
ఇంటర్నెట్ డెస్క్: అతడికి పెళ్లయి వారం దాటిపోయింది. కానీ భార్య మాత్రం అతడిని దగ్గరకు రానివ్వడంలేదు. కాస్త టైం కావాలంటూ భర్తను దూరం పెట్టసాగింది. భార్య సిగ్గు పడుతోందేమోనని తనకి తాను సర్ది చెప్పుకున్న అతడు.. ఆమెను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు. ఆమె మనసు మారేవరకూ ఓపిగ్గా ఎదురు చూసేందుకు నిర్ణయించుకున్నాడు. సరిగ్గా పదిరోజుల తరువాత అతడి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. అప్పటిదాకా తాను కంటున్న కలలన్నీ ఒక్కసారిగా కలలై పోవడంతో అతడు హతాశుడైపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ టిక్మాగఢ్ జిల్లాకు చెందిన రంజిత్ సింగ్ కొంత కాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచి కుటుంబంలోని యువతి కోసమని అతడి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలో రంజిత్‌కు ఓ పెళ్లిళ్ల మధ్యవర్తి పరిచయమయ్యాడు. తన చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పిన ఆ మధ్యవర్తి.. ఆమెనే రంజిత్‌కు ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రతిపాదించాడు. ఇందులో అభ్యంతరకరమైనదేమీ లేకపోవడంతో రంజిత్ కూడా సరేనన్నాడు. మార్చి 20న వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఈ క్రమంలో రంజిత్ పెళ్లి ఖర్చుల కింద ఆ మధ్యవర్తికి దాదాపు లక్షన్నర రూపాయలు ఇచ్చుకున్నాడు కూడా! ఇన్నాళ్ల ప్రయత్నాల తరువాత రంజిత్ ఓ ఇంటివాడయినందుకు అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతగానో సంతోషించారు.
అయితే.. పెళ్లి తరువాత రంజిత్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. భార్య అతడిని దూరం పెట్టసాగింది. రోజులు గడుస్తున్నా భార్యలో మాత్రం మార్పు రాలేదు. సరిగ్గా పదవ రోజు రాత్రి.. ఆమె ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి పరారైపోయింది. పోతూ పోతూ ఇల్లాంతా గుల్ల చేసి మరీ వెళ్లిపోయింది. ఇంట్లో తాను దాచిపెట్టిన 60 వేల రూపాయల నగదు, నగలు కూడా కనిపించకపోవడంతో రంజిత్ దిమ్మెరపోయాడు. అయితే.. తన పుట్టింటి వారు బేతుల్ జిల్లాలో ఉంటారని ఓసారి భార్య చెప్పిన విషయం గుర్తుకు రావడంతో అతడు అక్కడి పోలీసులను సంప్రదించాడు. అతడి ఫిర్యాదు మేరకు వారు ఆ ప్రాంతమంతా గాలించినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో.. ఇదంతా దొంగ పెళ్లిళ్ల ముఠా పని అయ్యుంటుందనే కోణంలో వారు దర్యాప్తు ప్రారంభించారు.