
మధుబని: బీహార్లో రెండు నెలల తరువాత తిరిగి కరోనా కేసులు పెరిగాయి. మధుబని జిల్లాకు గడచిన మూడు రోజుల్లో ఢిల్లీ, ముంబైల నుంచి వచ్చిన 69 మందికిపైగా ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మధుబనికి చెందిన వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మధుబని రైల్వే స్టేషన్కు ముంబై, డిల్లీల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా టెస్టులు చేయగా 69 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయన్నారు.
ఈ సందర్భంగా సివిల్ సర్జన్ సునీల్ కుమార్ ఝా మాట్లాడుతూ తాజాగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులలో ఏ ఒక్కరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు. అందుకే వారికి హోమ్ ఐసొలేషన్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా కరోనా కేసులు నమోదైన నేపధ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన రైళ్లలో ప్రయాణించినవారికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు.