మహా ప్రభంజనం

Published: Sun, 29 May 2022 01:39:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మహా ప్రభంజనంమహానాడు సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు , ప్రజలు (ఇన్‌సెట్లో) విక్టరీ సంకేతం చూపుతున్న బాబు

జనఉప్పెనగా మారినమహానాడు 

భారీగా తరలివచ్చిన పార్టీశ్రేణులు, ప్రజలు 

అగ్రభాగం ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే.. 

టీడీపీ చరిత్రలో ఈ మహానాడుకి ప్రత్యేకస్థానమని బాబు కితాబు 

బాబు ప్రస్తావించిన అంశాలపై ఆసక్తికర చర్చ 

జిల్లాలపై సమీక్ష, గ్రానైట్‌ దోపిడీ తేలుస్తానంటూ వ్యాఖ్య 

   (ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మహానాడు చివరికి మహాఉప్పెనలాగా మారిపోయింది. తొలిరోజు ఆ పార్టీ నాయకులు తండోపతండాలుగా తరలివస్తే మలిరోజు బహిరంగసభకు సాధారణ ప్రజానీకం ప్రజాఉప్పెనను తలపించేలా భారీగా తరలివచ్చారు. ప్రజాసమీకరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు లెక్కచేయలేదు. పాతరోజులను జ్ఞప్తికి తెస్తూ తమకు అందుబాటులో ఉన్న వాహనాలపై తరలివచ్చారు. వేదికకు ఆమడదూరంలో వాహనాలు ఆగిపోయినా, ఆపేసినా అక్కడి నుంచి జెండాలు పట్టుకుని యువతతో పాటు వృద్ధులు కూడా సభ వేదిక వద్దకు పరుగులు తీయటం విశేషం. రాష్ట్రస్థాయి కార్యక్రమం అయినప్పటికీ అన్నింటా ఉమ్మడి ప్రకాశం జిల్లావారే ప్రధాన భూమిక పోషించారు. లక్షలాదిగా తరలివచ్చిన సభికులలో కూడా జిల్లాకు చెందిన వారే అగ్రభాగాన ఉన్నారు. పార్టీ ఊహించిన దానికన్నా రెండు మూడు రెట్లు ప్రజలు హాజరుకావటం ద్వారా టీడీపీ చరిత్రలోనే కాకుండా రాజకీయంగా కూడా ఒంగోలు మహానాడు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని వ్యాఖ్యానించటం అందుకు నిదర్శనం.  


మహానాడు సూపర్‌ సక్సెస్‌. ఊహించినదానికన్న లక్షల్లో జనం తరలిరావడంతో పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టీడీపీ నాయకత్వంపై చంద్రబాబుకు ఉన్న నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకుంది. ఇప్పటికే జోష్‌లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలతో విసుగెత్తిన సాధారణ ప్రజలు మహానాడు జయప్రదంలో పాలుపంచుకున్నారు. తొలిరోజు ప్రతినిధులు 10వేల మంది వస్తారని భావించగా 50వేలకు మించి హాజరయ్యారు. మలిరోజైన శనివారం సాయంత్రం జరిగే బహిరంగ సభకు లక్షమంది రావచ్చని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేయగా 3లక్షలు దాటటం పార్టీశ్రేణులలోని ఉత్సాహాన్ని, సాధారణ ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తేటతెల్లం చేశాయి. బహిరంగసభకు మూడు లక్షల పైచిలుకు హాజరయ్యారని టీడీపీ నాయకత్వం ప్రకటించగా 2లక్షలు పైచిలుకే వచ్చారని ప్రభుత్వం నియమించుకున్న ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇవ్వటం విశేషం. వచ్చిన వారిలో సగానికిపైగా ఉమ్మడి ప్రకాశం జిల్లావారేనని కూడా నివేదిక అందినట్లు తెలిసింది. తెలుగుదేశం అభిమానులు ఈ సంఖ్య మరింతగా ఉండవచ్చని చెబుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ఇటు ఆంధ్రజ్యోతి బృందం అటు కొన్ని రాజకీయ సర్వే సంస్థలు ఇటు ప్రభుత్వం నియమించిన ఐబీ, ఆపార్టీ నేతల అంచాలను పరిగణనలోకి తీసుకున్నా 3లక్షలకు పైగా తరలివచ్చారని వారిలో కొంతభాగం ప్రజలు సభ ఆవరణకు దూరంగానే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉందని తేటతెల్లమవుతోంది. బహిరంగసభకు మధ్యాహ్నం 12లోపే తరలివచ్చిన వారిసంఖ్య 50వేలకుపైగానే కనిపించింది. ఆ తర్వాత క్రమేపి తరలివచ్చే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. చంద్రబాబు వేదిక మీదకు రాకముందే సభాస్థలి కిటకిటలాడింది. రమారమి 80 ఎకరాల స్థలం కూడా జనంతో కిక్కిరిసిపోయింది. 


  జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు 

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇలా తరలివచ్చిన వారి సంఖ్య లక్షన్నర వరకు ఉండవచ్చని అంచనా. అయితే పోలీసు నిఘా విభాగం వారు మాత్రం లక్షమందిపైగా అని నివేదించినట్లు తెలిసింది. జిల్లాలో కొండపి, పర్చూరు, అద్దంకి, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు, కందుకూరు, ఆ తర్వాత కనిగిరి, దర్శి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా తరలివచ్చారు. ఈ తొమ్మిది చోట్ల నుంచే 20 వేలమంది చొప్పున, మరికొన్ని నియోజకవర్గాల నుంచి 15వేలు, తక్కువలో తక్కువగా 10వేల మంది ఆ ప్రకారం లక్షా పాతికవేల మంది వరకు వచ్చినట్లు కనిపిస్తోంది. సుదూరంలో ఉన్న మార్కాపురం డివిజన్‌లోని వైపాలెం, గిద్దలూరు, ఆ పై మార్కాపురం నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకత్వంతో పాటు కిందిస్థాయి ముఖ్య కార్యకర్తలంతా తరలివచ్చారు. సమీపంలోని బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, ఆపై సీమలోని అన ంతపురం, చిత్తూరు, కర్నూలు, ఇటు ఎన్టీఆర్‌ జిల్లా, మచిలీపట్నం, పాత ఉభయగోదావరి జిల్లాల నుంచి ఎక్కువసంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మాత్రం నియోజకవర్గ, మండలస్థాయిలోని ముఖ్యనాయకత్వమంతా బహిరంగ సభకు తరలివచ్చింది. గతంలో లేనివిధంగా తెలంగాణ నుంచి కూడా గణనీయసంఖ్యలో మహానాడుకు వచ్చారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌, ఖమ్మం, భద్రాచలం జిల్లాల నుంచి వచ్చిన వారు అక్కడ ప్రత్యేకంగా కేరింతలు కొడుతూ కనిపించారు. 


పాతరోజులను గుర్తుతెచ్చిన  ట్రాక్టర్ల ర్యాలీలు 

ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు చివరికి ట్రావెల్స్‌ను ఇవ్వటానికి కూడా ప్రభుత్వం అడ్డంకులు కల్పించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న వాహనాలతో ఆపార్టీశ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. ప్రత్యేకించి గ్రామాలకు చెందిన ప్రజానీకం వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ఆపై బైకులు అడపాదడపా అందుబాటులో ఉన్న లారీల్లో తరలివచ్చారు. మొత్తం 50వేల వాహనాల్లో ప్రజలు తరలిరాగా ఈ మూడురకాల వాహనాలు కూడా అధికంగా కనిపించాయి. 15ఏళ్ల క్రితం ప్రజలు సభలకు ట్రాక్టర్లలో వచ్చేవారని, ఇటీవల కనిపించటం లేదని, ఈ పర్యాయం ప్రభుత్వం కల్పించిన అడ్డంకుల పుణ్యమా అని వారు ఇలాంటి వాహనాల్లో తరలిరావటం కనిపించిందని బాబు సహా ఆ పార్టీలోని సీనియర్లంతా వ్యాఖ్యానించటం విశేషం


దారులన్నీ మహానాడు వైపు..

ఇదిలా ఉండగా కొందరు పోలీసులు అమిత ఉత్సాహంతో సభకు వస్తున్న కొన్ని వాహనాల టైర్లు గాలి తీసేయటం, ఏదో ఒక సాకు చూపి ఫైన్‌ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ఇది కాకుంటే సరైన ట్రాఫిక్‌ నియంత్రణ లేకుండా వాహనాలు బహిరంగ సభ ఆవరణ వైపు రాకుండా అడ్డంకులు కల్పించారు. దీంతో  మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు నడిచి వచ్చి బహిరంగసభలో పాల్గొన్నారు. ఉదయం 10గంటల సమయానికే అన్నివైపుల నుంచి ప్రజలు వస్తున్న వాహనాలు బారులుతీరి కనిపించగా తిరుగుప్రయాణంలో రాత్రి పదిన్నరకు కూడా అదే దృశ్యం కనిపించింది. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.