Modi వస్తేనే నేను, నా భార్య కరోనా టీకా తీసుకుంటాం.. వైద్య సిబ్బందికి షాకిచ్చిన వ్యక్తి

Sep 27 2021 @ 02:36AM

తగ్గుతున్న కొవిడ్‌ పాజిటివిటీ

నాలుగు వారాలుగా 3 శాతానికి దిగువనే 

మోదీ వస్తేనే టీకా తీసుకుంటానంటూ ఓ వ్యక్తి హల్ చల్


న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: దేశంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు గత నాలుగు వారాలుగా 3 శాతానికి దిగువనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా ఆదివారం ఇది 1.90 శాతంగా నమోదైందని తెలిపింది. గత వారం రోజుల వ్యవధిలో పాజిటివిటీ రేటు సగటున 1.98 శాతంగా ఉంది.  ఇప్పటివరకు 85.60 కోట్ల టీకా డోసులను వినియోగించారు. ఇక దేశంలో 28,326 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3.36 కోట్లు దాటింది. మరో 260 కరోనా మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 4.46 లక్షలు దాటింది. కేరళలో 120 మంది, మహారాష్ట్రలో 58 మంది కొవిడ్‌తో మృతిచెందారు. కాగా, డెంగీ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరల్‌ జ్వరాలకు ఆయుర్వేద యాంటీ బయొటిక్‌ ఔషధం ‘ఫిఫట్రాల్‌’తో చెక్‌ పెట్టొచ్చని బనారస్‌ హిందూ వర్సిటీ పరిశోధకులు అంటున్నారు. అందులోని కొన్ని మూలికలు, ఆయుర్వేద మొక్కల మిశ్రమాలు వైరల్‌ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తాయని ప్రొఫెసర్‌ కె.ఎన్‌.ద్వివేది వెల్లడించారు. కాగా, వాసనను గుర్తించలేకపోవడం అనేది ప్రధానమైన కొవిడ్‌ లక్షణాల్లో ఒకటి. ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత రోగులంతా మునుపటిలా మళ్లీ వాసనలను గుర్తించగలుగుతున్నారు. అయితే, దీర్ఘకాలంలో మాత్రం కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుందని న్యూక్యాజిల్‌ వర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  


మోదీ వస్తేనే టీకా తీసుకుంటా

మధ్యప్రదేశ్‌లోని మారుమూల గిరిజన గ్రామం కికార్వా్‌స లో వ్యాక్సినేషన్‌ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందికి ఓ వ్యక్తి షాక్‌ ఇచ్చాడు. ప్రధాని మోదీ స్వయంగా వస్తేనే తాను, తన భార్య టీకా మొదటి డోసు వేయించుకుంటామని తేల్చి చెప్పాడు. అవాక్కయిన వైద్య సిబ్బంది మరోసారి వచ్చి అతడితో మాట్లాడి టీకా తీసుకునేలా ఒప్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. మరోవైపు, కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కోర్టుల్లో భౌతిక విచారణలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టుల వద్ద మళ్లీ రద్దీ పెరిగి వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలను నిరోధించేందుకు జాతీయ సమాచార కేంద్రం  కొత్తగా ‘కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్యాచ్‌’ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా కేసుల సమాచార వ్యవస్థలో ఉంచిన స్మార్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం జ్యుడీషియల్‌ అధికారులు అత్యవసర కేసులను మాత్రమే ఎంచుకునే వీలుంటుంది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.