మాగుంట మండిపాటు

ABN , First Publish Date - 2022-06-25T05:27:09+05:30 IST

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానం పంపినా నగర కార్పొరేషన్‌ అధికారులు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాగుంట మండిపాటు
అసహనం వ్యక్తం చేస్తున్న ఎంపీ మాగుంట, హాజరైన అధికారులు

సమావేశానికి కార్పొరేషన్‌ అధికారుల డుమ్మాపై అసహనం

అన్నిశాఖల అధికారులు పాల్గొన్నా కీలకమైన శాఖలేని పరిస్థితి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 24 : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానం పంపినా నగర కార్పొరేషన్‌ అధికారులు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే... ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పా్‌సలు, రైల్వే గేట్ల ఏర్పాటు కోసం శుక్రవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్థానిక రామనగర్‌లోని తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వే, ఆర్‌అండ్‌బీ, నగర కార్పొరేషన్‌ అధికారులను ఆహ్వానించారు. ప్రధానంగా సమావేశంలో ఒంగోలు-ఎన్‌.అగ్రహారం గేటు, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, పాకల రైల్వేగేట్ల వద్ద నిర్మించే ఆర్‌యూబీ, ఆర్‌ఓబీలపై మూడు శాఖలతో సమీక్షించాల్సి ఉంది. సమావేశానికి రైల్వే ఉన్నతాధికారులు, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పాల్గొన్నా ఒంగోలు నగరంలో ఉన్న అగ్రహారం గేటు సమస్యపై చర్చించేందుకు కార్పొరేషన్‌ అధికారులు డుమ్మాకొట్టారు. కంటితుడుపు చర్యగా నగర పాలక సంస్థ పరిధిలో ఉద్యోగ విరమణ చేసి అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పంపారు. ఆ ఉద్యోగిని సమావేశానికి పంపడంతో ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఢిల్లీలో వేగంగా ప్రయత్నిస్తుంటే స్థానికంగా ఇబ్బందులా : ఎంపీ

రైల్వే నిర్మాణాల కోసం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రితోపాటు ఇతర ము ఖ్యమైన అధికారులను కలిసి త్వరగా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడంపై ఎంపీ మాగుంట అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగానే నగర పాలక సంస్థ అధికారులకు సమాచారమిచ్చినా సమావేశానికి గైర్హాజరుకావడాన్ని త ప్పుబట్టారు. కార్పొరేషన్‌ అధికారులు గైర్హాజరుపై విస్తృతంగా చర్చ నడిచింది. అనంతరం రైల్వే, అర్‌అండ్‌బీ అధికారులతో ఆయా రైల్వే గేట్లపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయరత్నం, ఆర్‌అండ్‌బీ ఈఈ నాయక్‌, డీఈ షేక్‌ మహూబుబ్‌, గిద్దలూరు రైల్వే ఏడీఈ జగదీష్‌, రాజేంద్ర ప్రసాద్‌, విజయవాడ ఏఈఈ నాగభూషణం, కార్పొరేటర్‌ చింతపల్లి గోపి పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:27:09+05:30 IST