దొంగ తెలివితేటలకు షాకైన పోలీసులు.. ఎప్పుడు వెళ్లినా కాలికి దెబ్బతగిలిందని మంచంపైనే కనిపిస్తుండడంతో.. అనుమానం వచ్చి తనిఖీ చేయగా..

ABN , First Publish Date - 2021-10-14T16:42:46+05:30 IST

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి..

దొంగ తెలివితేటలకు షాకైన పోలీసులు.. ఎప్పుడు వెళ్లినా కాలికి దెబ్బతగిలిందని మంచంపైనే కనిపిస్తుండడంతో.. అనుమానం వచ్చి తనిఖీ చేయగా..

ఇంటర్‌నెట్‌డెస్క్: పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌కు చెందిన ఓ వ్యక్తి కూడా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. పోలీసులు వచ్చిన ప్రతిసారీ మంచంపై పడుకొని కనిపించేవాడు. కాలికి దెబ్బ తగిలిందని నడవలేనని సమాధానం చెప్పేవాడు. కానీ పోలీసులకు ఓ చోట అనుమానం వచ్చి.. తనిఖీ చేయగా షాకుకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఇండోర్‌లోని లసుడియా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రాహుల్ వర్మ అలియాస్ టోపీ అనే 26ఏళ్ల వ్యక్తి పట్టణంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటాడు. అతడి గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే టోపీ ఇంటికి వెళ్లారు. కానీ అతడు కాలికి దెబ్బ తగిలిందని మంచంపై పడుకొని కనపడ్డాడు. దీంతో పోలీసులు ఇంటిని తనిఖీ చేసి డ్రగ్స్ ప్యాకెట్లు ఏవి దొరకకపోవడంతో.. అందిన సమాచారం తప్పేమోననుకుని వెనుదిరిగి వెళ్లిపోయారు. ‘‘టోపీ ఇంట్లో ఎటువంటి డ్రగ్స్ ప్యాకెట్లు లభించలేదు.. తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చావ్..’’అని పట్టుబడిన టోపీ స్నేహితుడిని పోలీసులు చితకబాదారు. కానీ అతడు మాత్రం తాను చెప్పిన సమచారం సరేనదేనని చెప్పాడు. 



పోలీసులు మరోసారి టోపీ ఇంటికి వెళ్లారు. అతను మంచంపైనే కనిపించాడు. కాలికి కట్టిన పట్టీ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ఒకసారి దానిని తీయమన్నారు. కానీ టోపీ తీయనన్నాడు. పట్టీ తీస్తే దెబ్బ త్వరగా మానదని చెప్పాడు. పోలీసులు అవేమి పట్టించుకోకుండా పట్టీని తీయించారు. అంతే పోలీసులకు షాకింగ్ సీన్ కనపడింది. పట్టీ ఇలా తీయగానే డ్రగ్స్ ప్యాకెట్లు అలా పడిపోయాయి. కాలికి ఎటువంటి దెబ్బ తగలలేదు. టోపీ తెలివితేటలకు పోలీసులు కంగుతిన్నారు. అతడిని అరెస్టు చేసి 13గ్రాముల బ్రౌన్ షుగర్‌ను సీజ్ చేశారు.



లసుడియా పోలీస్‌స్టేషన్ ఇంచార్జి ఇంద్రమణి పటేల్ మాట్లాడుతూ పట్టణంలో డ్రగ్స్ సరఫరాను ఎప్పటికప్పుడు అరికడుతునే ఉన్నామన్నారు. కానీ కొంతమంది తమనుంచి తప్పించుకోవడానికి కొత్తకొత్త దారులు వెతుకుతున్నారన్నారన్నారు. అలాంటివారు తమ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని, రాహుల్ కూడా తప్పించుకోవడానికి కాలికి దెబ్బ తగిలిందని ఓ కట్టుకథ అల్లాడని, కానీ అనుమానం వచ్చి కట్టువిప్పగా అసలు విషయం తెలిసిందన్నారు. 13 గ్రాముల బ్రౌన్ షుగర్ ధర రూ.50వేలు ఉంటుందన్నారు. 


రాహుల్ మాట్లాడుతూ కాలికి కట్టుకోవడం వల్ల తనని ఎవరూ పట్టుకునేవారు కాదని, దీంతో నగరంలో డ్రగ్స్ సరఫరా చేసేవాడినని చెప్పాడు. 

Updated Date - 2021-10-14T16:42:46+05:30 IST