తప్పు చేసే అధికారులను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-02-08T16:16:54+05:30 IST

ఆలయ భూములకు సంబంధించి జరిగే అక్రమాల్లో దేవాదాయ శాఖ, ఆలయ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక నూతన విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేయాలని మద్రాస్‌ హైకోర్టు మదురై శాఖ

తప్పు చేసే అధికారులను శిక్షించాలి

                       - దేవాదాయశాఖలో కొత్త విధాన రూపకల్పనకు హైకోర్టు ఆదేశం


అడయార్‌(చెన్నై): ఆలయ భూములకు సంబంధించి జరిగే అక్రమాల్లో దేవాదాయ శాఖ, ఆలయ అధికారుల పాత్ర ఉన్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఒక నూతన విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేయాలని మద్రాస్‌ హైకోర్టు మదురై శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కృష్ణగిరి జిల్లా తేన్‌కనిక్కోటలోని హనుమంతరాయ స్వామి దేవాలయానికి చెందిన కోట్లాది రూపాయల భూములను కొందరు దేవాదాయ, ఆలయ అధికారుల సహకారంతో తమ వశం చేసుకున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, కబ్జాకు గురైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఆ జిల్లాకు చెందిన రాధాకృష్ణన్‌ అనే వ్యక్తి హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటిషన్‌ వేశారు. దీనిని న్యాయమూర్తి ఎస్‌ఎం.సుబ్రహ్మణ్యం విచారణ జరిపారు. ఆలయ భూముల్లో జరుగుతున్న గనుల తవ్వకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ సమీక్షించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ గనుల అక్రమాలకు పాల్పడే అధికారులు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడమేకాకుండా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆలయ భూముల్లో సాగుతున్న గనుల తవ్వకాలకు ఆలయ అధికారులకు సంబంధం ఉందా లేదా అనేది ఆరా తీయాలని కోరారు. ఈ అక్రమాలతో సంబంధం ఉన్న అధికారులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

Updated Date - 2022-02-08T16:16:54+05:30 IST