చూపించారు

అప్పట్లో కొండల్ని రాసిచ్చారు ... ఇప్పుడు లేని భూమికి బుక్కిచ్చారు
కుడివైపు తహసీల్దార్‌... ఎడమవైపు సీఎస్‌డీటీ పేర్లతో వచ్చిన 1బీ

మేడం.. తగ్గేదేలే...

అప్పట్లో కొండల్ని రాసిచ్చారు

ఇప్పుడు లేని భూమికి బుక్కిచ్చారు

పుట్లూరులో 350 ఉత్తుత్తి పాస్‌ పుస్తకాలు

ఒక్కొక్కటి రూ.80 వేలు.. రూ.2 కోట్ల వసూలు

వైసీపీ నాయకుడి వాటా రూ.50 లక్షలు


రెవెన్యూ శాఖలో ఆ మేడం.. ఓ మాయల మరాఠీ. శింగనమల మండలంలో ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాలను అప్పనంగా ఇతరులకు రాసిచ్చిన ఆమె.. ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు. లేని భూమిని ఉన్నట్లు చూపించారు. డైక్లాట్‌లో లేని సర్వే నెంబర్లు వేశారు. పాస్‌బుక్‌లు, వన బీ అడంగల్‌.. ఇలా అన్నీ సమకూర్చి చేతిలో పెడుతున్నారు. డబ్బులు ఇస్తే ఇలా ఏదైనా చేయగలరు. పుట్లూరు మండలంలో వందల ఎకరాలకు ఇలా పాస్‌బుక్కులు సృష్టించారు. రూ.కోట్లలో దండుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాయాజాలానికి మేడమే సూత్రధారి అని తెలిసింది. నోరు మెదపకుండా ఉండటానికి, ఆ మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడికి భారీగా ముడుపులు ఇచ్చారని సమాచారం. భూమే లేనప్పుడు.. పాస్‌ పుస్తకాన్ని ఏం చేసుకుంటారు..? అని అనుకోకండి. బ్యాంకు రుణాలు తీసుకుని సొమ్ము చేసుకుంటారు. గతంలో పనిచేసిన మండలాల్లో మేడం చాలా అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఉన్న ఓ కేసు విచారణ జరుగుతోందని సమాచారం. అయినా మేడం తగ్గిందే లేదు. 


భూ మండలంలో ఉండదు..

సొంత భూములకు పాసుబుక్కులు లేక అల్లాడుతున్న రైతులు ఎంతోమంది. ఆనలైనలో ఎక్కించుకోలేక తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్యులు కూడా చాలామంది కనిపిస్తుంటారు. కానీ పుట్లూరు మండలంలో భూమి లేకపోయినా పాసుబుక్కు అందజేస్తున్నారు. అందులో చూపిన భూమి.. ఈ భూమండలంలో ఎక్కడా కనిపించదు. మండల రెవెన్యూ అధికారులు మాత్రం స్పష్టంగా సర్వే నెంబర్లు కనపడేలా చేస్తారు. పోనీ ఆ సర్వే నెంబర్లు డైక్లాట్‌లో ఉంటాయా..? అంటే ఉండవు. అన్ని రకాల భూముల సర్వే నెంబర్లను రెవెన్యూ అధికారులు డైక్లాట్‌లో పొందుపరుస్తారు. కానీ పుట్లూరులో సృష్టించిన ఈ సర్వే నెంబర్లు డైక్లాట్‌లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. ఈ వ్యవహారం పెద్ద వ్యాపారంగా మారింది. ఆ రెవెన్యూ అధికారి కనుసన్నల్లో చాపకింద నీరులా జరిగిపోయింది. ఆ మండల పరిధిలో 350 ఎకరాలకు పాస్‌ బుక్కులు సృష్టించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ భూములకు సర్వే నెంబరుతో పాటు వన బీ అడంగల్‌, పాస్‌బుక్కు వచ్చేస్తుంది. వీటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు సులువుగా పొందొచ్చని అంటున్నారు.


 రూ.2 కోట్లకు పైగా..

