మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-09-30T06:19:22+05:30 IST

అక్రమాలపై మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ షేక్‌ నాసిర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ సస్పెన్షన్‌
షేక్‌ నాసిర్‌

మదనపల్లె, సెప్టెంబరు 29: మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ షేక్‌ నాసిర్‌పై  సస్పెన్షన్‌ వేటు పడింది. 2016-18 మధ్య అనంతపురం జిల్లా కదిరిలో సబ్‌రిజిస్ర్టార్‌గా పనిచేసిన ఈయన అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ కర్నూలు డీఐజీ శ్రీనివాసులు  చర్యలు తీసుకున్నారు. నిషేధిత జాబితాలోని అసైన్డ్‌ భూముల అక్రమ రిజిస్ర్టేషన్లతో పాటు నకిలీ చలానాలతో రిజిస్ర్టేషన్లు చేసినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. కదిరిలో పనిచేస్తున్న షేక్‌ నాసిర్‌... డిపార్ట్‌మెంటల్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ ఏడాది మార్చి 16న మదనపల్లెకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన 6నెలల వ్యవధిలోనే సస్పెన్షన్‌కు గురికావడం  చర్చనీయాంశంగా మారింది. కదిరిలో అసలు చలానాలే లేకుండా రిజిస్ర్టేషన్‌ చేసినట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కర్నూలు డీఐజీ జారీ చేసిన ఉత్తర్వులను, జిల్లా డీఐజీ పుష్పలత వెంటనే అమలు చేయడం మరింత చర్చనీయాంశమైంది.సాధారణంగా ఉన్నతాధి కారులు చర్యలు తీసుకుంటే,  ఆ ఉత్తర్వులు అందినాకే అమలు చేసే వారు. ఈయన విషయంలో మాత్రం బుధవారం ఉత్తర్వులు అందడం, అప్పటికే విధుల్లో ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌కు ..చిత్తూరు డీఐజీ ఫోన్‌ చేసి చార్జి అప్పగించి, రిలీవ్‌ కావాలని ఆదేశించడంతో నాసిర్‌.. బుధవారం మధ్యాహ్నమే సీనియర్‌ అసిస్టెంట్‌ మేనకకు బాధ్యతలు అప్పగించి రిలీవయ్యారు. నాసిర్‌ సస్పెండ్‌ అయ్యారనే సమాచారం ఉదయాన్నే తెలియడంతో రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న పత్రాలు రిజిస్ర్టేషన్‌ చేయాలని కొందరు, ఇప్పటికే పెండింగ్‌ పెట్టిన నెంబర్లను రిలీజ్‌ చేసి, రెగ్యులర్‌ నెంబర్‌ ఇవ్వాలని మరికొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు ఆయనపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో వెంటనే రిలీవ్‌ కావాలని ఒత్తిడి పెరగడంతో ఆయన తప్పుకోక తప్పలేదు.దీంతో బాధితులైన డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు లబోదిబోమంటున్నారు.

Updated Date - 2021-09-30T06:19:22+05:30 IST