ప్రియురాలు పనిచేసే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు.. ఆ యువతి బయటకు వెళ్లాకా.. ప్రియుడు తన ఫ్రెండ్‌తో వచ్చి ఏం చేశాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-13T18:51:43+05:30 IST

ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్త ప్రేమగా..

ప్రియురాలు పనిచేసే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు.. ఆ యువతి బయటకు వెళ్లాకా.. ప్రియుడు తన ఫ్రెండ్‌తో వచ్చి ఏం చేశాడో తెలిస్తే..

ఇంటర్‌నెట్‌డెస్క్: ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రియురాలు ఓ వృద్ధురాలి ఇంట్లో పనిచేస్తోంది. ఆమెను కలవడానికి వెళ్లినప్పుడు.. వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించాడు. ప్రియురాలు మార్కెట్‌కు వెళ్లిందని తెలిసి స్నేహితుడితో కలిసి ఆ ఇంట్లోకి దూరాడు. మార్కెట్ నుంచి వచ్చాకా ఆ ఇంట్లో జరిగింది చూసి ప్రియురాలు షాక్‌కు గురైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


జిల్లాలోని హజీరా పట్టణం ప్రసాద్ నగర్‌కు చెందిన మోను గోస్వామి అనే యువకుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి జనక్‌గంజ్‌లోని న్యూశాంతి నగర్‌లో ఒంటరిగా నివాసముంటున్న ప్రతిభా భట్నాగర్ అనే 70ఏళ్ల వృద్ధురాలి ఇంట్లో 8ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రియురాలిని కలవడానికి మోను న్యూశాంతినగర్‌కు వస్తుండేవాడు. కానీ అతను వచ్చినప్పుడుల్లా ఆ వృద్ధురాలి ఇంటినే గమనిస్తుండేవాడు. 



అతడి మనసంతా ఆ ముసలావిడ ధరించిన బంగారు గాజులపైనే ఉండేది. వాటిని చూసినప్పుడల్లా అతడికి దుర్బుద్ధి కలిగేది. దీంతో మోను తన స్నేహితుడైన శుభమ్‌తో ఓ పథకం రచించాడు. అక్టోబర్ 6న న్యూశాంతి నగర్‌కు మరోసారి వచ్చాడు. ఈసారి తన స్నేహితుడిని తోడు తెచ్చుకున్నాడు. మధ్యాహ్న సమయంలో తన ప్రియురాలు మార్కెట్‌కు వెళ్లడం గమనించి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ముసలావిడ మంచంపై పడుకొని ఉంది. ఆమె నోట్లో దుస్తులు కుక్కి.. అరుస్తే చంపేస్తామని ఇద్దరూ బెదిరించారు. ఆవిడ చేతులకున్న రెండు బంగారు గాజులను, కొంత నగదును తీసుకొని వెళ్లిపోయారు. మార్కెట్ నుంచి తిరిగొచ్చిన ప్రియురాలు ఇంట్లో జరిగింది చూసి షాక్‌కు గురైంది. సంఘటన పట్ల వృద్ధురాలు తీవ్రంగా కలత చెందింది. బెంబేలెత్తిపోయిన ముసలావిడ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడింది. ప్రియురాలు కూడా ఎవరో దొంగలు వచ్చారే అనుకుంది కానీ మోను వచ్చాడని తెలియదు. కానీ ఈ విషయం చుట్టుపక్కలవాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిపక్కన ఉన్న సీసీకెమెరాలను పరిశీలించి.. మోను, శుభమ్‌ ఓ ఆటోలో దిగడం గమనించారు. ఆటో డ్రైవర్‌ను పట్టుకొని వారెక్కడినుంచి వచ్చారో కనుకున్నారు. నిందితుల ఇంటికి వెళ్లగా వారు అక్కడ లేరు. ఇక్కడే గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. 



మోను, శుభమ్ దొంగతనం చేశాకా నేరుగా ఉజ్జయిని లోని బాబా మహాంకాళ్ ఆలయానికి వెళ్లారు. చేసిన దొంగతనానికి దేవుడికి క్షమాపణలు చెప్పారు. పాపం పోగొట్టుకోవాలని దొంగలించిన దాంట్లో కాస్త దానం చేశారు. అనంతరం వారి ఇంటికి వెళ్లిపోయారు. నిందితులు వచ్చారని తెలిసి పోలీసులు వారింటికి వెళ్లారు. మోను, శుభమ్‌లను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 


పోలీసులు మాట్లాడుతూ మోను, శుభమ్ వారి తప్పను ఒప్పకున్నారని, ఇదే వారి మొదటి దొంగతనం అని అన్నారు. చేసిన నేరానికి వారు బాధపడుతున్నారన్నారు. వారు చేసిన దొంగతనం గమనిస్తే.. వాళ్లు ఇంతకుముందు కూడా ఏవైనా దొంగతనాలు చేశారేమోనని అనుమానం కలుగుతోందన్నారు. మరిన్ని వివరాలకోసం వారిని విచారిస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-13T18:51:43+05:30 IST