High Court: మా తీర్పు నచ్చకపోతే అప్పీలు చేయవచ్చు

ABN , First Publish Date - 2022-08-05T14:00:22+05:30 IST

‘‘మా తీర్పులో తప్పులుంటే, తీర్పు నచ్చకపోతే అప్పీలు చేయవచ్చు. అంతేగాక తీర్పు మీకు అనుకూలంగా రాదేమోనని విచారణ నుంచి న్యాయమూ

High Court: మా తీర్పు నచ్చకపోతే అప్పీలు చేయవచ్చు

- అకారణంగా న్యాయమూర్తిని మార్చాలంటారా?

- ఓపీఎస్‌ మద్దతుదారుడికి తలంటిన హైకోర్టు

- తమకెలాంటి దురుద్దేశం లేదని న్యాయవాది వివరణ

- జడ్జిని మార్చాలంటూ మళ్లీ సీజేకు వినతిపత్రం


చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘మా తీర్పులో తప్పులుంటే, తీర్పు నచ్చకపోతే అప్పీలు చేయవచ్చు. అంతేగాక తీర్పు మీకు అనుకూలంగా రాదేమోనని విచారణ నుంచి న్యాయమూర్తినే మార్చాలని అడుగుతారా? ఇలా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం హేయమైన చర్య. ఇది న్యాయవ్యవస్థను అవమానించడమే’’ అంటూ మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) మద్దతుదారుడైన వైరముత్తుకు తలంటింది. తమ పిటిషన్‌ను వేరే న్యాయమూర్తి వద్దకు మార్చాలంటూ వైరముత్తు చేసిన అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన కోర్టు.. ఆ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం విచారించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్‌ రామస్వామి(The judge was Justice Krishnan Ramaswamy) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకోవాలంటూ సర్వసభ్యమండలి సభ్యుడిగా వున్న వైరముత్తు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి ఆ వినతిని తిరస్కరించిన విషయం తెలిసిందే. దాంతో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఓపీఎస్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, అక్కడా ఆయనకు చుక్కెదురైంది. ఈ కేసుపై హైకోర్టే విచారణ చేపడుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. రెండు వారాల్లో విచారణ ముగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను వేరే న్యాయమూర్తి(Judge) వద్దకు మార్చాలని ఓపీఎస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారీకి బుధవారం వినతిపత్రం సమర్పించారు. అయితే దానిపై సీజే స్పందించలేదు. దాంతో గురువారం జస్టిస్‌ కృష్ణన్‌ రామస్వామి వద్దకు వైరముత్తు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రాగా, ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీఎస్‌ వినతిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ విచారణ ముగిశాక.. మళ్లీ ఓపీఎస్‌ తరఫు న్యాయవాది సీజేకు మళ్లీ వినతిపత్రం పంపించారు. తమ కేసు విచారణను వేరే న్యాయమూర్తి వద్దకు మార్చాలని అందులో అభ్యర్థించారు.


పార్టీ కార్యాలయం ఈపీఎస్‏కు ఎలా అప్పగిస్తారు?

 సుప్రీంకోర్టులో ఓపీఎస్‌ అప్పీలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయాన్ని శాసనసభాపక్షనేత ఎడప్పాడి పళనిస్వామికి అప్పగించాలని మద్రాస్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. జూలై 11న ఈపీఎస్‌ ఆధ్వర్యంలో సర్వసభ్యమండలి సమావేశం జరుగుతున్న సమయంలోనే అన్నాడీఎంకే కార్యాలయం ముందు ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో రెవెన్యూ అధికారులు ఆ భవనానికి సీలు వేసిన విషయం తెలిసిందే. అయితే మద్రాస్‌ హైకోర్టు జోక్యం అనంతరం ఆ భవనాన్ని అధికారులు ఈపీఎ్‌సకు అప్పగించారు. దీనిని సవాల్‌ చేస్తూ ఓపీఎస్‌ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. పార్టీ సమన్వయకర్తనైన తనకే కార్యాలయంపై సర్వ హక్కులు వుండగా, ఆ భవన తాళాలను ఈపీఎస్ కు ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరి కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో లోతైన పరిశీలన చేయకుండానే హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారని, అందువల్ల ఆ భవనాన్ని తనకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఓపీఎస్‌ పిటిషన్‌లో అభ్యర్థించారు.

Updated Date - 2022-08-05T14:00:22+05:30 IST