గోవా టూ గుంటూరు అక్రమ మద్యం తరలింపు

ABN , First Publish Date - 2021-01-16T05:27:21+05:30 IST

గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం తరలించి, విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టుచేసి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గోవా టూ గుంటూరు  అక్రమ మద్యం తరలింపు
వివరాలను వివరిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, సెబ్‌ అదనపు ఎస్పీ కె.ఆరిఫ్‌హఫిజ్‌

 తాడికొండ అడ్డరోడ్డులోని గిడ్డంగిలో నిల్వలు

ఐదుగురి అరెస్టు.. 121మద్యం కేసులు స్వాధీనం


 గుంటూరు(కార్పొరేషన్‌), జనవరి 15: గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం తరలించి, విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టుచేసి భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.. తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన అత్తిపట్ల కిషోర్‌, బెల్లంకొండ కోటేశ్వరరావు, గుంటూరుకు చెందిన ఉన్నం శ్రీకాంత్‌ గత నెల 25న గోవాకు వెళ్లారు. అక్కడ 1332 మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి ఓ లారీలో గుంటూరు తరలించారు. తాడికొండ అడ్డరోడ్డు సమీపంలోని పావులూరి భానుచందర్‌మౌళికి చెందిన అచల అవెన్యూస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోని గోడౌన్‌లో వీటిని నిల్వచేశారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌ సెంటర్‌లో గొల్లపూడి శ్రీనివాసరావు ద్వారా విక్రయాలు చేపట్టారు. సమాచారం అందుకున్న గుంటూరు సెబ్‌ టూటౌన్‌ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్‌ఐ రిహానా తదితరులు దాడులు చేసి మద్యాన్ని స్వాఽధీనం చేసుకున్నారు. తాడికొండ అడ్డరోడ్డులోని గోడౌన్‌లో నిల్వ ఉంచిన 121 కేసుల మద్యాన్ని  స్వాఽధీనపరుచుకొని నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు.  లారీడ్రైవర్‌ గురవయ్య పరారిలో ఉన్నాడు. ఈ దాడుల్లో టూటౌన్‌ సెబ్‌ హెస్‌సీలు, సందీప్‌, రవికుమార్‌, కానిస్టేబుళ్లు నాగరాజు, శ్రీమన్ననారాయణ. శ్రీనివాసరావు, అక్కయ్య, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:27:21+05:30 IST