మల్లెలు పూచిన చోట.. కక్షల కార్చిచ్చు!

ABN , First Publish Date - 2021-05-09T04:46:35+05:30 IST

కోట మండలం కేశవరం పంచాయతీలో రాఘవాపురం ఓ కుగ్రామం.

మల్లెలు పూచిన చోట..   కక్షల కార్చిచ్చు!
రాఘవాపురం వ్యూ

230 కుటుంబాలు.. 525 మంది ఓటర్లు

19 రౌడీషీట్లు,  45 క్రిమినల్‌ కేసులు

ఆందోళనలో రాఘవాపురం ప్రజలు


మండు వేసవిలో మల్లెలు గుబాళించిన ఆ గ్రామంలో రాజకీయాలు కక్షల చిచ్చు రగిల్చాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని రెండుగా చీల్చేశాయి. ఒకరినొకరు హతమార్చుకునే దాకా పరిస్థితులను తీసుకెళ్లాయి. 

కోట, మే 8 : కోట మండలం కేశవరం పంచాయతీలో రాఘవాపురం ఓ కుగ్రామం. ఈ గ్రామంలో సుమారు 230 కుటుంబాలుండగా, అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. 10 సెంట్ల నుంచి ఒక ఎకరం దాకా పొలం ఉన్న సన్నకారు రైతులే. అందులో మల్లెలు సాగు చేిసి కుటుంబాలు పోషించుకుంటుంటారు. 


కక్షలు రగిల్చిన ఎన్నికలు


కేశవం పంచాయతీలో రాఘవాపురం ఓటర్లదే కీలకపాత్ర. గ్రామంలోని  సుమారు 525 మంది ఓటర్లు పంచాయతీ స్థితిగతులను రెండున్నర దశాబ్దాలుగా శాసిస్తున్నారు.  1994-96 మధ్య కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఆధిపత్యపోరు మొదలైంది.  అప్పటి వరకు ఒకే కుటుంబంలా ఉన్న ఆ గ్రామం రెండుగా చీలిపోయింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా గెలిచాడు.  అప్పటినుంచి ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలు, హత్యాప్రయత్నాలు పరిపాటిగా మారాయి. ఇరు వర్గాల వారు మరణించారు. గ్రామానికి చెందిన 19 మందిపై రౌడీషీట్లు,  వయసుతో నిమిత్తం లేకుండా 45 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో అత్యంత సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డుల్లో చేరిపోయింది.  ఈ నేపథ్యంలో  కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి రెండు రోజుల క్రితం ఓ వర్గానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారి బావిలో స్నానం చేయడంతో భగ్గుమంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకుడు మృతి చెందగా, మరో వర్గానికి చెందిన వ్యక్తి కొన ఊపిరితో  చికిత్స పొందుతున్నాడు.  ఈ పరిస్థితి ఎంతటి విపత్కర పరిణామాలకు దారి తీస్తుందోనని గ్రామస్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  


ఒకే కుటుంబంలా మెలిగాం 


అన్నదమ్ముల్లా మెలిగాం. బయటి వ్యక్తుల ప్రోత్సాహంతోనే గ్రామంలో కక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మారణహోమాన్ని ఆపాలంటే  పోలీసులు ముందుకురావాలి. 

 - వెంకటరమణయ్య


Updated Date - 2021-05-09T04:46:35+05:30 IST