భూమి లేని పాసుపుస్తకాల వ్యవహారంలో రూ.2 కోట్లకుపైగా చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. 350 ఎకరాలకు పైగా అలా సృష్టించినట్లు తెలిసింది. ఇదంతా బయటకు రాకుండా, వివాదం కాకుండా ఉండటానికి ఆ మండలంలోని ఓ కీలక నాయకుడికి రూ.అర కోటి ముడుపులు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో శింగనమలలో పనిచేసిన ఆ అధికారి, ఈ వ్యవహారంలో అంతాతానై పనిచేసినట్లు తెలుస్తోంది. శింగనమలలోనూ కొండ ప్రాంతాలను, ప్రభుత్వ భూములను మరొకరి పేరుతో చేయించడంపై అప్పట్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ తహసీల్దారు కార్యాలయంలో వన బీ అడంగల్‌లో సృష్టించే సమయంలో కుడివైపు సంతకం ఆ అధికారిదే ఉంటుంది. ఎడమవైపు వాటిని ఇచ్చే అధికారి పేరు ఉంటుంది. కొన్ని అడంగళ్లలో మరో అధికారి పేరు వచ్చింది. తాను సెలవులో వెళ్లిన సందర్భాల్లో కిందిస్థాయిలో ఉన్న డిప్యూటీ హోదా అధికారికి బాధ్యతలు ఇవ్వకుండా, మరో డిప్యూటీ అధికారికి అప్పగిస్తారట. అలా కొన్ని ఫైళ్లలో ఆయన సంతకాలు ఉండటం గమనార్హం. ఆయనకు డబ్బు పెద్దగా అందజేయకపోయినా, మరో రూపంలో వాటా ఇస్తారని సమాచారం. 


ఖరీదైన పుస్తకాలు..

ఆ అధికారి సృష్టించే భూమిలేని పాసుపుస్తకాలు చాలా ఖరీదైనవి. ఎకరానికి రూ.20 వేల ప్రకారం, ఎన్ని ఎకరాలకు కావాలంటే అన్ని ఎకరాలకు పాస్‌ పుస్తకం ఇస్తారట. ఒక్కో పుస్తకానికి రూ.80 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పాస్‌ పుస్తకంలో 3.50 ఎకరాల నుంచి 4.50 ఎకరాలు చూపించారని సమాచారం. పుట్లూరు మండలకేంద్రంలోని సర్వే నెంబరు 2029-4లో సింగంరెడ్డి గారి పద్మావతమ్మ పేరుతో 4.95 సెంట్లు, సర్వే నెంబరు 2029-5లో సింగంరెడ్డి గారి ఆదిలక్ష్మి పేరుతో 4.80 ఎకరాలు, సర్వే నెంబరు 2028-1లో దాసరి అనురాధ పేరుతో 4.58 ఎకరాలు, సర్వే నెంబరు 2028-2లో గంగిరెడ్డి గారి రామలక్షుమ్మ పేరుతో 4.60 ఎకరాలు, సర్వే నెంబరు 2028-3లో కత్తి లక్ష్మమ్మ పేరుతో 4.57 ఎకరాలు, సర్వే నెంబరు 2028-4లో తలారి నాగవేణి పేరుతో 3.59 ఎకరాలు, అదే మండలం కుమ్మనమల గ్రామం సర్వే నెంబరు 961-5బీలో చెలిమి రామాంజినేయులు పేరుతో 3.50 ఎకరాలు, సర్వే నెంబరు 961-5బీలో పిన్నదరి శంకర్‌ పేరుతో 3.50 ఎకరాలు, సర్వే నెంబరు 962-1లో ఆనంద్‌ కుమార్‌ బండారి పేరుతో 3.50 ఎకరాలు,  చింతకుంట గ్రామం సర్వే నెంబరు 267లో బత్తిన కల్పన పేరుతో 4.50 ఎకరాలు, సర్వే నెంబరు 267-1లో వీరాపురం శ్రీలత పేరుతో 4.50 ఎకరాలు, అరకటివేమల గ్రామంలో సర్వే నెంబరు 377-4లో బడవెంకటి శైలజ పేరుతో 2.39 ఎకరాలు, సర్వే నెంబరు 378-5లో బండారు నాగరత్నమ్మ పేరుతో 3 ఎకరాలకు 1బీ అడంగల్‌ ఖాతాలు, పాసుబుక్కులు అందాయి. ఇలా వందల సంఖ్యలోనే పాసుబుక్కులు అందజేసినట్లు సమాచారం. ఇవన్నీ మెట్ట భూములని, తాతల నుంచి సంక్రమించిన ఆస్తి అన్నట్లుగా (పిత్రార్జితం) అనువంశికమని ముద్రించి ఇచ్చారు. ఈ పుస్తకాలను అడ్డుపెట్టుకుని, బ్యాంకుల్లో రూ.2 లక్షల వరకు రుణాలు పొందేందుకు వ్యూహం పన్నినట్లు ప్రచారం జరుగుతోంది.


విచారిస్తాం..

పుట్లూరు మండలంలో భూములు లేకుండానే పాసు పుస్తకాలు అందిస్తున్నారన్న విషయం తెలిసింది. తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తాం. విచారణకు ఓ తహసీల్దార్‌తో పాటు డివిజన మేనేజర్‌ను (ఈడీఎం) నియమిస్తాం. ఎవరెవరికి పాస్‌ బుక్కులు ఇచ్చారనే విషయం ఆనలైనలో స్పష్టంగా తెలుస్తుంది. 

- మధుసూదన, అనంతపురం ఆర్డీఓ



Updated Date - 2022-05-17T06:32:18+05:30 IST