Madras Day: ఘనంగా మద్రాస్‌ డే వేడుకలు

ABN , First Publish Date - 2022-08-23T16:10:15+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో ‘మద్రాస్‌ డే’ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

Madras Day: ఘనంగా మద్రాస్‌ డే వేడుకలు

                                                   - నగర వ్యాప్తంగా సందడి


చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం చెన్నైలో ‘మద్రాస్‌ డే’ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నగరవాసులకు మద్రాస్‌ డే(Madras Day) శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, పోలీసు కమిషనర్‌ కార్యాలయం, సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌, అన్నాసాలైలోని ఎల్‌ఐసీ భవనం, తాంబరం రైల్వేస్టేషన్‌, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో యువతీ యువకులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మద్రాస్‌ డే సందర్భంగా బాలబాలికలకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం ఇలా వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఇదే విధంగా నగరంలో మద్రాస్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ సెంటర్ల వద్ద యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసింది. మెరీనాబీచ్‌ సర్వీసు రోడ్డు సమీపంలో ఉన్న ‘నమ్మ చెన్నై’ సెల్ఫీస్పాట్‌ వద్ద కూడా యువతీ యువకులు సెల్ఫీలకు పోటీపడ్డారు. అదే విధంగా పలు కళాశాలల విద్యార్థులు  ర్యాలీలు నిర్వహించారు. స్థానిక అన్నానగర్‌లో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌(Central Railway Station) కటౌట్‌తో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ వద్ద సోమవారం ఉదయం నుండే పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమికూడి ‘హేపీ బర్త్‌డే మద్రాస్‌’ అంటూ సెల్ఫీలు తీసుకున్నారు. 


రాణిమేరీ కళాశాలలో...

 స్థానిక మెరీనాబీచ్‌లోని రాణి మేరీ మహిళా కళాశాలలో సోమవారం ఉదయం మద్రాస్‌ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినులంతా సెయింట్‌జార్జ్‌ కోట, లైట్‌హౌస్‌, సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ తదితర ప్రాచీన భవనాలు చిత్రపటాలతో ఉన్న ఫ్లకార్డులు, రంగురంగుల బెలూన్లు పట్టుకుని, తెలుపుటోపీలు ధరించి కామరాజర్‌ సాలై మంగళవాయిద్యాల నడుమ ర్యాలీ నిర్వాహించారు. ఆ సందర్భంగా ‘నమ్మ చెన్నై, హేపీ బర్త్‌డే చెన్నై’, ‘ఎల్‌ఐసీ దాన్‌ హైట్టు, చెన్నై దాన్‌ వెయిట్టు’ అంటూ విద్యార్థినులంతా  నినాదాలు చేశారు. ‘మా వూరు మద్రాసు ఇదే మా అడ్రసు’ అంటూ కొందరు పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థినులంతా కలిసి మద్రాస్ డే(Madras Day) సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. కాగా మద్రాస్ డే సందర్భంగా తాంబరం రైల్వే స్టేషన్‌ను సుందరీకరించారు. అదే విధంగా చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయాన్ని విద్యుద్దీపకాంతులతో తీర్చిదిద్దారు. 


ఊహించని మార్పులు చేయబోతున్నాం : సీఎం

ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) మద్రాస్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తాను మేయర్‌గా ఉన్నప్పుడు నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పాటుపడ్డానని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నగరాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారని, మద్రాసు నగరం పేరును చెన్నైగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు నగరం రూపురేఖలు మారాయని చెబితే అతిశయోక్తి కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనూ ఈ నగరంంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయని, మరింత సుందరమైన నగరంగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.



Updated Date - 2022-08-23T16:10:15+05:30 IST