వైభవంగా లక్షపుష్పార్చన పూజలు

ABN , First Publish Date - 2022-10-07T06:27:33+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన పూజలు ఆగమశాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు చేశారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని లక్షపుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం.

వైభవంగా లక్షపుష్పార్చన పూజలు
స్వామికి లక్షపుష్పార్చన పూజలు నిర్వహించిన అర్చకులు

యాదగిరిగుట్ట, అక్టోబరు6: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన పూజలు ఆగమశాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పుష్పాలతో లక్షపుష్పార్చన పూజలు చేశారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని లక్షపుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. సుమారు రెండు గంటలపాటు అర్చకబృందం, వేదపండితులు లక్షపుష్పార్చన వేడుకలు నిర్వహించారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. యాదగిరిక్షేత్రంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. దసరా సెలవులుకావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అధికసంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో మధ్యాహ్న సమయంలో కొండపైకి వాహనాలను అధికారులు అనుమతించలేదు. కారుకు రూ.500 రుసుము చెల్లిస్తామని, తమ కార్లను కొండపైకి అనుమతించాలని దేవస్థాన సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. కొండపైన తగినంత పార్కింగ్‌ ప్రదేశాలు లేవని, కొండపైన వాహనాలు ఖాళీ అయితేనే పార్కింగ్‌కు అవకాశం ఉంటుందని భక్తులకు సమాధానం చెప్పారు. వివిధ విభాగాల ద్వారా రూ.21,57,687 ఆదాయం వచ్చిందని, 9,640 మంది భక్తులు స్వామి దర్శనాలకు క్షేత్రానికి వచ్చారని దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని పార్లమెంటరీ సెక్రెటరీ శ్రీనివాసులు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఐఏఎస్‌ శేషాద్రి, డీఐజీ వెంకటేశ్వర్లు వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-07T06:27:33+05:30 IST