తెల్లవారుజామున అంబులెన్స్ కింద కనిపించిన దృశ్యం చూసి.. బిత్తరపోయిన ఆస్పత్రి సిబ్బంది..!

ABN , First Publish Date - 2021-11-08T18:58:25+05:30 IST

అది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి..

తెల్లవారుజామున అంబులెన్స్ కింద కనిపించిన దృశ్యం చూసి.. బిత్తరపోయిన ఆస్పత్రి సిబ్బంది..!

ఇంటర్‌నెట్‌డెస్క్: అది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి. తెల్లవారుజామున పని నిమిత్తం అంబులెన్స్ దగ్గరికి వెళ్లిన వ్యక్తికి.. అక్కడ ఓ దృశ్యం కనిపించింది. అది చూసి అతడి మనస్సు చివక్కుమంది. ఇలా చేయడానికి వారికెలా మనసొప్పిందని తీవ్రంగా బాధపడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మోరీనా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. అసలు విషయానికొస్తే..


ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ, అప్పుడే పుట్టిన పసికందును గుర్తతెలియని వ్యక్తులు అంబులెన్స్ కింద వదిలివెళ్లారు. ఏదో పనిబడి అంబులెన్స్ దగ్గరికి వెళ్లిన భరత్ చతుర్వేది అనే ఆరోగ్య కార్యకర్తకు ఆ పసికందు ఏడుపు వినపడింది. ఆ ఏడుపు ఎక్కడినుంచి వస్తుందనుకుంటూ అంబులెన్స్ కింద చూశాడు. అంతే, ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంకా ఆ పాపకు కడుపులోంచి మాయ కూడా తీయలేదు. చీమలు కరుస్తుండడంతో.. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తోంది. వెంటనే అతడు ఆ పాపను తీసుకుని ఆస్పత్రిలోకి పరుగెత్తాడు. ఆస్పత్రి సిబ్బంది ఆ పాపను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి.. పసికందు శరీరంపై ఉన్న చీమలు తొలగించి, చికిత్స అందించారు. 



భరత్ చతుర్వేది మాట్లాడుతూ, తెల్లవారుజామున అంబులెన్స్ కింద పసికందు కనపడేసరికి నా గుండె ఆగినంతపనైందని, వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లానని చెప్పాడు. ఆ పాప కడుపులో నుంచి ఇంకా మాయ కూడా తీయలేదని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడ వదిలేసి వెళ్లారని చెప్పాడు. ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యి వుంటే కడుపులో నుంచి మాయ తీసేసి ఉండేవారని అన్నాడు. సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ఘోరానికి పాల్పడిన వారిని కనుక్కుంటామన్నాడు. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుందని చెప్పాడు.





Updated Date - 2021-11-08T18:58:25+05:30 IST