Request: మీరే విచారించండి

ABN , First Publish Date - 2022-08-06T13:42:23+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామిని(Justice Krishnan

Request: మీరే విచారించండి

- హైకోర్టు న్యాయమూర్తికి ఓపీఎస్‌ తరపు న్యాయవాది అభ్యర్థన

- క్షమాపణ చెప్పి, సీజేకిచ్చిన లేఖ వెనక్కి తీసుకోండి: జస్టిస్‌ కృష్ణన్‌ రామస్వామి

- చీఫ్‌ జస్టిస్‌ ముందుకు పిటిషన్‌ 


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 5: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామిని(Justice Krishnan Ramaswamy) తొలగించి మరో న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలంటూ రెండుమార్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం శుక్రవారం మనసు మార్చుకున్నట్లున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి ముందు విచారణ జరగ్గా ఆయన ముందు విచారణ జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని, న్యాయమూర్తిపై తామెలాంటి ఫిర్యాదు చేయలేదని ఓపీఎస్‌ తరఫు న్యాయవాది వివరించారు. తమ వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణ కోరారు. దీనిపై న్యాయమూర్తి కృష్ణన్‌ రామస్వామి స్పందిస్తూ.. ‘ఇప్పుడు చెప్పిన మాటలు లిఖితపూర్వకంగా చీఫ్‌ జస్టిస్‌(Chief Justice)కు ఇవ్వాలని, గతంలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా స్పష్టం చేయాలని సూచించారు. ఓపీఎస్‌ (OPS)అభిప్రాయం తీసుకున్న తరువాత తమ నిర్ణయం చెబుతామని న్యాయవాది అభ్యర్థించగా, న్యాయమూర్తి తదుపరి విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. విచారణ ప్రారంభమైన తరువాత లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పలేమని, అలాగే ప్రధాన న్యాయమూర్తికి గతంలో ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోలేమని ఓపీఎస్‌ తరఫు న్యాయవాది వివరించారు. ఆ పిటిషన్‌ విచారణ జరపడంపై తన ముందే అభ్యంతరం వ్యక్తం చేస్తే, తానే తప్పుకునేవాడినని, అలా కాకుండా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడమంటే న్యాయమూర్తిని అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు విచారణ వాయిదా వేశారు. మళ్లీ 4.30 గంటల కు విచారణ ప్రారంభం కాగా.. ఆ పిటిషన్‌ను వేరే బెంచ్‌ ముందుకు పంపించేందుకు వీలుగా సీజే ముందు పెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇదిలా వుండగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జి.జయచంద్రన్‌(Judge G. Jayachandran) విచారణ చేపట్టనున్నారు.

Updated Date - 2022-08-06T13:42:23+05:30 IST