మహా ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-05-26T06:51:08+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం గురువారం జరగనున్నది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి 63 అంశాలతో ఎజెండాను సిద్ధం చేశారు.

మహా ఉత్కంఠ
మేయర్‌ ఛాంబర్‌ తలుపుకి వినతిపత్రం అంటిస్తున్న అఖిలపక్ష కార్పొరేటర్లు

నేడే జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

ఏకతాటిపైకి విపక్షాలు

చెత్త పన్ను, ప్రైవేటు ఏజెన్సీలకు ఆస్పత్రుల నిర్వహణ అప్పగింత, వైసీపీ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై, టిడ్కో ఇళ్ల అప్పగింతలో జాప్యంపై నిలదీయాలని నిర్ణయం

టీడీపీ, జనసేన, వామపక్షాలు, బీజేపీ కార్పొరేటర్ల సమావేశం

అధికారులు, వైసీపీ కార్పొరేటర్లతో మేయర్‌ భేటీ

గొడవ జరిగే అవకాశం ఉందని మార్షల్స్‌ ఏర్పాటు

జీవీఎంసీ చరిత్రలో తొలిసారి 


విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం గురువారం జరగనున్నది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి 63 అంశాలతో ఎజెండాను సిద్ధం చేశారు. చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు వసూలు, జీవీఎంసీకి చెందిన రెండు ఆస్పత్రుల (ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లు...ఎఫ్‌ఆర్‌యూ) నిర్వహణను ఏడాదికి రూ.రెండు కోట్లు చొప్పున చెల్లించే ప్రాతిపదికన ఏజెన్సీలకు అప్పగింత, ఎండాడలో వైసీపీ కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో జాప్యం వంటి అంశాలపై గట్టిగా నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అధికారపక్షం కౌన్సిల్‌కు అంతరాయం కలిగించే సభ్యులను బయటకు తరలించేందుకు వీలుగా మార్షల్స్‌ను నియమిస్తోంది. నలుగురు పురుషులు, నలుగురు మహిళలతోపాటు ఒక సూపర్‌వైజర్‌తో మార్షల్స్‌ టీమ్‌ను సిద్ధం చేసింది. మార్షల్స్‌ను ఏర్పాటుచేయడం జీవీఎంసీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 

ఇదిలావుండగా కౌన్సిల్‌లో ఎలా వ్యవహరించాలి, అధికారపక్షం ఎజెండాలో రూపొందించిన ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలనే విషయమై చర్చించుకునేందుకు గురువారం టీడీపీ, జనసేన, సీపీఎం, బీజేపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కౌన్సిల్‌లో ఎవరు ఏ అంశాన్ని లేవనెత్తాలి?, జీరో అవర్‌ను ఎప్పుడు వినియోగించుకోవాలి?, గత కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు?, జగనన్న లేఅవుట్లలో ఇంటి స్థలాలకు లబ్ధిదారుల ఎంపికలో లోపాలు, ఎంపికైన వారికి పట్టాలు ఇవ్వడంలో జాప్యం, టిడ్కో ఇళ్ల కేటాయింపులో జాప్యం వంటి అంశాలపై ప్రజల పక్షాన నిలబడి పాలక పక్షాన్ని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. విపక్షాల నుంచి ప్రతిఘటన తీవ్రస్థాయిలో వుంటుందని గుర్తించిన మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి...అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులతో బుధవారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలకు ఏ విధంగా బదులివ్వాలనే దానిపై అధికారులతో పాటు సభ్యులకు అవగాహన కల్పించారు. 27 నుంచి టీడీపీ మహానాడు కార్యక్రమం ఉండడంతో ఆ పార్టీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకారని అధికారపక్షం భావించింది. అయితే కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాతే మహానాడుకు బయలుదేరి వెళ్లాలని టీడీపీ కార్పొరేటర్లు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సమావేశం వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది.


అఖిలపక్ష కార్పొరేటర్లు ఆందోళన

వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే మేయర్‌ అనుమతించలేదని ఆరోపణ

పార్టీ సమావేశానికి ఛాంబర్‌ వాడడంపై అభ్యంతరం

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి): మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఛాంబర్‌ ముందు బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం కార్పొరేటర్లు ఆందోళన  నిర్వహించారు. చెత్తపై యూజర్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని, ఈ మేరకు గురువారం జరిగే కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసేందుకు అఖిలపక్ష కార్పొరేటర్లు మేయర్‌ ఛాంబర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అధికార పార్టీ కార్పొరేటర్లు, నేతలతో గురువారం జరిగే కౌన్సిల్‌లో వ్యవహరించాల్సిన తీరుపై షాడో మీటింగ్‌ జరుగుతుండడంతో వారిని లోపలకు అనుమతించలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు. మేయర్‌ ఛాంబర్‌లో ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చ, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయాలి తప్ప, పార్టీ సమావేశాన్ని నిర్వహించడం ఏమిటంటూ టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ గంకల కవిత, సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బి.గంగారావు, టీడీపీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు తదితరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా షాడో మీటింగ్‌కు అధికారులను పిలవడం నిబంధనలకు విరుద్ధమని, ఆ అధికారులను కమిషనర్‌ తక్షణం సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. వినతిపత్రాన్ని మేయర్‌ ఛాంబర్‌ తలుపునకు అతికించి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ ఛాంబర్‌లో వారంతా సమావేశమై గురువారం జరిగే కౌన్సిల్‌లో ఏఏ అంశాలు ప్రస్తావించాల్సిందీ చర్చించారు. జీవీఎంసీ ఆదాయానికి గండికొట్టేలా అధికారులు, అధికారపక్షం నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తూర్పారబట్టడం చేయాలని నిర్ణయించారు. అధికారపక్షంపై ఐక్యపోరాటం చేస్తామని ప్రకటించారు.


Updated Date - 2022-05-26T06:51:08+05:30 IST