
బెంగళూరు : దేశవాళి క్రికెట్‌లో ప్రతిష్టాత్మక ‘రంజీ ట్రోఫీ(Ranji Trophy)’లో మధ్యప్రదేశ్(Madhya Pradesh) జట్టు సంచలనం సృష్టించింది. చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ముంబై(Mumbai)పై ఫైనల్ మ్యాచ్(Final match)లో చివరి రోజైన ఆదివారం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెండవ ఇన్నింగ్స్‌లో ముంబై కేవలం 269 పరుగులకే అలౌట్ అయ్యింది. దీంతో 108 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ సునాయాసంగా సాధించింది. విశ్లేషకులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోని మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్ మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. హిమాన్షు మంత్రి(37), శుభం శర్మ(30), రజత్ పటీదార్(30) రాణించడంతో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. స్వల్ప వ్యవధిలోనే కీలకమైన వికెట్లను కోల్పోయినప్పటికీ లక్ష్యం చిన్నదే కావడంతో విజయాన్ని దరిచేరింది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ్ 4 వికెట్లు తీసి ముంబై నడ్డివిరిచాడు. జీ.యాదవ్, పార్థ్ సహానీ చెరో 2 వికెట్లు తీసి ముంబై ఇన్నింగ్స్‌ని ముగించారు.
ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలైట్ అయ్యింది. అయితే ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ శతకాలు నమోదు చేయడంతో మధ్యప్రదేశ్ 536-10 భారీ స్కోర్ నమోదు చేసింది. యష్ దూబే(133), సుభం శర్మ(116), రజత్ పటీదార్(122) రాణించడంతో మధ్యప్రదేశ్ ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఆటగాళ్లు అంచనా మేర రాణించలేకపోయారు. 269 పరుగులకే కుప్పకూలారు. దీంతో అప్పటికే ఆధిక్యంలో మధ్యప్రదేశ్ 108 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించి టైటిల్‌ని ఎగురేసుకుపోయింది. కాగా ఈ సీజన్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల విషయానికి వస్తే.. ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేయడంతో 1000 పరుగులకు కేవలం 18 పరుగుల దూరంలో నిలిచాడు.
23 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో చంద్రకాంత్ కన్నీటి వీడ్కోలు..
అసలు ఏమాత్రం అంచనాల్లేని మధ్యప్రదేశ్ జట్టు విజయతీరాలకు చేరడం వెనుక కోచ్(coach) చంద్రకాంత్ పండిట్(Chandrakant Pandit) ముఖ్యభూమిక పోషించాడు. సరిగ్గా 23 ఏళ్లక్రితం ఇదే చినస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఆయన సారధ్యంలోని మధ్యప్రదేశ్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యం లభించినా మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. దీంతో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రకాంత్ పండిట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కోచ్ రూపంలో విదర్భ జట్టుకు తిరుగులేని విజయాలు అందించారు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు విదర్భ ఏకంగా 4 ట్రోఫీలు గెలిచింది. రంజీ, ఇరానీ ట్రోఫీలను వరుసగా గెలిపించిన ఘనత ఆయనకే దక్కింది. సూపర్‌స్టార్లు లేకపోయినా అద్భుతాలు చేశారు. తాజా విజయంతో కోచ్‌గా ఆయన ఖాతాలో మొత్తం 6 రంజీ ట్రోఫీలు చేరినట్టయ్యింది.