Schoolmate పై అత్యాచారం చేసిన Juvenile కు పదేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-07-17T00:43:33+05:30 IST

నాలుగేళ్ల క్రితం తన స్కూల్‌మేట్‌పై అత్యాచారం చేసిన మైనర్ బాలుడికి పోస్కో ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష..

Schoolmate పై అత్యాచారం చేసిన Juvenile కు పదేళ్ల జైలు

భోపాల్: నాలుగేళ్ల క్రితం తన స్కూల్‌మేట్‌పై అత్యాచారం చేసిన మైనర్ బాలుడికి (Juvenile) పోస్కో (Pocso) ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో 16, 17 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు విడిచిపెట్టింది. అత్యాచారానికి గురైనప్పుడు బాలిక వయస్సు 16 సంవత్సరాలు కాగా, బాలుడి వయస్సు 18 సంవత్సరాలకు ఆరు నెలలు తక్కువ. 2018 ఫిబ్రవరిలో అత్యాచార ఘటన జరిగింది. ఈ కేసు విచారణను జువెనైల్ కోర్టు జడ్జికి అప్పగించారు. 2019లో చార్జిషీటు దాఖలైంది.


సంఘటన వివరాల ప్రకారం, దోషిగా తేలిన బాలుడు, బాధితురాలు జబల్‌పూర్ సిటీలో ఒకే పాఠశాలలో  చదువుకున్నారు. 2018 ఫిబ్రవరి 5న బాలిక స్కూలు నుంచి తిరిగివస్తుండగా బాలుడు, అతని ఫ్రెండ్ మోటార్ సైకిలుపై వచ్చాడు. ఆమెతో మాట్లాడాలని అతను కోరగా, ఆమె నిరాకరించింది. దాంతో వారు బాలికను బలవంతంగా  బైక్‌పై ఎక్కించుకుని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. మూడో వ్యక్తి అప్పటికే అక్కడకి చేరుకున్నాడు. తనపై వారు అత్యాచారం చేసినట్టు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఈ కేసులోని ఇద్దరు నిందితులను బాధితురాలు గుర్తుపట్టలేదు. ఆమెపై అతని స్కూల్‌మేట్ మాత్రమే అత్యాచారం చేసినట్టు డీఎన్‌ఏ పరీక్షలు నిర్ధారించాయి.


పదేళ్ల జైలు...రూ.2,000 జరిమానా

కాగా, సాక్ష్యాలు లేకపోవడంతో ఇద్దరు నిందితులను కోర్టు విడిచిపెట్టగా, మూడో వ్యక్తిని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. లీగల్ ఎయిట్ అథారిటీ ద్వారా బాధితురాలికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దోషి నుంచి వసూలు చేసే రూ.2,000 సొమ్మును కూడా బాధితురాలికి ఇవ్వాలని పేర్కొంది. దోషి ఇంకెంతమాత్రం బాలుడు కాదని, 21 ఏళ్లు వచ్చాయని, జైలుకు మించిన సురక్షిత ప్రాంతం ఏదీ అతనికి ఉండదని పేర్కొంది. మిగిలిన శిక్షాకాలం జబల్‌పూర్ జైలులోనే అతన్ని ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-07-17T00:43:33+05:30 IST